Cheese Corn Toast Recipe । ఈ సాయంత్రం మిమ్మల్ని సంతృప్తి పరిచే స్నాక్, చీజ్ కార్న్ టోస్ట్!
19 October 2022, 18:20 IST
- సింపుల్ గా, రుచికరంగా ఏదైనా స్నాక్స్ తినాలనుకుంటే Cheese Corn Toast ని ప్రయత్నించండి. పిజ్జా, బర్గర్లకు మించిన టేస్ట్ ఉంటుంది. Recipe ఇక్కడ చూడండి.
Cheese Corn Toast Recipe
ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఏదైనా కొత్త రుచిని ఆస్వాదించాలని ఉందా? అయితే ఇప్పుడు మీకొక సూపర్ రెసిపీని పరిచయం చేస్తున్నాం, దీని పేరు చీజ్ కార్న్ టోస్ట్. పేరు చెప్పగానే మీకు అర్థం అయిపోయి ఉంటుందిగా ఇది మొక్కజొన్న, టోస్ట్ కలిపిచేసిన పదార్థం అని.
అయితే దీనిని ఒక్కసారి రుచిచూస్తే పిజ్జాలు, బర్గర్‌లు మర్చిపోతారు. ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. అందులోనూ ఇది స్నాక్స్ కాబట్టి హెవీగా ఉండదు. సాయంత్రం వేళ కాఫీతో పాటుగా చీజ్ కార్న్ టోస్ట్ రుచిని ఆస్వాదించవచ్చు.
చీజ్ కార్న్ టోస్ట్ తయారు చేయటానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు, సమయం కూడా పట్టదు. కేవలం 5-10 నిమిషాల్లోనే దీనిని సిద్ధం చేసుకోవచ్చు. క్రిస్పీ టోస్టుపై మెత్తని మృదువైన చీజ్, అక్కడక్కడా పంటికి తగిలే మొక్కజొన్న గింజలు, క్యాప్సికమ్ ముక్కలు వైవిధ్యమైన రుచిని అందిస్తాయి. మరి, ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం అంతా ఇక్కడ తెలుసుకోండి.
Cheese Corn Toast Recipe కోసం కావలసినవి
- 2 బ్రెడ్ ముక్కలు
- 2 టీస్పూన్ మమోసాస్
- 1 టీస్పూన్ షెజ్వాన్ సాస్
- 1 చిన్న ఉల్లిపాయ
- 1 టమోటా
- 1 క్యాప్సికమ్
- 1/2 కప్పు తీపి మొక్కజొన్న
- 1/2 కప్పు చీజ్ లేదా జున్ను
- 1 టీస్పూన్ వెన్న
- 1/4 టీస్పూన్ మిరియాల పొడి
- 1/4 టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్
- 1/4 టీస్పూన్ ఒరేగానో
- తగినంత ఉప్పు
చీజ్ కార్న్ టోస్ట్ తయారీ విధానం
- ముందుగా ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమోటాలను శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అలాగే స్వీట్ కార్న్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో కూరగాయ ముక్కలు, స్వీట్ కార్న్, మయోనైస్, షెజ్వాన్ సాస్, ఉప్పు, మిరియాల పొడి కలపండి.
- ఆపై అందులో చీజ్ వేసి, అన్నింటిని బాగా కలపండి.
- ఇప్పుడు తవా వేడిచేసి వెన్న వేసి విస్తరించండి, బ్రెడ్ ముక్కలకు కూడా వెన్నరాసి తవాపై కాల్చి తేలికగా టోస్ట్ చేయండి.
- తర్వాత బ్రెడ్ టోస్ట్ తీసుకొని దాని మీద కూరగాయల మిశ్రమం రాసి, అదనంగా తురిమిన జున్ను వేసి మూతపెట్టండి. 3-4 నిమిషాలు ఉడికించండి.
- చీజీ కార్న్ టోస్ట్ రెడీ అయినట్లే, పై నుంచి సీజనింగ్ చల్లుకొని తినండి.
చాలా సింపుల్ కదా, మీరూ ట్రై చేయండి మరి.