Crash Course Web Series Review: ఎడ్యుకేషన్ హబ్ కోటా చీకటి కోణాన్ని కళ్లకు కట్టిన క్రాష్ కోర్స్
Crash Course Web Series Review: కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన కోటా.. సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలాగా ఎలా మారింది? ఎన్నో కలలను మోసుకొని ఈ నగరానికి వచ్చే విద్యార్థులు ఎలా దారి తప్పిపోతున్నారు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానమిచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం (ఆగస్ట్ 5) వచ్చిన క్రాష్ కోర్స్ వెబ్ సిరీస్.
ఐఐటీలో సీట్ కావాలా? చలో కోటా.. నీట్‌లో మెడికల్ సీట్ కొట్టేయాలా.. కోటా పదండి.. ఎక్కడో ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లోని చిన్న నగరం ఇది. అలాంటి నగరానికి ప్రతి ఏటా లక్షన్నర మంది విద్యార్థులు తమ కలలను మోసుకుంటూ వెళ్తారని మీకు తెలుసా? కోటాకు కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరుందంటేనే దేశంలో జరిగే మెయిన్ ఎంట్రన్స్ టెస్ట్‌లకు అక్కడ దొరికే కోచింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అయితే అలాంటి కోటాకు కూడా ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. కలలను మోసుకెళ్లే స్టూడెంట్స్ ఆ కలల భారాన్ని మోయలేక ఎలా తనువు చాలిస్తున్నారు? తమ పేరు, ప్రతిష్టలు, డబ్బు కోసం అక్కడి ఇన్‌స్టిట్యూట్లు ఈ స్టూడెంట్స్ జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయి అన్న సున్నితమైన అంశాలను మనసును తాకేలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన క్రాష్ కోర్స్ (Crash Course) వెబ్‌సిరీస్.
గతంలో కోటా ఫ్యాక్టరీ పేరుతో నెట్‌ఫ్లిక్స్ అక్కడి కోచింగ్ సెంటర్లు, విద్యార్థుల జీవితాలను కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ప్రైమ్ వీడియో అదే కోటాలోని ఎన్నో చేదు నిజాలను తన వెబ్‌సిరీస్‌తో చెప్పే ప్రయత్నం చేసింది. ప్రముఖ నటుడు అన్నూ కపూర్ ప్రముఖ పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్ నిజంగా చూడదగినదే.
ఏంటీ క్రాష్ కోర్స్ (Crash Course) స్టోరీ?
కోటాలో నంబర్ వన్ ఇన్‌స్టిట్యూట్‌గా ఎదగడమే కాదు.. ఆ కోటా పేరునే తన పేరు మీద మార్చేయాలనుకునే విద్యా వ్యాపారవేత్త రతన్‌రాజ్ జిందల్ (అన్నూ కపూర్) చుట్టూ తిరిగే స్టోరీయే క్రాష్ కోర్స్. అతనికి బత్రాస్ ఇన్‌స్టిట్యూటే ప్రధాన పోటీ. దాని అడ్డు తొలగించుకోవడం కోసం రతన్‌రాజ్ వేసే ఎత్తులు, బత్రాస్ పైఎత్తులు, ఇందులో విద్యార్థులనే పావులుగా వాడుకునే తీరు, ర్యాంకుల కోసం స్టూడెంట్స్‌కు ఎర వేయడం ఇలా సాగిపోతుందీ స్టోరీ.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఐఐటీల్లో సీటు కోసం ఈ ఇన్‌స్టిట్యూట్లలో చదువుతున్న స్టూడెంట్స్ లైఫ్‌ను కూడా ఈ వెబ్‌సిరీస్ కళ్లకు కట్టింది. ర్యాంకులే టార్గెట్‌గా కోటాలో అడుగుపెట్టినా.. దాని కోసం రేయింబవళ్లు కష్టపడుతూనే అక్కడి చెడు స్నేహాలు, ప్రేమాయణాలు, డ్రగ్స్ కారణంగా తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో కూడా ఈ వెబ్‌సిరీస్ ద్వారా మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు.
ఇన్‌స్టిట్యూట్ల ర్యాంకుల కక్కుర్తి, తల్లిదండ్రుల అత్యాశ, సమాజం అంచనాలు అందుకోలేక ఆ స్టూడెంట్స్ ఎంత ఒత్తిడికి గురవుతారు? అది చివరికి వారు తమ జీవితాలను ఎలా అర్దంతరంగా ముగించుకునే దిశగా ప్రేరేపిస్తుంది అన్న సున్నితమైన అంశాలను క్రియేటర్ మనీష్ హరిప్రసాద్, డైరెక్టర్ విజయ్ మౌర్య హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
క్రాష్ కోర్స్ యాక్టర్స్.. వందకు వంద మార్కులు
ఈ క్రాష్ కోర్స్ వెబ్ సిరీస్ మొదటి నుంచి చివరి వరకూ ఆడియెన్స్‌న ఎంగేజ్ చేస్తుందంటే దానికి కారణం ఇందులోని యాక్టర్స్ సహజమైన నటనే. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా రతన్‌రాజ్ జిందల్ పాత్రలో అన్నూ కపూర్ అదరగొట్టాడు. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతవరకైనా వెళ్లే కఠినమైన పాత్రలో అన్నూ మెప్పించాడు.
ఇక స్టూడెంట్స్ విధి గుప్తా (అనుష్క కౌషిక్), సత్య శ్రీనివాసన్ (హృదు హరూన్), అనిల్ బేద్ (మోహిత్ సోలంకి), అవిరళ్ భారతి (భవేష్ బాల్‌చందాని), రాకేష్ గులియా (ఆర్యన్ సింగ్), నిక్కీ (అన్వేషా విజ్), తేజల్ పటేల్ (హేతల్ గాడా) పాత్రల్లో అత్యంత సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రతి విద్యార్థీ వీళ్లలో తమను తాము చూసుకుంటారనడంలో సందేహం లేదు.
గతంలో కోటా ఫ్యాక్టరీ, లాఖోమే ఏక్‌లాంటి వెబ్‌సిరీస్‌లు కోటా లైఫ్‌ను స్క్రీన్‌పై చెప్పే ప్రయత్నం చేసినవే. అయితే ఈ క్రాష్ కోర్స్ మాత్రం కోటా డార్క్ సైడ్‌ను మరింత లోతుగా చూపించడంలో సక్సెసైంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ బిజినెస్, దాని చుట్టూ జరిగే రాజకీయాలను ఈ క్రాష్ కోర్స్ బాగా చూపించింది. ఓవరాల్‌గా బింజ్ వాచ్ చేసేంత గ్రిప్పింగ్ స్టోరీ కాకపోయినా.. వీలున్నప్పుడు ఓసారి చూడదగిన సిరీస్ అనడంలో డౌట్ లేదు.
రేటింగ్: 3.5/5