Home Loan EMI | హోమ్ లోన్ ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైతే నష్టమేంటో తెలుసా?-what happens if you delay payment of home loan emi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Loan Emi | హోమ్ లోన్ ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైతే నష్టమేంటో తెలుసా?

Home Loan EMI | హోమ్ లోన్ ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైతే నష్టమేంటో తెలుసా?

Praveen Kumar Lenkala HT Telugu
Feb 28, 2022 04:10 PM IST

Home Loan EMI | హోమ్ లోన్ తీసుకుని ఈఎంఐ చెల్లించడం ఆలస్యమైతే చాలా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సిబిల్ స్కోర్ దెబ్బ తినడమే కాకుండా మళ్లీ ఎక్కడా లోన్ కూడా పుట్టని పరిస్థితి వస్తుంది. ఈఎంఐ చెల్లించనిపక్షంలో ఎదురయ్యే పరిణామాలు ఒకసారి చూద్దాం.

<p>హోం లోన్ ఈఎంఐ చెల్లింపులో జాప్యం జరిగితే భవిష్యత్తులో కష్టాలే</p>
హోం లోన్ ఈఎంఐ చెల్లింపులో జాప్యం జరిగితే భవిష్యత్తులో కష్టాలే (unsplash)

హోమ్ లోన్ తీసుకునేముందు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మన అర్హతలు, చెల్లింపు సామర్థ్యం వంటివన్నీ బేరీజు వేసుకోవాలి. అలాగే మనం కొనుగోలు చేస్తున్న ఏరియాలో ఇళ్ల ధర భవిష్యత్తులో పెరుగుతుందా? కనీసం మనం లోన్ చెల్లింపు పూర్తయ్యే నాటికి మనం కట్టిన అసలు, వడ్డీ కలిపితే వచ్చే విలువ ఆ ఇంటికి ఉంటుందా బేరీజు వేసుకోవాలి. ఇవన్నీ చూశాక హోం లోన్లలో మనకు తగిన లోన్ ఎంచుకోవాలి.

ఈఎంఐ జాప్యం జరగకుండా ఉండాలంటే..

హోం లోన్ చెల్లించేందుకు కొన్నిసార్లు గడ్డు పరిస్థితుల వల్ల ఇబ్బంది పడాల్సి రావొచ్చు. ఇలాంటప్పుడు ముందు జాగ్రత్తగా బంధువులు, స్నేహితుల నుంచి కొంత నగదు తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. లేదంటే ఇన్సూరెన్స్ పాలసీలు,  ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్  ఉంటే వాటిని ష్యూరిటీగా పెట్టి లోన్ తీసుకోవచ్చు. పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం గానీ, చిన్న మొత్తాల పొదుపు పథకాలేవైనా ఉంటే వాటి నుంచి రుణం తీసుకోవడం గానీ, ఎన్‌పీఎస్ ఉంటే దాని నుంచి రుణం తీసుకోవడం గానీ చేయాలి.

జాప్యం జరిగితే..

జాగ్రత్తలన్నీ పరిశీలించి లోన్ తీసుకున్నాక అనుకోని కారణాల వల్ల మీరు హోం లోన్ ఈఎంఐ చెల్లించడంలో జాప్యం జరిగితే అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడు వరుస వాయిదాలు చెల్లించని పక్షంలో దీనిని మైనర్ డీఫాల్ట్‌గా భావిస్తారు. హోం లోన్ ఇచ్చిన సంస్థ ఈఎంఐ చెల్లించాలని రిమైండర్లు పంపిస్తుంది. అప్పటి వరకు చెల్లించాల్సి ఉన్న ఈఎంఐలపై స్వల్పంగా పెనాల్టీ విధిస్తుంది. 

