SC ST Sub Plan : ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్ పొడిగింపు సరే... సంక్షేమ పథకాలేవి....?-ap governement extends sc st sub plan for another 10years oppositions criticizes overs scheme implementation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Governement Extends Sc St Sub Plan For Another 10years Oppositions Criticizes Overs Scheme Implementation

SC ST Sub Plan : ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్ పొడిగింపు సరే... సంక్షేమ పథకాలేవి....?

HT Telugu Desk HT Telugu
Jan 23, 2023 09:42 AM IST

SC ST Sub Plan ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్‌ప్లాన్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో పదేళ్లు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం పదేళ్ల కాలపరిమితితో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం గడువు జనవరి 23తో ముగియనుండటంతో మరో పదేళ్ల పాటు పథకాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దళితులు, గిరిజనుల అభివృద్ధిలో కీలకమైన సబ్‌ప్లాన్‌ను కొన సాగించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలను రద్దు చేసి సబ్ ప్లాన్ పొడిగించడంపై దళిత సంఘాలు పెదవి విరుస్తున్నాయి.

ఏపీలో సబ్‌ ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగించాలని సిఎం జగన్ నిర్ణయం
ఏపీలో సబ్‌ ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగించాలని సిఎం జగన్ నిర్ణయం

SC ST Sub Plan ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్ అమల్లోకి వచ్చి పదేళ్లు గడుస్తోంది. నేటితో సబ్‌ ప్లాన్‌ గడువు ముగియనుండటంతో మరో పదేళ్ల పాటు సబ్‌ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సబ్‌ ప్లాన్‌ను పొడిగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయనున్నారు. సబ్‌ ప్లాన్ గడువు ముగియనుండటంతో గవర్నర్ అమోదంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రులతో పాటు ప్రజా ప్రతనిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

మూడున్నరేళ్లలో రూ.49వేల కోట్ల వ్యయం....

SC ST Sub Plan ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో భాగంగా జూన్ 2019 నుంచి 2022 డిసెంబర్ దాకా రూ.49,710.17 కోట్లను ఖర్చు చేయడం జరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. నవరత్నాల్లో భాగంగా వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా 11.82 మంది ఎస్సీ పెన్షనర్ల కోసం రూ.7950.33 కోట్లను ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపారు. అమ్మఒడి పథకం ద్వారా 26.56 లక్షల మంది తల్లులకు రూ.2715.35 కోట్లను ఖర్చు చేశారు.

వైయస్సార్ ఆసరా పథకం కింద 33.50 లక్షల మంది లబ్దిదారులకు రూ.2567.63 కోట్లు, వైయస్సార్ చేయూత పథకం కింద 17.89 లక్షల మందికి రూ.3356.41 కోట్లు, వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద 2.44 లక్షల మందికి రూ.243.72 కోట్ల రుపాయలను అందించారు. జగనన్న తోడు పథకం కింద 3.39 లక్షల మందికి 7.95 కోట్లు, జగనన్న చేదోడు పథకం కింద 48 వేల మందికి రూ.43.98 కోట్లు చెల్లించారు.

వైయస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 2437 మందికి రూ.5.81 కోట్లు, మత్స్యకార భరోసా పథకం కింద 3283 మందికి రూ.3.28 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం కింద 3.89 లక్షల మంది విద్యార్థులకు రూ.668.995 కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకం కింద 4.44 లక్షల మంది విద్యార్థులకు రూ.1755.35 కోట్లు అందించారని ప్రభుత్వ లెక్కలుచెబుతున్నాయి.

2023-24లో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద 60 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.21.55 కోట్లు, వైయస్సార్ కణ్యాణమస్తు పథకం కింద రూ.211.63 కోట్లు అందించనున్నారు. నాన్ డీబీటి ద్వారా వైయస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ విద్యా కానుక, జగనన్న ఇళ్లు, వైయస్సార్ కంటి వెలుగు, తదితర పథకాల కింద 56.32 మంది లబ్దిదారులకు రూ.28,958.30 కోట్ల రుపాయలను అందించారు.

నవరత్నాలే తప్ప ప్రత్యేక పథకాల్లేవు....

ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం గతంలో అమల్లో ఉన్న 27 పథకాలను రద్దు చేశారని విపక్షాలు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉపాధి రంగాల్లో ముందడుగు వేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక లక్ష్యం పక్కదారి పడుతోందనే విమర్శలు ఉన్నాయి. సబ్ ప్లాన్‌ నిధులను వారి అభివృద్ధికే వినియోగించాలని చట్టం చెబుతున్నా ప్రభుత్వం ఉమ్మడి పథకాల్లో దానిని కలిపేసి అమలు చేస్తోంది. ఇలా సబ్ ప్లాన్ చట్టం ప్రాథమిక లక్ష్యానికి గండి కొట్టింది. అందరికీ వర్తించే పథకాలకు ఉప ప్రణాళిక నిధులు మళ్లిస్తోంది. ప్రభుత్వ విధానాలపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సబ్‌ ప్లాన్‌ నిధుల్లోను కోత పెట్టిన సర్కారు….

జనాభా దామాషాలో ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన నిధుల్ని కూడా పూర్తిగా కేటాయించ లేదు ఏపీలో ఎస్సీలు 16.4% ఉన్నారు. ఏటా బడ్జెట్‌లో ఆ మేరకు ఉపప్రణాళిక నిధులను కేటాయించాల్సి ఉన్నా . గత మూడేళ్లుగా అమలు కాలేదు. 2019-20లో 11%, 2020-21లో 11.9%, 2021-22లో 13.8% నిధులు మాత్రమే కేటాయించారు. ఈ మూడేళ్లలో రూ.16వేల కోట్ల వరకు కోత వేశారు. ఎస్టీల జనాభా 5.3% ఉండగా 2019-20లో 3.7%, 2020-21లో 3.9%, 2021-22లో 4.9% కేటాయించారు. ఈ మూడేళ్లలో రూ.4వేల కోట్ల కోత పడింది. మొత్తంగా సబ్‌ ప్లాన్‌ నిధుల్లో రూ.20వేల కోట్ల వరకు తగ్గిపోయాయని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఏపీలో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక 2019 నుంచి ఇప్పటివరకు రూ.49,710 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపించారు. ఇందులో 90శాతానికి పైగా నిధులను అందరికీ వర్తించే నవరత్న పథకాలకే వినియోగించారు. సామాజిక, వృద్ధాప్య పెన్షన్లు ఉపకారవేతనాల కింద ఇచ్చే సాయానికీ ఉపప్రణాళిక నిధుల్నే వినియోగించారు. జగనన్న గోరుముద్ద, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాల కింద చిన్నారులకిచ్చే గుడ్డు, మధ్యాహ్నభోజనం లెక్కల్నీ ఇందులోనే చూపించారు. అందరికి అమలు చేసే పథకాలకు సబ్‌ ప్లాన్‌ నిధులు వినియోగిస్తూ ప్రభుత్వం దళితులు మోసం చేస్తోందనే, మూడేళ్లలో సబ్ ప్లాన్ నిధులు ఏ పథకానికి ఎంత అమలు చేశారో లెక్కలు ప్రకటించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

IPL_Entry_Point