Yawning : జీవితంలో ఎన్ని లక్షలసార్లు ఆవలిస్తారు? ఇవి ఎందుకు వస్తాయి?
24 February 2023, 14:03 IST
- Yawning Reasons : ఆవలింతలు రావడం అనేది సహజం. ఒక వ్యక్తి జీవిత కాలంలో ఎన్నిసార్లు ఆవలిస్తాడు? ఇవి ఎందుకు వస్తాయి.
ఆవలింతలు
కొంతమందికి ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. మరికొందరు ఆవలింతలు(Yawning) తీస్తూ.. ఒళ్లు విరుస్తారు. చదువుతున్నప్పుడు, పని చేస్తున్న సమయంలోనూ ఆవలింతలు వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయి? ఆవలింతలు అనేవి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రారంభమవుతాయి. ఆవలింతలు రావడానికి ముఖ్య కారణం ఆక్సిజన్ అందకపోవడం అని నిపుణులు చెబుతారు.
నిద్ర(Sleep)కు ముందు, అలసిపోయినప్పుడు కూడా సహజంగా ఆవలింతలు వస్తుంటాయి. కొంతమంది రాత్రిపూట తక్కువగా నిద్రిస్తారు. ఈ కారణంగా శరీరానికి తగినంత ఆక్సిజన్ దొరకదు. ఈ క్రమంలో మరుసటి రోజు వారికి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి బాగా ఆవలింతలు వస్తాయి. అతిగా నిద్రించినా.. ఆవలింతలు వస్తాయి.
ఎక్కువగా పనిచేసినప్పుడు మెదడుకు ఆక్సిజన్(Oxygen) ఎక్కువ కావాల్సి వస్తుంది. ఈ కారణంగా ఆవలింత వస్తుంది. అయితే ఆవలింతలు రావడం సహజమే. కానీ నిద్ర ఎక్కువై లేదా తక్కువై ఆవలింతలు వస్తే మాత్రం సరిగా నిద్రపోవాలి. లేదంటే.. వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆవలింత తర్వాత మెదడు చురుకుగా పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతారు. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారు 400 గంటలపాటు ఆవలిస్తాడట. సుమారు 2.40 లక్షలసార్లు అన్నమాట.
అయితే విపరీతంగా ఆవలింతలు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇలా రావడం వెనుక అనేక అనారోగ్య కారణాలు ఉండవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు ఆవలింపులు వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఆఫీసు(Office)ల్లో, సమావేశాల్లో ఆవలిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. వీటిని తగ్గించుకోవాలంటే మధ్యాహ్న భోజనం తక్కువగా తినాలి. నూనె పదార్థాలను తగ్గించుకోవాలి. కప్పు వేడి కాఫీ తాగడం వల్ల కూడా ఆవలింతలు రావడం తగ్గుతాయి.
పగటి పూట ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఆవలింతలు వస్తే చాక్లెట్, క్యాండీ తినడం వల్ల తగ్గిపోతాయి. అనారోగ్య సమస్యలు ఉంటే కూడా ఎక్కువగా ఆవలింతలు వస్తాయి. కావున విపరీతంగా ఆవలింతలు ఉంటే.. అనారోగ్యానికి సంకేతాలుగా భావించి వైద్యులను సంప్రదించాలి.