మూడు నెలలు దాటి మరో నెల కూడా చెల్లించని పక్షంలో మేజర్ డీఫాల్ట్ కింద పరిగణిస్తారు. దానిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ (ఎన్‌పీఏ)గా కూడా పరిగణిస్తారు. దీనికి ముందు ఇలా చేస్తున్నట్టుగా ఒక నోటీసు పంపిస్తారు. ఆ తదుపరి లోన్ రికవరీ చర్యలు ప్రారంభమవుతాయి. ఒకవేళ మీరు అదే బ్యాంకర్ నుంచి ఇంకా ఏమైనా రుణాలు తీసుకొని ఉంటే వాటిని కూడా ఎన్‌పీఏగా పరిగణిస్తారు. 

మీకు రుణం ఇచ్చిన సంస్థ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ (సర్ఫేసి యాక్ట్) పరిధిలో మీ ఆస్తిని వేలం వేసి మీరు చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేసుకుంటుంది. అంటే మీ ఇంటిని సదరు రుణ వితరణ సంస్థ అమ్మేస్తుంది. 

ఏళ్లు నిరీక్షించకుండా..

బ్యాంకు చర్యలను సవాలు చేస్తూ మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటు ఉంది. అయితే అక్కడ న్యాయం జరగడం ఆలస్యం అయితే మీరు అది తేలే వరకు మరో ఇల్లు కొనుగోలుకు రుణం తీసుకోలేరు. ఆల్రెడీ ఇల్లును బ్యాంక్ సీజ్ చేసినందున అందులో ఉండలేరు. చివరకు న్యాయస్థానం సూచన మేరకు మధ్యే మార్గంగా సెటిల్‌మెంట్ చేసుకునే వెసులుబాటు దొరకవచ్చు. అయితే అంతకాలం వెయిట్ చేసే బదులు ముందే మీ బ్యాంకర్లకు వాస్తవ పరిస్థితులు వివరించి కాస్త ఉపశమన చర్యలను కోరవచ్చు. చివరి ఆప్షన్‌గా రుణ సంస్థలు కొంత వడ్డీ రేటు తగ్గించడం వంటి మార్గాలను కూడా సూచిస్తాయి. ఇవి కొంత మీ భారాన్ని తగ్గిస్తాయి. అయితే మీ వైఖరి నిజాయతీగా ఉండాలి.

క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం

రుణ గ్రహీతలు ఈఎంఐ చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే వారి రుణ చరిత్రపై ప్రభావం పడుతుంది. అంటే క్రెడిట్ స్కోర్ (సిబిల్, ఈక్విఫాక్స్ వంటివి) దెబ్బతింటుంది. దీని వల్ల భవిష్యత్తులో మీరు తీసుకునే అప్పులకు గరిష్ట వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. సిబిల్ స్కోర్ మరీ దిగజారితే అప్పులు కూడా పుట్టని పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మేజర్ డీఫాల్ట్ ఉండి మీ రుణాలు ఎన్‌పీఏలుగా మారితే భవిష్యత్తులో అప్పులు పుట్టే పరిస్థితి ఉండదు.

రుణ బదిలీ ఉండదు..

క్రెడిట్ హిస్టరీ బాగోలేనప్పుడు మీ రుణాలను ఒక రుణ సంస్థ నుంచి మరో రుణ సంస్థకు మార్చుకోవడానికి మీరు పెట్టుకునే దరఖాస్తులు చెల్లుబాటు కావు. అంతేకాకుండా పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్ వంటివి కూడా లభ్యం కావు. 

ఎమర్జెన్సీ ఫండ్ ఇందుకోసమే..

ప్రతి ఒక్కరికి అత్యవసర పరిస్థితులు రావొచ్చు. మీ వద్ద ఉన్న అన్ని ఆప్షన్లు మూసుకుపోతే ఇక సదరు ప్రాపర్టీని అమ్మి తక్కువ ధరలో ఇంకోచోట కొనుక్కునే అవకాశాన్ని చూడాలి. ఈ పరిస్థితులన్నీ రాకుండా ఉండేందుకు అందరూ ఎమర్జెన్సీ ఫండ్ రూపొందించుకోవాలి. కనీసం ఆరు నెలల పాటు మీ అవసరాలన్నీ తీర్చగలిగేలా ఈ ఫండ్ జమ చేసుకోవాలి.

Whats_app_banner

సంబంధిత కథనం