Dark Room Sleep : చీకటి గదిలో పడుకుంటే ఎన్నో లాభాలు.. ప్లీజ్ లైట్స్ ఆఫ్
11 April 2023, 20:00 IST
- Dark Room Sleep Benefits : కొంతమందికి లైట్ ఉంటేనే నిద్రపడుతుంది. మరికొంతమంది కాస్త వెలుతురు ఉన్నా.. అస్సలు నిద్రపోరు.. నిద్రపట్టక అటు ఇటు తిరుగుతారు. చీకటి గదిలో పడుకుంటే చాలా మంచిది. మంచి నిద్రతోపాటు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
చీకటి గదిలో పడుకుంటే ప్రయోజనాలు
నిద్ర చాలా ముఖ్యం. నిద్ర తక్కువగా(Less Sleep) ఉంటే, అంటే సరైన నిద్ర లేకపోతే శరీరంలో రోగనిరోధక శక్తి(Immunity) తగ్గి శరీరం బలహీనంగా మారుతుంది. కొంతమందికి నిద్ర(Sleep) లేక ఆందోళన అనిపిస్తుంది. ఎనిమిది గంటల నిద్ర(8 Hours Sleep) అనేది చాలా ముఖ్యం. అయితే వెలుతురులో కంటే.. చీకటి గదిలో పడుకుంటేనే ఆరోగ్యం. బాగా నిద్రపోవాలంటే చీకటి గదిలో పడుకోండి అంటున్నారు నిపుణులు.
బెడ్‌రూమ్‌లోకి బయటి నుంచి వెలుతురు పడుతున్నట్లయితే లేదా బెడ్‌రూమ్‌లో వెలుతురు కాస్త ఉంటే పూర్తిగా చీకటి పడకగదిలో పడుకోండి. చీకటి గది(Dark Room)లో నిద్రపోతే చాలా మంచిది. వెలుతురు ఉన్న గదిలో కంటే చీకటి గదిలో నిద్రపోతే, మీరు త్వరగా నిద్రపోతారు. ఎందుకంటే చీకటిలో, మన శరీరం(Body) ఎక్కువ మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మిమ్మల్ని త్వరగా నిద్రపోయేలా చేస్తుంది. నిద్ర మాత్రమే కాదు గాఢ నిద్రలోకి వెళ్తారు. మంచి నిద్ర మనస్సు, శరీరాన్ని త్వరగా రిలాక్స్ చేస్తుంది. అందుకే పూర్తిగా చీకటి గదిలో పడుకోండి.
వెలుతురులో నిద్రించే అభ్యాసం వల్ల బరువు పెరిగే అవకాశం 50 శాతం ఎక్కువ అంటున్నారు నిపుణులు. అలాగే, కాంతిలో నిద్రపోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతుంది. చీకటి గదిలో నిద్రించడం(Dark Room Sleeping) వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో ఒక అధ్యయనం జరిగింది. చీకటి గదుల్లో పడుకునే వారికి మధుమేహం వచ్చే అవకాశం తక్కువ.
బాగా నిద్రపోయాక మేల్కొంటే మనసు రిలాక్స్‌గా ఉంటుంది. నిజానికి 5-6 గంటల గాఢ నిద్ర సరిపోతుంది. త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. నిద్రపోయే ముందు గాడ్జెట్‌లను చూడకుండా ఉండండి. మొబైల్ ఫోన్లు(Mobile Phones) చూస్తూ నిద్రపోయే వారిలో డిప్రెషన్, మానసిక ఒత్తిడి పెరిగిపోతున్నాయి.
ఇంతకు ముందు చెప్పినట్లుగా రాత్రిపూట ఎక్కువ చీకటి గదిలో పడుకోవడం ద్వారా మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి సమతుల్యమవుతుంది. మహిళల్లో సరైన ఋతుచక్రం కోసం ఈ హార్మోన్ల పాత్ర ముఖ్యమైనది. ఈ హార్మోన్ ఊబకాయం, మధుమేహం(diabetes) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదయం నుండి మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, టీవీ స్క్రీన్‌లను చూస్తూ మన కళ్ళు బాగా అలసిపోతాయి. మంచిగా నిద్రపోతే కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.
వయసు పెరిగే కొద్దీ.. యవ్వనంగా ఉండాలంటే బాగా నిద్రపోండి. నిద్రలేమితో(Sleeping Disorder) ఇబ్బంది పడే వారు మానసిక ఒత్తిడిని వదిలించుకోవాలి. వ్యాయామం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు పాదాలకు మసాజ్ చేయడం ద్వారా మంచి నిద్ర పొందవచ్చు. స్ట్రీట్‌లైట్ల వెలుతురు గదిలోకి వచ్చి నిద్ర సరిగా పట్టకపోతే మందపాటి కర్టెన్‌ని ఉపయోగించండి.