Semiya Dosa Recipe| సేమియాతో ఉప్మా, పాయసమే కాదు.. దోశ కూడా చేసుకోవచ్చు ఇలా!
03 August 2024, 22:04 IST
- ఇంట్లో సేమియా అందుబాటులో ఉంటే ఇన్‌స్టంట్‌గా దోశ చేసేయవచ్చు. ఎలాగో ఇక్కడ Vermicelli Dosa Recipe ఉంది చూడండి.
Semiya/ Vermicelli Dosa Recipe
ఇంట్లో సేమియా ఉంటే అయితే పాయసం చేసేస్తారు లేదా ఉప్మా చేసేస్తారు. కానీ ఇవి తినీతినీ విసిగిపోయారా? అయితే చింతించకండి. సెమియాతో అప్పటికప్పుడే ఇన్‌స్టంట్‌గా దోశ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన రెసిపీ కూడా, కేవలం 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది మీకు మరొక దోశ వెరైటీ అవుతుంది. మసాలా దోశ, పనీర్ దోశ, రాగి దోశలతో పాటుగా, అప్పుడప్పుడు సేమియా దోశ కూడా తింటే బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టదు. ఇంకా ఈ సేమియా దోశలో మీకు నచ్చిన క్యారెట్, మెంతికూర, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయలు వేసుకొని మీకు నచ్చిన రీతిలో ఆరోగ్యకరమైన అల్పాహారంగా సిద్ధం చేసుకోవచ్చు.
సేమియా దోశను మీకు క్రిస్పీగా కావాలనుకుంటే రవ్వ కలిపి రవ్వ దోశలాగా చేసుకోవచ్చు లేదా మెత్తగా కావాలనుకుంటే రవ్వకు బదులు గోధుమపిండి కలుపుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? సేమియా దోశ ఎలా చేసుకోవాలి, కావలసిన పదార్థాలేమి ఇక్కడ తెలుసుకోండి. సేమియా దోశ రెసిపీని ఈ కింద చూడండి.
Semiya/ Vermicelli Dosa Recipe కోసం కావలసినవి
- 2 కప్పుల వెర్మిసెల్లి
- 1/2 కప్పు బియ్యం పిండి
- 1/2 కప్పు మొత్తం గోధుమ పిండి
- 1/2 కప్పు పెరుగు
- 3 కప్పుల నీరు
- 1/2 ఉల్లిపాయ
- 1/2 క్యారెట్
- 1 టీస్పూన్ పచ్చి మిరపకాయ పేస్ట్ లేదా చిల్లీ ఫ్లేక్స్
- 1/2 టీస్పూన్ జీలకర్ర
- 1/2 టీస్పూన్ ధనియాల పొడి
- రుచికి తగినంత ఉప్పు
- కాల్చడానికి నూనె
సేమియా దోశ తయారీ విధానం
- ముందుగా ఒక పాన్ తీసుకుని సేమియాను తక్కువ మంట మీద సుమారు 5 నిమిషాల పాటు రోస్ట్ చేయండి, అనంతరం పూర్తిగా చల్లబరచండి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ గిన్నెలో వేయించిన సేమియాతో పాటు పచ్చిమిర్చి పేస్ట్, బియ్యం పిండి, గోధుమ పిండి, తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, జీలకర్ర, ఉప్పు వేసి అన్ని బాగా కలపండి.
- ఇప్పుడు గిన్నెలో పెరుగు, నీళ్లు కూడా వేసి బాగా కలిపి దోశలు వచ్చేలా మంచి బ్యాటర్ సిద్ధం చేసుకోండి.
- ఇప్పుడు దోశ పాన్ తీసుకొని ఒక టీస్పూన్ నూనె వేడిచేయండి, ఆపై గరిటెతో సేమియా దోశ బ్యాటర్ వేసి గుండ్రంగా విస్తరించండి.
- ఒక మూతతో కప్పి, మీడియం నుండి తక్కువ మంట మీద 2 నుండి 3 నిమిషాలు ఉడికించాలి. ఆపైన రెండోవైపు కూడా కాల్చుకోవాలి.
అంతే, వేడివేడి సేమియా దోశ రెడీ. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఉల్లిపాయ చట్నీతో మీ దోశను తింటూ రుచిని ఆస్వాదించండి.