నకిలీ పత్రాలతో అమెరికా చెక్కేద్దామనుకుని, చిక్కేశారు-students caught with fake documents for us visa ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నకిలీ పత్రాలతో అమెరికా చెక్కేద్దామనుకుని, చిక్కేశారు

నకిలీ పత్రాలతో అమెరికా చెక్కేద్దామనుకుని, చిక్కేశారు

HT Telugu Desk HT Telugu
Apr 15, 2022 07:12 AM IST

అమెరికా కలను నెరవేర్చుకోడానికి తప్పుడు మార్గంలో ప్రయత్నించి దొరికిపోయారు కొందరు అభ్యర్ధులు. స్వస్థలాల్లో కాకుండా ఢిల్లీలో వీసాలకు దరఖాస్తు చేసుకోవడంలో మతలబు ఉందని గుర్తించిన ఆరా తీయడంతో అసలు గుట్టు బయటపడింది. స్టూడెంట్‌ వీసాల కోసం రాంగ్‌ రూట్‌లో ప్రయత్నించిన 12మందిని ఢిల్లీ చాణక్యపురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం (AFP)

అమెరికా వీసా కోసం తప్పుడు పత్రాలు సమర్పించిన పలువురు విద్యార్ధులుపోలీసులకు దొరికిపోయారు. ఢిల్లీలో తీగలాగితే విజయవాడ, హైదరాబాద్‌లలో డొంక కదిలింది. వీసా ప్రాసెస్‌ కోసం ఏజెంట్ల మాటలు నమ్మి తప్పుడు పత్రాలతో ఇంటర్వ్యూకు వెళ్ళిన ఓ యువకుడిని పోలీసులు నిలదీసేసరికి అసలు గుట్టు బయటపడింది. నకిలీ సర్టిఫికెట్లు, బ్యాంకు గ్యారంటీలు, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లను కాన్సులేట్‌లో సమర్పించి దొరికిపోయారు. 

 

విద్యార్ధుల అవసరం, ఆశల్ని అడ్డుపెట్టుకుని అభ్యర్ధులకు నకిలీ పత్రాలను ఇచ్చి పంపుతున్నారు. రాయబార కార్యాలయాల్లో పెద్దగా తనిఖీలు లేకపోతే వీసా వచ్చేస్తుంది. ఇలా విద్యార్ధుల నుంచి లక్షలాది రుపాయలు కన్సల్టెన్సీ ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో అమెరికాకు వచ్చే విద్యార్ధులు సమర్పించే అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా మాచవరానికి చెందిన ఓ విద్యార్ధి పోలీసులకు చిక్కాడు. ఏప్రిల్ 7న అతను ఢిల్లీ చాణక్యపురిలో వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు అపాయింట్‌ మెంట్‌ లెటర్‌, గుంటూరులో బ్యాంకు రుణం మంజూరైన పత్రాలను సమర్పించాడు. ఆ పత్రాలను యూఎస్‌ ఎంబసీ తనిఖీ చేయడంతో అవి నకిలీగా తేలింది. విజయవాడ పటమటలో ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ ద్వారా హైదరాబాద్‌, చెన్నై కాకుండా ఢిల్లీలో వీసా కోసం వచ్చినట్లు అతను వివరించాడు. స్ప్రింగ్‌ ఫీల్డ్‌ సంస్థకు చెందిన కేశవ్‌ తనను పంపినట్లు చెప్పాడు. అతను ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు ఏపీ, తెలంగాణలలో సోదాలు చేపట్టారు.

నకిలీలతో అమెరికా వీసాలు

అమెరికా స్టూడెంట్‌ వీసాల మంజూరులో ఇటీవల కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఓ ముఠా గుట్టు రట్టైంది. ఓ విద్యార్ధి సమర్పించిన పత్రాలపై సందేహించి, చాణక్యపురి పోలీసులకు అమెరికా రాయబార కార్యాలయం సమాచారం అందించింది. అతను సమర్పించిన పత్రాలలో లోపాలు గుర్తించి విచారించాల్సిందిగా కోరింది. ఏజెంట్లు, కన్సల్టెంట్ల సాయంతో దరఖాస్తు చేశానని సదరు విద్యార్ధి ఒప్పుకోవడంతో డిల్లీ పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. 12మంది విద్యార్ధులతో పాటు ఏజెంట్లు, కన్సల్టెంట్లు, వివిధ కంపెనీల నిర్వాహకులు 27మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి పలువురిని ఇలా వీసా కోసం పంపినట్లు గుర్తించారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న విద్యార్ధులు 25వేల నుంచి 2లక్షల వరకు చెల్లించి ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొంతమంది 5వేలకు కూడా ఈ పత్రాలు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు లోన్లు మంజూరై నగదు ఖాతాల్లో ఉన్నట్లు చూపినందుకు రెండు నుంచి ఐదు లక్షలు వసూలు చేస్తున్నారు. విజయవాడ స్ప్రింగ్‌ ఫీల్డ్‌ ఓవర్సీస్‌ కార్యాలయంలో పలు పత్రాలను ఢిల్లీ పోలీసులు సీజ్‌ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల్లో హైదరాబాద్‌ సంస్థల లెటర్లు ఉండటంతో నకిలీ ఎక్స్‌పీరియన్స్‌ పత్రాలకు హైదరాబాద్‌కు లింక్‌ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని హైదరాబాద్‌లో విచారిస్తున్నారు.

Whats_app_banner