Migraine In Women । శృంగారంలో అసంతృప్తి వలన స్త్రీలకు తలనొప్పి.. నిజమా?!
27 February 2023, 21:35 IST
- Migraine In Women: మైగ్రేన్ తలనొప్పికి కారణాలు తెలియవు. అయితే కొన్నిసార్లు శృంగారంలో అసంతృప్తి కారణంగా స్త్రీలకు మైగ్రేన్ తలనొప్పి కలుగుతుందా? ఇక్కడ తెలుసుకోండి.
Migraine In Women
నేటి జీవనశైలిలో తలనొప్పి చాలా సాధారణం. నిరంతర పని కారణంగా తరచుగా తలనొప్పి వస్తుంది. కానీ సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌కు మధ్య వ్యత్యాసం ఉంది. తలకు రెండు వైపులా నొప్పి రావడం, కొంత సమయం తర్వాత బాగుపడడం అనేది ఒత్తిడి లేదా విశ్రాంతి లేకపోవడం వల్ల వచ్చే సాధారణ తలనొప్పి. మరోవైపు, మైగ్రేన్ నొప్పి తల సగం భాగంలో అంటే ఒక వైపు మాత్రమే వస్తుంది. మైగ్రేన్ తలనొప్పి భరించలేని విధంగా ఉంటుంది, ఏ పని చేయలేము. మాట్లాడటానికి అనిపించదు, ఏదైనా కాంతిని చూసినా సున్నితంగా అనిపిస్తుంది.
మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుంది అనే దానికి ఇప్పటికీ కచ్చితమైన కారణం తెలియదు. మెదడులోని నరాలు, రసాయనాలు, రక్తనాళాల్లో మార్పుల వల్ల కొంత కాలం పాటు ఈ నొప్పి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నొప్పి చాలా తీవ్రమైనది, ఒక వ్యక్తికి తట్టుకునే, ఏదైనా అర్థం చేసుకునే శక్తి కూడా ఉండదు. ఇతరులపై గట్టిగా అరుస్తారు.
మైగ్రేన్ ప్రారంభ లక్షణాలు చూస్తే బలమైన ఆకలి, అలసట, మెడ గట్టిపడటం, చిరాకు, ఆవలింత, నిరాశ వంటివి ఉండవచ్చు. కొన్నిసార్లు మైగ్రేన్‌లో వాంతులు కూడా వస్తాయి. ఈ లక్షణాల ద్వారా మైగ్రేన్ ప్రారంభమవడానికి ముందే గుర్తించినట్లయితే, నొప్పిని తగ్గించడానికి చర్యలు తీసుకోవచ్చు.
Migraine In Women- మహిళలకే మైగ్రేన్.. కారణాలివే
మైగ్రేన్ సాధారణంగా పురుషులు, మహిళలు ఇద్దరికీ వస్తుంది. అయితే ఈ కేసులు ఎక్కువగా మహిళల్లో మాత్రమే నమోదవుతున్నాయి. తరచుగా మహిళలు ఒకవైపు తలనొప్పి గురించి ఫిర్యాదు చేస్తున్నారంటే అది మైగ్రేన్ అని అర్థం చేసుకోవచ్చు. దీనికి అనేక దశలు ఉన్నాయి. మొదట్లో నెలకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి మైగ్రేన్ వస్తుంది. క్రమక్రమంగా నెలలో రెండు మూడు సార్లు రావడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇది హై ఫ్రీక్వెన్సీ ఎపిసోడిక్‌గా పురోగమిస్తుంది.
- మహిళల్లో మైగ్రేన్‌కు హార్మోన్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు ఉంటాయి. పీరియడ్స్, గర్భధారణకు ఇవి బాధ్యత వహిస్తాయి. ఈ హార్మోన్లు హెచ్చుతగ్గులకు గురైనప్పుడు, వారిలో మైగ్రేన్ తలనొప్పి కలుగుతుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ హెచ్చుతగ్గులకు లోనయినపుడు.
- కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ వచ్చే ముందు మైగ్రేన్ సమస్య ఉంటుంది, ఇది పీరియడ్స్ ముగిసిన తర్వాత నయమవుతుంది. బాలికల్లో యుక్తవయస్సు లేదా పీరియడ్స్ రావడంతో, మైగ్రేన్ సమస్య లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.
- సెక్స్‌లో అసంతృప్తి కూడా స్త్రీలలో మైగ్రేన్‌కు ఒక కారణం అని కొన్ని నివేదికలు తెలిపాయి. భారతీయ మహిళల్లో 72 శాతం మంది వైవాహిక జీవితంలో సెక్స్ పట్ల అసంతృప్తితో ఉన్నారని డ్యూరెక్స్ ఇండియా నివేదిక పేర్కొంది. 70 శాతం పైగా భారతీయ మహిళలు భావప్రాప్తి పొందడం లేదని సర్వే నివేదికలో వెల్లడైంది.
అసోసియేషన్ ఆఫ్ మైగ్రేన్ డిజార్డర్స్ ప్రకారం, భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది. స్త్రీలు కామోద్రేకం చెందినపుడు కూడా ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలై మైగ్రేన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పరిస్థితి లేనపుడు స్త్రీలకు తరచుగా తలనొప్పి కలుగుతుంది.
హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, తమ లైంగిక జీవితం బాగున్నప్పుడు మైగ్రేన్‌లు తగ్గుతాయని అమెరికన్ మహిళలు అంగీకరించారు.
మహిళల్లో మైగ్రేన్‌కు గర్భనిరోధక మందులు కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. దీని వల్ల శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి. గర్భనిరోధక మందులు ఎక్కువగా వాడినా మైగ్రేన్ సమస్య పెరుగుతుంది. మైగ్రేన్ తలనొప్పి ఉన్న మహిళలు గర్భనిరోధక మాత్రలు తీసుకోకుండా జాగ్రత్తపడాలి.
టాపిక్