Excessive Yawning । ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయా.. కారణాలు ఇవే!-know possible causes for excessive yawning and ways to treat the condition ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Excessive Yawning । ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయా.. కారణాలు ఇవే!

Excessive Yawning । ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయా.. కారణాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Jan 18, 2023 01:07 PM IST

Excessive Yawning: ఆవలింత సాధారణ చర్య, అయితే ఎక్కువగా ఆవలిస్తే ఆలోచించాల్సిన విషయమే. మీరు ఎక్కువగా ఆవలిస్తున్నారా? దానికి కారణాలు ఇక్కడ తెలుసుకోండి, నివారణ మార్గాలను చూడండి.

Excessive Yawning
Excessive Yawning (Unsplash)

ఆవలింత అనేది ఒక సాధారణమైన శారీరక క్రియ అని అనిపిస్తుంది కానీ, ఇది ఎప్పుడు, ఎందుకు వస్తుందోనని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతీ వ్యక్తి తన జీవితంలో చాలా సార్లు ఆవలిస్తూ ఉంటాడు, సాధారణంగా ఎవరైనా ఆవలిస్తే అది నిద్రకు సంకేతంగా భావిస్తారు. మీ పక్కన ఉన్నవారు ఆవలించినా మీకు ఆవలింతలు వస్తాయి. ఈ ఆవలింతలు అనేవి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మొదలవుతుందట. అయితే పరిశోధకులకు కూడా ఇప్పటికీ ఆవలింతలు రావడానికి గల కచ్చితమైన కారణం ఏమిటనేది తెలియదు. కొంతమందికి తరచుగా ఆవలింతలు వస్తాయి, మరి దీనికి కారణాలు ఏమిటి? ఇదేమైనా అనారోగ్యాన్ని సూచిస్తుందా? దీని గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవలింత అంటే ఏమిటి?

ఆవలింత థియరీని నిర్వచిస్తే, ఇదొక అసంకల్పిత ప్రతీకార చర్య. ఇక్కడ మీరు నోరు తెరిచి ఒక లోతైన శ్వాస తీసుకుంటారు, ఆపై వెంటనే శ్వాసను వదులుతారు. ఈ ఆవలింతలు కొన్ని సెకన్లపాటు ఉంటాయి. ఎవరైనా ఆవలించినపుడు కళ్ల నుంచి నీరు రావడం, చెవులు బిగుసుకుపోవడం, నిట్టూర్చునట్లుగా అనిపిస్తుంది, ఆపై తెలియని మైకం ఏదో ముంచుకొచ్చిన అనుభూతి కలుగుతుంది.

Excessive Yawning Causes - అధికంగా ఆవలింతలు ఎందుకు వస్తాయి?

సాధారణంగా నిద్రపోయే ముందు లేదా అలసటగా అనిపించినపుడు ఆవలింత వస్తుంది. పనిచేయాలని అనిపించక పోయినా నిస్తేజంగా పని చేస్తున్నప్పుడు, విసుగు చెంది అలసిపోయినప్పుడు ఆవులించడం జరుగుతుంది. అయితే అప్పుడప్పుడు ఆవలించడం అలాగే తరచుగా ఆవులించడం మధ్య వ్యత్యాసం ఉంది. ఒకవేళ మీరు రోజులో చాలాసార్లు ఆవులిస్తూ ఉంటే, అది కేవలం అలసట మాత్రమే కాకుండా మరేదైనా అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చునని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.

మీరు అతిగా ఆవలిస్తున్నారంటే కచ్చితమైన కారణం తెలియకపోయినా, అందుకు దారితీసే కొన్ని కారకాలు ఉన్నాయి. అవేమిటంటే..

  • మీరు మగతగా ఉండటం, మీకు విసుగు అనిపించడం లేదా అలసటగా ఉండటం.
  • నిద్ర లేమి, గురక, స్లీప్ అప్నియా లేదా నార్కోలెప్సీ వంటి నిద్ర రుగ్మతలు ఉండటం.
  • దీర్ఘకాలికమైన ఒత్తిడి, ఆందోళనను అనుభవించడం
  • కొన్ని మందుల దుష్ప్రభావాలు, మోతాదు ఎక్కువ అవడం కావచ్చు.
  • అధికంగా ఆవులించడం మీరు డీహైడ్రేషన్ కు గురయ్యారని ఒక సంకేతం కావచ్చు
  • ఇంకా నీరసం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు కూడా ఆవలింతలను కలిగిస్తాయి.
  • అలాగే ఆస్తమా లేదా మరేవైనా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉండటం.
  • స్ట్రోక్ అనుభవించిన వ్యక్తులు, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు, కాలేయ వైఫల్యం, మూర్ఛ లేదా నాడీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఆవులించడం జరుగుతుంది.

Excessive Yawning Treatment - ఆవలింతలను తగ్గించటానికి కొన్ని మార్గాలు

  1. సరిగ్గా నిద్రపోవాలి, క్రమబద్ధమైన నిద్ర షెడ్యూల్ కలిగి ఉండాలి. ప్రతీ వ్యక్తి 7-8 గంటల రాత్రి నిద్రను తీసుకోవాలి. మధ్యాహ్నం వేళలో, సెలవులలో అతిగా నిద్రపోవడం నివారించాలి. ఎందుకంటే ఇది మీ నిద్ర చక్రంపై కూడా ప్రభావం చూపుతుంది.
  2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ప్రతిరోజూ ప్రాణాయామం లేదా నడక, జాగింగ్ వెళ్లాలి.
  3. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి, ఇందుకోసం ధ్యానం సాధన చేయవచ్చు.
  4. పడుకునే ముందు కెఫీన్, ఆల్కహాల్ పానీయాలు తీసుకోవడం, అతిగా తినడం మానేయాలి.
  5. మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పక్కన పెట్టుకుని పడుకోకండి.

కొన్ని ఔషధాల వలన ఆవలింత రావచ్చు, వాటి మోతాదు తగ్గించే అంశంపై వైద్యులను సంప్రదించాలి. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు వెంటనే చికిత్సలు తీసుకోవాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్