Online Jewellery Shopping । ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేసేటపుడు చూడాల్సినవి ఇవీ!
11 April 2023, 15:30 IST
- Online Jewellery Shopping: ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేసేటపుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కొన్ని చిట్కాలు అందించాం, ఈ అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోండి.
Online Jewellery Shopping
ఆన్‌లైన్ షాపింగ్ సౌలభ్యంతో ఆభరణాలు కొనుగోలు చేయడం గతంలో కంటే ఇప్పుడు సులభంగా మారింది. ఆన్‌లైన్ షాపింగ్ సౌలభ్యం కారణంగా ఆన్‌లైన్ ఆభరణాల వ్యాపారం గణనీయంగా పెరిగింది. ప్రముఖ జ్యువెల్లరీ విక్రయదారులు కూడా ఇప్పుడు తమ కస్టమర్‌లకు ఆన్‌లైన్‌లో ఆభరణాలను కొనుగోలు చేసేందుకు యాక్సెస్ ఇస్తున్నారు. నగలు కొనుగోలు చేయడం అంటే ఖరీదైన వ్యవహారం. ఎంతో ఆలోచించి, నాలుగైదు స్టోర్లు తిరిగి, అన్ని రకాలుగా సంతృప్తి చెందినపుడే ముందుకు వెళ్లాలి. అయితే ఇలా ఒక్కో నగల షాపు తిరుగుతూ మనకు నచ్చిన డిజైన్ ఎంచుకోవడం అంటే అది చాలా శ్రమతో కూడుకున్నది, మన విలువైన సమయం కూడా ఖర్చవుతుంది. ఆన్‌లైన్‌లో అయితే లెక్కలేనని డిజైన్‌లు చూసుకోవచ్చు, సులభంగా ఇతర స్టోర్లలో ధరలను తనిఖీ చేయవచ్చు. సమయం కూడా చాలా ఆదా అవుతుంది.
యువతులు ఎక్కువగా ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేసేందుకే ఇష్టపడతారు. సరసమైన ధరలలో లభించే మినిమలిస్టిక్ జ్యువెలరీ డిజైన్‌లకు ఆకర్షితులవుతారు. అయితే ఇదే సమయంలో మోసపూరిత విక్రేతల నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Online Jewellery Shopping Tips- ఆన్‌లైన్‌లో నగలు కొనేటపుడు జాగ్రత్తలు
ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేసేటపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు సూచించారు, అవి ఇక్కడ తెలుసుకోండి.
అధికారిక వెబ్‌సైట్
మీరు ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేసేటపుడు ఆ వెబ్‌సైట్ విశ్వసనీయతను తనిఖీ చేయండి. అది మీరు ఎప్పుడు వినని ఏదో ఒక అనామక బ్లాగర్ అయి ఉండకూడదు. బ్రాండ్ జ్యువెలరీ స్టోర్ అయినది ఉండాలి, వారి అధికారిక వెబ్‌సైట్ మాత్రమే అయి ఉండాలి. నగదు చెల్లింపుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వెబ్‌సైట్‌కి సురక్షితమైన చెల్లింపు గేట్‌వే ఉందో లేదో తనిఖీ చేయండి. కస్టమర్‌ల రివ్యూలను చదవండి.
ఆభరణాల వివరాలు
మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలనుకుంటున్న ఆభరణాల వివరాలపైన శ్రద్ధ చూపడం చాలా అవసరం. నగలను ఎలా తయారు చేశారు, వాటి నాణ్యత ఏమిటి, అందులో ఎంత మొత్తంలో బంగారాన్ని వినియోగించారు వంటి వివరాలను చదవండి. అవసరం అయితే ఆ అభరణాలకు చెందిన మరిన్ని ఫోటోలు, వీడియోల కోసం రిక్వెస్ట్ చేయండి.
సరైన ధర
మీరు ఎంచుకున్న నగలకు వాటి విలువ ఆధారంగా సరైన ధరనే నిర్ణయించారా? లేక ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారా అనేది నిర్ధారించుకోండి. ఉత్తమ ధర కోసం ఇతర వెబ్‌సైట్‌లలో ధరలను తనిఖీ చేయండి. సరైన ధర అనుకున్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్లండి.
ఆభరణాల గ్యారెంటీ
మీరు కొనుగోలు చేసే నగలు, ఆభరణాల బైబ్యాక్ గ్యారెంటీని చెక్ చేయండి. నగలను తిరిగి అమ్మినపుడు ఎంతమొత్తంలో ధర పొందుతారో తెలుసుకోండి. స్కామ్‌లను నివారించడానికి ఆభరణాలు సర్టిఫైడ్ లేదా నాన్-సర్టిఫైడ్ అని విషయాన్ని నిర్ధారించుకోండి.
రిటర్న్ - ఎక్స్ఛేంజ్ సౌకర్యం
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన నగలు నేరుగా చూసినపుడు మీకు నచ్చకపోతే, రిటర్న్ - ఎక్స్ఛేంజ్ సౌకర్యం ఉందేమో కనుక్కోండి. అలాంటి వాటిని మాత్రమే ఎంచుకోండి. నగలు మీ అంచనాలను అందుకోలేకుంటే లేదా షిప్పింగ్ సమయంలో ఏదైనా నష్టం జరిగితే మీకు నష్ట జరగకుండా హామీ ఇస్తున్నారని నిర్ధారించుకోండి. కొనుగోలుకు సంబంధించిన ఇన్‌వాయిస్, రసీదుని ఎల్లప్పుడూ ఉంచుకోండి.
ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేసేటపుడు పై అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే, డబ్బులు ఎవరికీ ఊరికే రావు.