Mother Suicide along with Children : అనారోగ్య భయంతో పిల్లల్ని చంపి, ఆత్మహత్య
Mother Suicide along with Children అనారోగ్య భయం ఆ తల్లిని వెంటాడింది. మేనరికంతో నెలలు కూడా నిండని శిశువులకు ముప్పు తప్పదని భయపడింది. అప్పటికే రెండు సార్లు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లి మూడో సారి నవజాత శిశువులను తానే సంపులో పడేసి.. ఆపై ఆత్మహత్య చేసుకుంది. కడుపున పుట్టిన బిడ్డలకు అనారోగ్యం వెంటాడుతోందనే భయంతో అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
Mother Suicide along with Children పెళ్లై పదేళ్లుగా సంతానం కోసం ఆ జంట ఎదురు చూస్తోంది. రెండు సార్లు కవలలకు జన్మనిచ్చినా వారు ఎంతో కాలం బతకలేదు. మూడోసారి పుట్టిన పిల్లలు కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది.
కవలలు పుట్టారనే సంతోషంలో ఉన్న కుటుంబ సభ్యుల్ని విషాదంలో ఆత్మహత్యకు పాల్పడింది. నెలలు నిండకుండా పుట్టిన ఆడ, మగ బిడ్డలకు ఏమవుతుందోననే మానసిక ఆందోళను వారితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పుట్టిన మగ శిశువు అనారోగ్యానికి గురి కావడంతో తల్లి జీర్ణించు కోలేకపోయింది.
గతంలో పుట్టిన బిడ్డల మాదిరిగానే వీళ్లు కూడా చనిపోతారనే భయంతో తొమ్మిది రోజుల వయసు బిడ్డలను సంపులో పడేసి.. ఆపై తానూ బలవన్మరణానికి పాల్పడింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
అల్వాల్ ప్రాంతంలో కారు డ్రైవర్‌గా పనిచేసే నర్సింగ్‌రావుకు బేగంపేట అన్నానగర్‌కు చెందిన సంధ్యారాణితో 2012లో మేనరిక వివాహం జరిగింది. ఈ దంపతులు పదేళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం కానాజిగూడ పరిధిలోని శివనగర్‌లో నర్సింగ్ రావు, సంధ్యారాణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ జంటకు 2017లో కవలలు జన్మించారు. పుట్టుకతోనే ఓ శిశువుకు అంగవైకల్యంతో జన్మించింది. మరొకరికి గుండెలో రంధ్రాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత వారం వ్యవధిలో ఇద్దరూ చనిపోయారు.
2018లో మరోసారి సంధ్యారాణి గర్భం దాల్చింది. కడుపులోనే శిశువు మృతి చెందడంతో గర్భస్రావం జరిగింది. అప్పట్నుంచి పిల్లల విషయంలో ఆమె మానసికంగా వేదనకు గురవుతోంది. ఈ క్రమంలో మరోసారి గర్భం దాల్చిన ఆమె.ఈ నెల 11న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడ, మగ కవలలకు జన్మనిచ్చింది.
శిశువులకు నెలలు నిండకముందే ప్రసవం కావడం, బరువు తక్కువగా ఉండటంతో మగ శిశువును మూడు రోజులు ఐసీయూలో ఉంచారు. ఇది తల్లిని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఈ నెల 14న తల్లీబిడ్డలు ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నా ఆమెను పాత జ్ఞాపకాలు వెంటాడాయి.
గతంలో మాదిరిగానే ఇప్పుడు పుట్టిన బిడ్డలు కూడా అనారోగ్యంతో చనిపోతారనే భయం ఆమెను కుంగిపోయింది. ఆదివారం అర్ధరాత్రి భర్త నిద్రలో ఉన్న సమయంలో ఇంటి ఆవరణలోని సంపులో బిడ్డలను పడేసి, తానూ అందులోనే దూకి ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున నిద్ర మేల్కొన్న భర్త భార్య,బిడ్డలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై ఇంటి ఆవరణలో వెదికాడు. తెరిచి ఉన్న సంపులో భార్యాబిడ్డల మృతదేహాలను గుర్తించి హతాశుడయ్యారు.
'బిడ్డల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో సంధ్యారాణి రాసుకుంది. గతంలో జరిగిన ఘటనలే తన ఆత్మహత్యకు కారణమంటూ' మృతురాలు రాసిన లేఖను ఇంట్లో గుర్తించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని కవాడిగూడ పోలీసులు వెల్లడించారు.