తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Doodh Poha | మీ ఉదయాన్ని మధురంగా ప్రారంభించండి.. దూద్ పోహా రుచిని ఆస్వాదించండి!

Doodh Poha | మీ ఉదయాన్ని మధురంగా ప్రారంభించండి.. దూద్ పోహా రుచిని ఆస్వాదించండి!

HT Telugu Desk HT Telugu

26 June 2022, 9:03 IST

    • ఆదివారం ఉదయం బద్ధకంగా ఉందా? మిమ్మల్ని రీఛార్జ్ చేసే బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఇక్కడ ఉంది. గుజరాతీ స్పెషల్ దూద్ పోహాను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
Doodh Poha
Doodh Poha (Unsplash)

Doodh Poha

వానకాలం ముసురు మొదలైంది, వర్షాలు అంతటా కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం లేవాలంటే బద్ధకంగా అనిపిస్తుంది. కానీ రాత్రి నుంచి ఉదయం వరకు మీ కడుపు ఖాళీగా ఉండటంతో మీరు కుదురుగా ఉండలేరు. అయితే వేడివేడిగా మంచి అల్పాహారం తీసుకుంటే ఇప్పటికీ సెట్ అవుతుంది, మధ్యాహ్నం మంచి బిర్యానీ విందుకు మీరు రైట్ అవుతారు.

మరి ఏం తినాలనుకుంటున్నారు? మీకు సరికొత్త గుజరాతీ వంటకాన్ని పరిచయం చేస్తున్నాం. ఇది అటుకులతో చేసే ఒక పాయసం లాంటిది. సాధారణంగా మనం అటుకులను పొడిగా లేదా మెత్తగా పోపు వేయించుకొని తింటాం. అయితే కొంతమంది పాలల్లో , టీలో అటుకులను కలుపుకొని తినడం గమనించే ఉంటారు. అలా కూడా రుచిగా ఉంటుంది. కడుపు నిండుతుంది. ఎంతో ఆరోగ్యం కూడా. ఇప్పుడు దూద్ పోహా కూడా అలాంటిదే. అయితే అంతకంటే రుచిగా ఉంటుంది. కేవలం 15 నిమిషాల్లో రెడీ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఈ అల్పాహారాన్ని చేసుకొని తినవచ్చు. పిల్లలైతే ఈ దూద్ పోహాను ఇష్టంగా తింటారు. మరి ఈ దూద్ పోహాకు కావాల్సిన పదార్థాలేమిటి? ఎలా తయారు చేసుకోవాలో ఈ కింద రెసిపీని ఇచ్చాం. ఈరోజు మీరు దీనిని తయారు చేసుకోండి.

కావాల్సినవి

  • అరలీటర్ పాలు
  • 1 కప్పు పోహా
  • బెల్లం లేదా 5 టీస్పూన్ల చక్కెర (రుచికి తగినట్లుగా)
  • 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు
  • 1 టేబుల్ స్పూన్ పిస్తా పలుకులు
  • 1/2 టేబుల్ స్పూన్ బాదం పలుకులు
  • 1 టేబుల్ స్పూన్ ఎండుద్రాక్ష
  • 2 ఏలకులు
  • 1 బిర్యానీ ఆకు
  • 1 టీస్పూన్ నెయ్యి

తయారీ విధానం

  1. ముందుగా అటుకులను ఒక కప్పు నీటిలో ఒకటి లేదా రెండు నిమిషాలు నానబెట్టి, ఆ తర్వాత నీటిని తీసేసి పక్కన పెట్టండి.
  2. ఇప్పుడు పాలను మీడియం మంట మీద మరిగించండి. అందులో యాలకులు, బిర్యానీ ఆకు వేసి మరిగిస్తూ ఉండండి.
  3. మరోవైపు ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి అందులో పలుకులు, డ్రై ఫ్రూట్ ముక్కలను దోరగా 2 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు మరిగే పాలలో నానబెట్టిన అటుకులు, పంచదార వేసి మరిగించుకోవాలి. పదార్థం చిక్కగా మారే వరకు ఇలా ఉడికిచుకోవాలి.
  5. అనంతరం పైనుంచి వేయించిన డ్రైఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి.

ఘుమఘుమలాడే రుచికరమైన దూద్ పోహా రెడీ అయినట్లే. సర్వింగ్ గిన్నెల్లోకి తీసుకొని కొద్దిగా లాగించండి. తింటున్నకొద్దీ కమ్మగా, తియ్యగా ఎంతో హాయిగా ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం