Poha Upma Recipe | మసాలా చాయ్‌తో పోహా ఉప్మా.. పసందైన బ్రేక్‌ఫాస్ట్!
17 October 2022, 8:02 IST
- ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం పోహా ఉప్మా తినండి, లైట్‌గా ఉంటుంది. ఇది ఎంతో రుచికరం, ఆరోగ్యకరమైన అల్పాహారం కూడా. Poha Upma Recipe కోసం ఇక్కడ చూడండి.
Poha Upma Recipe
ఈ ఉదయం తేలికగా అనిపించే ఏదైనా అల్పాహారం చేయాలనుకుంటే, మీరు పోహా ఉప్మా ప్రయత్నించవచ్చు. ఉప్మా అందరికీ తెలిసిందే, పోహా కూడా చాలా మంది ఇష్టపడే వంటకమే. అయితే పోహాను ఉప్మా లాగా చేసుకోవడమే పోహా ఉప్మా. ఇలా చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. కడుపులో లైట్‌గా అనిపిస్తుంది. ఎలాంటి ఉబ్బరం సమస్యలు ఉండవు. ఈ పోహా ఉప్మాను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం, కేవలం 15 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు.
పోహా ఉప్మాను తయారు చేసే ప్రక్రియ లెమన్ రైస్ చేసినట్లు ఉంటుంది. అయితే అందులో ఉల్లిపాయలు వేయము, ఇందులో ఉల్లిపాయ వేస్తాం. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టూ సేమ్. పోహా ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలేమిటి, ఎలా తయారు చేసుకోవాలి? చాలా సింపుల్ రెసిపీని మీకు ఇక్కడ అందిస్తున్నాం, చూడండి.
Poha Upma Recipe కోసం కావలసినవి
- 2 కప్పులు అటుకులు (మందపాటి రకం)
- 1 మీడియం సైజ్ ఉల్లిపాయ
- 2 పచ్చిమిర్చి ముక్కలు
- చిన్న బెల్ పెప్పర్
- 1/4 కప్ పచ్చి బఠానీలు
- 1/2 అంగుళాల అల్లం ఐచ్ఛికం
- 1 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి ఐచ్ఛికం
- 1/4 టీస్పూన్ పసుపు పొడి
- రుచికి తగినంత ఉప్పు
- 2 స్పూన్లు నిమ్మరసం లేదా చింతపండు రసం
- తాజా కొత్తిమీర
టెంపరింగ్ కోసం
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 1/4 టీస్పూన్ ఆవాలు
- 1/2 టీస్పూన్ చనా పప్పు
- 1/2 టీస్పూన్ జీలకర్ర
- 1 రెమ్మ కరివేపాకు
- 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగ
పోహా ఉప్మా తయారీ విధానం
- ముందుగా ఒక గిన్నెలో అటుకులను తీసుకొని మంచినీటితో రెండుసార్లు కడగండి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి అటుకులను రెండు నిమిషాలు నానబెట్టండి.
- రెండో దశలో అటుకుల నుంచి నీటిని వడకట్టి, అలాగే పది నిమిషాలు ఉంచండి. ఇది పోహాను మృదువుగా మార్చడానికి సహాయపడుతుంది.
- మరోవైపు, బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి. ఆవాలు వేగడం ప్రారంభించినప్పుడు శనగ పప్పు, పల్లీలు వేసి వేయించాలి.
- ఆపై జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు వేసి వేయించాలి.
- అనంతరం చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పసుపు, చిటికెడు ఉప్పు వేసి నిమిషాలు చిన్నమంటపై వేయించాలి.
- బెల్ పెప్పర్, పచ్చి బఠానీలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
- ఇప్పుడు మృదువుగా మారిన అటుకులు, కొబ్బరితురుము, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపండి.
- అనంతరం మూతపెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి, ఆపై మూత తీసి తాజా కొత్తిమీర చల్లుకోవాలి.
అంతే, పోహా ఉప్మా రెడీ అయినట్లే. ఒక చెంచా మామిడికాయ తొక్కు కలుపుకొని తింటూ, మరోవైపు మసాలా చాయ్ తాగుతూ ఈ ఉదయాన్ని ఆస్వాదించండి.