తెలుగు న్యూస్  /  Lifestyle  /  Must Follow These Rules For A Happy Relationship

తెంచుకోవడానికి నిమిషం చాలు, కలవాలంటే ఓ జీవితం సరిపోదు! ఈ సూత్రాలతో మీ బంధం పదిలం

Manda Vikas HT Telugu

27 December 2021, 11:19 IST

    • విడిపోవటం తేలిక కానీ బంధం ఏర్పడటం చాలా కష్టం. కొన్నాళ్లు కలిసి ఉండి, ఆ తర్వాత విడిపోతే ఆ సంఘటన వ్యక్తుల జీవితంలో చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఏదైనా ఒక జంట తమ సంబంధం బలంగా, కలకాలం నిలకడగా ఉండాలంటే వారిరువురు కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. అలుమగలిద్దరిలో ఒకరి మనస్తత్వం ప్రకారం వారు వెనక్కి తగ్గరు అని తెలిసినపుడు, మరొకరు ఒక మెట్టు వెనక్కి తగ్గి చూడాలి.
Relationship
Relationship (Unsplash)

Relationship

ఆలుమగల మధ్య బంధం అనేది చిరకాలం ఉండాలి. ఎందుకంటే విడిపోవటం తేలిక కానీ తిరిగి కలవటం అనేది చాలా కష్టం. కొన్నాళ్లు కలిసి ఉండి, ఆ తర్వాత విడిపోతే ఆ సంఘటన తమ జీవితంలో చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఏదైనా ఒక జంట మధ్య సంబంధం బలంగా, కలకాలం నిలకడగా ఉండాలంటే వారివురు కొన్ని రహస్య నియమాలకు కట్టుబడి ఉండాలి. ఆ నియమాలు పాటిస్తే ఏ జంట మధ్య తగాదాలు తలెత్తినా, వారు తిరిగి వెంటనే కలిసిపోయి సంతోషకరమైన జీవనాన్ని సాగించవచ్చు.

విడిపోవడం, విడాకులు పరిష్కారం కాదు: 

చాలా మంది తమ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు విడిపోవడమే మేలనుకుంటారు, విడాకులు పరిష్కారంగా భావిస్తారు. కానీ ఈ చర్య జీవితంలో చేసే అతిపెద్ద తప్పు.  విడాకులు అనేది అనివార్య పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవలసిన అత్యున్నత నిర్ణయం తప్ప, అదే మంచి పరిష్కారమని ఎప్పుడూ భావించవద్దు. విడిపోవాలి అనుకున్నప్పుడు ఇరువురు కొంతకాలం సమయం తీసుకోవాలి. సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయాలి. అలుమగలిద్దరిలో ఒకరి మనస్తత్వం ప్రకారం వారు వెనక్కి తగ్గరు అని తెలిసినపుడు, మరొకరు ఒక మెట్టు వెనక్కి తగ్గి చూడాలి. 

పర్ఫెక్ట్ రిలేషన్స్ అంటూ ఏవీ లేవు:

పర్ఫెక్ట్ రిలేషన్స్ అంటూ ఏవీ లేవు. ఏదో ఒక జంట సంతోషంగా ఉన్నంత మాత్రానా వారి బంధం పరిపూర్ణంగా ఉందని అనిపించుకోదు. ఎందుకంటే బంధం అనేది సంతోషం కోసమో, సంతృప్తి కోసమో నిర్ధేశించింది కాదు. కష్టాలు వచ్చినపుడు ఇద్దరు కలిసి వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు, సమస్యలు తలెత్తినప్పుడు ఎలా పరిష్కరించుకుంటున్నారనేది ముఖ్యం.  ఏదో జంట సంతోషంగా ఉంది, వారిలా మేము లేము, తప్పుడు భాగస్వామితో ఉన్నాను అని ఎప్పుడూ అనుకోవద్దు, మరొకరి జీవితాలతో పోల్చుకోవద్దు. జీవితంలో కష్టసుఖాలు సమతుల్యంగా ఉండాలి.  కష్టంలో కూడా ఇష్టంగా కలిసి ఉండే వారిదే నిజమైన బంధం.

భయంతో బంధాలు నిలవవు:

భాగస్వామి పట్ల భయంతో, భాగస్వామిని భయపెట్టో సంతోషకరమైన బంధాన్ని ఏర్పర్చలేము. ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకునేంత స్వేచ్ఛ ఉండాలి, అప్పుడే ప్రేమ వికసిస్తుంది.

ప్రేమలో నిజాయితీ:

మీరు మీ భాగస్వామిని ప్రేమిస్తున్నట్లు నిరంతరం చెబుతూ ఉండవచ్చు, కానీ మీ మాటల్లో ఉండే ప్రేమ చేతల్లో కూడా ఉంటుందా?

ప్రేమ ఒక భావోద్వేగం! అది భాగస్వామికి అందించే గౌరవం, వారి పట్ల శ్రద్ధ, సంరక్షణ, కొద్దిపాటి కోపం, క్షమాగుణం లాంటివి ఏ రూపంలోనైనా వీలైనప్పుడల్లా వ్యక్తీకరించండి. అయితే అందులో నిజాయితీ అనేది ఉండాలి.  అభిప్రాయాలు కలవనపుడు వారి కోణంలో ఆలోచించి గౌరవం ఇవ్వాలి. మీ భాగస్వామి విచారంగా ఉన్నప్పుడు వారి పట్ల మీరు చూపించే కేర్ వారికి బాధ నుండి ఎంతో రిలీఫ్ అందిస్తుంది.

కలిసి జీవించాలని నిర్ణయించుకున్న తర్వాత ఒకరి ప్రోత్సాహం ఒకరికి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. మీలో నిజాయితీ ఉన్నప్పుడు మీకు ఎన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నా కూడా ప్రత్యామ్నాయం వైపు చూడరు.