Gold Jewellery Buying Tips । బంగారు నగలు కొంటున్నారా? ఈ చిట్కాలు పాటించండి!-5 important tips to remember while buying gold jewellery in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gold Jewellery Buying Tips । బంగారు నగలు కొంటున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

Gold Jewellery Buying Tips । బంగారు నగలు కొంటున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 04:16 PM IST

Gold Jewellery Buying Tips: పెళ్లి కోసం లేదా తమ స్వంత అవసరాల కోసం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అయితే నగలు కొనేటపుడు కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Gold Jewellery Buying Tips:
Gold Jewellery Buying Tips: (HT Photo)

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ దగ్గర పడుతోంది. ఈ సీజన్ వచ్చిందంటే నగల షాపులు, వస్త్రాల షాపులు కళకళలాడుతాయి. ముఖ్యంగా భారతీయ వివాహాల విషయంలో బంగారు ఆభరణాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పెళ్లిళ్లలో ఎవరి మెడ చూసినా బంగారంతో ధగధగ మెరిసిపోతుంది. తమ నిగనిగ నగలను పదుగురికి ఇదిగో అని చూపించాలని ప్రతి స్త్రీ తాపత్రయపడుతుంది. మరి ఇంతటి ప్రాధాన్యం ఉన్న నగలను ఎంతో జాగ్రత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

బంగారు ఆభరణాలు కేవలం ఫ్యాషన్ అవసరాలు మాత్రమే కాదు. అవి ఎంతో ఖరీదైన వ్యవహారం, రేపటి అవసరాలను తీర్చే నిధులు. రోజులు, తరాలు మారినా ఏనాటికి వన్నె తగ్గనిది, విలువ పెరిగేది బంగారమే.ప్రతి భారతీయ వధువుకు, పెళ్లి ద్వారా లభించే విలువైన ఆస్తి ఈ బంగారు ఆభరణాలు.

Gold Jewellery Buying Tips- బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటపుడు చిట్కాలు

మీరు పెళ్లి కోసం షాపింగ్ చేస్తున్నట్లయితే లేదా మీకోసం మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే నగలు కొనేటపుడు కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

స్వచ్ఛతను తెలుసుకోండి

బంగారం స్వచ్ఛతను క్యారెట్‌లను బట్టి నిర్ణయించవచ్చు. 24kt బంగారం 99.9% స్వచ్ఛమైనదిగా పరిగణించవచ్చు. అయితే మీకు ఈ 24 క్యారెట్ల మేలిమి బంగారం జ్యువెలరీ షాపుల్లో దొరకకపోవచ్చు. సాధారణంగా జ్యువెలరీ స్టోర్లలో 22kt, 18kt, 14kt స్వచ్ఛతతో లభిస్తుంది. అలాగే మీరు కొంటున్న బంగారం ఎంత స్వచ్ఛమైనదో హాల్‌మార్క్ చిహ్నం సూచిస్తుంది. ఈ హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను కొనుగోలు చేయడం మంచిది. అయితే మీకు 24kt బంగారు నగలు కావాలంటే బిస్కెట్ బంగారం కొనుగోలు చేసి మీకు నమ్మకస్తులైన కంసాలి వద్ద మీకు నచ్చిన రీతిలో ఆభరణాలను సిద్ధం చేసుకోవచ్చు.

ఆ రోజు ధర

బంగారం ధర ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉంటుంది. సాధారణంగా ట్రెండ్ ఎలా ఉంది అని చూసి తక్కువ ధర ఉన్ననాడు కొనుగోలు చేస్తే కొంత మేర మీకు ప్రయోజనం ఉంటుంది. అలాగే బంగారు ఆభరణాల ధర దాని స్వచ్ఛతతో పాటు ఆ బంగారంను ఏ మిశ్రమంతో కలుపారు అనేది తెలుసుకోవాలి. అలాగే డిజైన్ కోసం ఎంత శ్రమతో ఆ డిజైన్ చేసి ఉంటారో అది కూడా ధరను నిర్ణయిస్తుంది. వివిధ స్టోర్లలో డిజైన్లను పరిశీలించి, అప్పుడు ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో నిర్ణయానికి రావాలి.

ఆభరణం రంగు

బంగార ఆభరణం, వివిధ రంగు వైవిధ్యాలను కలిగి ఉండవచ్చు. స్వచ్ఛమైన బంగారాన్ని ఇతర లోహాలతో కలపడం వల్ల మరో రంగు ఏర్పడుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ఆభరణాలు తెలుపు షేడ్ కలిగి ఉంటాయి, మరికొన్ని గులాబీ షేడ్, అలాగే పసుపు రంగులో ఉంటాయి. మన దేశంలో పసుపు బంగారానికి అత్యధిక డిమాండ్ ఉంది. మీరు వెరైటీ కావాలంటే, పసుపుతో మిక్స్ అయిన ఇతర షేడ్లను ఎంచుకోవచ్చు.

బంగారం బరువు

మీరు ఆభరణం కొనుగోలు చేస్తున్నప్పుడు అందులో ఉపయోగించిన బంగారం బరువు ఎంత? మిగిలిన మిశ్రమాల బరువు ఎంత? ఈ రెండింటికి ధరల పోలిక ఎలా ఉంది అని చూసి ధర చెల్లించాలి. ఆభరణాల్లో ఉపయోగించిన రాళ్లు ఆభరణం బరువును చాలా పెంచుతాయి. కానీ వాటి విలువ చాలా తక్కువ ఉంటుంది. అందుకే బంగారం బరువు ఎంత ఉందో లెక్క పక్కాగా చూసుకోవాలి.

డిజైన్

ఆభరణాలు మాయా ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. నిరాడంబరమైన ఆభరణం కూడా ఒక్కో స్త్రీకి సహజ ఆకర్షణను కలిగిస్తుంది. వారి రూపాన్ని ప్రకాశింపజేస్తుంది. కావున డిజైన్ కోసం పెట్టుబడి పెట్టం కాకుండా మీకు ప్రత్యేక ఆకర్షణను ఇచ్చే డిజైన్లను ఎంచుకోవాలి.

WhatsApp channel