Chicken 555 Recipe। విన్నర్ విన్నర్ Chicken 555 తో డిన్నర్‌కు మీరు రెడీనా? రెసిపీ ఇదిగో!
విన్నర్ విన్నర్.. చికెన్ డిన్నర్ ఇష్టపడని వారెవరు? మరి చికెన్ డిన్నర్ కోసం మీకు ప్రత్యేకమైన Chicken 555 Recipe ఇక్కడ ఉంది, ట్రై చేసి చూడండి.
మీరు చికెన్ స్టార్టర్ వంటకాల కోసం వెతికితే, వందల కొద్దీ వెరైటీలు ఉంటాయి. చికెన్ మంచూరియా, చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్, చికెన్ వింగ్స్, చికెన్ 65 ఇలా ఒకటేమిటి, ఇలా ఎన్నో రకాలు. మరి ఇందులో దేని రుచి ఎలా ఉంటుంది? ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్త రుచుల కోసం తహతహలాడడం మనకు తెలిసిందే. చివరకు తెలియని దానికంటే తెలిసిన రుచివైపే మొగ్గుచూపుతాం. స్టార్టర్స్ అనగానే ఎక్కువగా చికెన్ 65 ఆర్డర్ చేసుకుంటాం, మరి మీరెపుడైనా చికెన్ 555 రుచిని చూశారా? ఇది అంతకు మించిన రుచిని, సంతృప్తిని అందిస్తుంది.
చికెన్ 555 అనేది రుచికరమైన, క్రంచీ ఎపిటైజర్. ఇది మెయిన్ కోర్స్ కంటే ముందు మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. మీ డిన్నర్ లేదా డ్రింక్స్ సెషన్ ను ఇది సంపూర్ణం చేస్తుంది. చికెన్ 65 లాగా, చికెన్ 555 కూడా డీప్ ఫ్రై చేసి క్రిస్పీగా, క్రంచీ స్నాక్‌గా తయారవుతుంది.
అయితే దీనిని వేయించడానికి ముందు గుడ్డు, చాలా మసాలా దినుసుల మిశ్రమంలో మెరినేట్ చేస్తారు కాబట్టి రుచి మరింత పెరుగుతుంది. ఈ ప్రత్యేకమైన చికెన్ 555 వంటకాన్ని మీరు కూడా ఇంట్లోనే సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి దీనికి తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేసుకోవాలి, ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
Chicken 555 Recipe కోసం కావలసిన పదార్థాలు
- బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
- బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
- నల్ల మిరియాల పొడి - 1 టీస్పూన్
- గుడ్డు - 1
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ - 2
- చిల్లీ పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర - 1/2 కట్ట
- క్యాప్సికమ్ - 1
- పెరుగు - 1/2 కప్పు
- కారం పొడి - 1 టీ స్పూను
- ధనియాల పొడి - 1/2 టీస్పూన్
- గరం మసాలా - 1/2 టీస్పూన్
- నూనె - వేయించడానికి
- ఉప్పు - రుచి ప్రకారం
చికెన్ 555 తయారీ విధానం
- ముందుగా చికెన్‌ను బాగా శుభ్రం చేసి చిన్న-పొడవాటి స్ట్రిప్స్‌గా కత్తిరించండి.
- ఆపై చికెన్‌లో కోడిగుడ్డు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, పెరుగు, ఉప్పు, మిరియాల పొడి సహా మిగిలిన మసాలాలు వేసి ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలను కనీసం అరగంట పాటు మ్యారినేట్ చేయండి.
- ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ స్ట్రిప్స్‌ను వేడి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసేయాలి.
- మరో పాత్రలో కొంచెం నూనె వేసి వేడిచేసి అందులో పచ్చిమిర్చి ముద్ద, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం ముక్కలువేసి వేయించాలి.
- చివరగా ఈ మసాలా మిశ్రమంలో కాల్చిన చికెన్ స్ట్రిప్స్ వేసి మిశ్రమం గట్టిపడే వరకు కలపాలి
పైనుంచి కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని, కొత్తిమీర చల్లుకుంటే చికెన్ 555 రెడీ.
సంబంధిత కథనం