Custard Apple Kheer । సీతాఫలంతో పాయసం.. దీని రుచి అమోఘం!
సీతాఫలం అంటే చాలా మందికి చాలా ఇష్టం. సీతాఫలం పండుతో ఐస్ క్రీమ్, పాయసం వంటివి కూడా సులభంగా చేయవచ్చు. Custard Apple Kheer Recipeని ఇక్కడ చూడండి.
ఈ చలికాలంలో విరివిగా లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. ఈ పండు బయట ఆకుపచ్చ బొడిపెలలాగా ఉంటే, విప్పి చూసినపుడు విచ్చుకున్న ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది. ఈ పండు మంచి కండ గలిగి, నోటికి తియ్యటి రుచిని అందిస్తుంది. సీతాఫలంలోనూ అనేక పోషకాలు ఉంటాయి. రక్తపోటును నియంత్రించడంలో ఇవి అద్భుతమైనవి. ఈ పండులో విటమిన్- సి అధికంగా ఉంటుంది, ఇది మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
సీతాఫలం అంటే చాలా మందికి చాలా ఇష్టం. అయితే కొంతమంది పండ్లు తినడానికి ఇష్టపడరు, ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా మారాం చేస్తారు. వారికి ఇప్పటి నుంచి అన్ని పండ్లు తినడం అలవాటు చేయాలి. నేరుగా పండు తినడం ఇష్టపడని వారు సలాడ్‌లు, డెజర్ట్‌లలో రూపంలో తినవచ్చు. అంతేకాదు సీతాఫలం పండుతో ఐస్ క్రీమ్, పాయసం వంటివి కూడా సులభంగా చేయవచ్చు. మీరు ఇప్పటివరకు అనేక రకాల పాయసాలు రుచి చూసే ఉంటారు. ఇందులో సీతాఫలం పాయసం రుచి వేరె లెవెల్లో ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సీతాఫలం పాయసం తయారీకి ఏమేం పదార్థాలు అవసరం అవుతాయి, తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సీతాఫలం పాయసం రెసిపీ ఈ కింద ఇచ్చాం, చూడండి.
Custard Apple Kheer Recipe కోసం కావలసిన పదార్థాలు
- 1 లీటరు పూర్తి క్రీమ్ పాలు లేదా మీగడ పాలు
- 3-4 సీతాఫలాల గుజ్జు
- 1-అంగుళం దాల్చిన చెక్క
- 1-2 స్టార్ సోంపు
- 3-4 ఏలకులు
- 3/4 కప్పు చక్కెర
సీతాఫలం పాయసం రెసిపీ- తయారీ విధానం
- ముందుగా ఒక గిన్నెలో పాలను వేడి చేసి, అవి సగానికి తగ్గేంతవరకు చిక్కగా మరిగించాలి.
- ఆ తర్వాత దాల్చిన చెక్క, స్టార్ సోంఫు, యాలకులు, చక్కెర వేసి మరో 5-10 నిమిషాల వరకు చిన్న మంటపై మరిగించాలి. ఇదే సమయంలో మీ వద్ద అందుబాటులో ఉంటే చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు.
- ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలను చల్లబరచండి. అనంతరం ఈ పాలను సీతాఫలం గుజ్జులో వేసి బాగా కలపాలి. మీ ఇష్టప్రకారంగా తీపిని సర్దుబాటు చేసుకోండి.
అంతే, సీతాఫలం ఖీర్ రెడీ. దీనిని సర్వింగ్ బౌల్స్ లోకి తీసుకొని పైనుంచి డ్రైఫ్రూట్స్ చల్లుకోండి. ఈ పాయసంను వెచ్చగా ఉన్నపుడు ఒకసారి తిని చూడండి. అలాగే ఫ్రీజర్‌లో చల్లబరిచి అప్పుడు కూడా తినవచ్చు. రెండు రకాలుగా దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
సంబంధిత కథనం