తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tea Time Snacks | చాయ్‌తో పాటు కరకరలాడే మసాల మత్రి.. మతి పోగొడుతుంది వీటి రుచి!

Tea Time Snacks | చాయ్‌తో పాటు కరకరలాడే మసాల మత్రి.. మతి పోగొడుతుంది వీటి రుచి!

HT Telugu Desk HT Telugu

30 August 2022, 18:09 IST

    • సాయంత్రం చాయ్ తాగుతూ స్నాక్స్ తినడం ఎంతో ఆనందాన్నిస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా మత్రిలు తిన్నారా? కరకరలాడే ఈ చిరుతిండి టీటైంలో మంచి స్నాక్స్ అవుతాయి. రెసిపీ ఇక్కడ ఉంది.
Masala Mathri
Masala Mathri

Masala Mathri

రోజంతా వివిధ పనులతో బిజీగా గడిపి సాయంత్రం అవ్వగానే ఒక కప్ టీ తాగితే ఎంతో రిలాక్స్ అనిపిస్తుంది. టీతో పాటుగా తినటానికి రుచికరమైన స్నాక్స్ కూడా ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే సాయంత్రం వేళ చిరుతిళ్లు అనగానే మనకు సమోసాలు, పఫ్స్, పునుగులు లాంటివి గుర్తుకు వస్తాయి. మరి ఎప్పుడూ ఇలాంటివే ఎందుకు? నాలుక ఉంది నాలుగు రకాల రుచులు చూడటానికే కదా? మనకు నాలుగే కాదు, లెక్కలేనని రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. కొంచెం కొత్తగా కావాలనుకుంటే గుజరాతీ స్టైల్లో మత్రి అనే స్నాక్స్ చేసుకోవచ్చు. ఇది మైదా పిండి లేదా గోధుమ పిండితో చేసుకునే చిరుతిండి.

మత్రిలు పూర్తిగా శాఖాహారమైన వంటకం. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ వైపు ఈ స్నాక్స్ ఎక్కువగా చేసుకుంటారు. చాయ్ తాగే సమయంలో వీటిని అందిస్తారు. నూనెలో డీప్ ఫ్రై చేసి వీటిని చేయాలి. తింటే ఎంతో రుచిగా ఉంటాయి, కరకరలాడతాయి. ఈ మత్రిలను తయారు చేయటం కూడా చాలా సులభం. వీటి తయారీకి ఎక్కువ పదార్థాలు, శ్రమ కూడా అవసరం లేదు. మనం పండగలకు చేసుకునే అప్పాల లాగా ఉంటాయి, కానీ రుచిలో కాస్త భిన్నంగా ఉంటాయి. మరి మత్రిల తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలానో దీని రెసిపీ ఇక్కడ ఇచ్చాం. వీలైతే మీరు ట్రై చేయండి.

Mathri Recipe- కావలసిన పదార్థాలు

  • 1 కప్పు మైదాపిండి
  • 1 కప్పు రవ్వ
  • 1/2 టీస్పూన్ వాము
  • 1 స్పూన్ ఉప్పు
  • 1/4 కప్పు వెన్న
  • డీప్ ఫ్రైయింగ్ కోసం సరిపడా ఆయిల్

తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, రవ్వ, వాము వేసి బాగా కలపండి. కొద్దిగా వెన్న తీసుకొని ఈ పిండి మిశ్రమంతో కలపండి. ముట్టుకుంటే బ్రెడ్ ముక్కను పొడిచేసినట్లుగా మృదువుగా అనిపించాలి.
  2. ఇప్పుడు చల్లటి నీటిని కలిపి మిశ్రమం మరింత మెత్తగా రొట్టెల పిండి ముద్దలాగా చేసుకోండి. ఆపై పిండి ముద్దను కవర్ చేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
  3. అనంతరం పిండిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకొని గారెల సైజులో ఒత్తుకోవాలి. ఒక ఫోర్క్ సహాయంతో అక్కడక్కడా రంధ్రాలు చేసుకోవాలి.
  4. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి ఫ్లాట్ గా ఒత్తుకున్న మత్రిలను నూనెలో వేయించాలి. పైకి తేలాకా మరోవైపు వేయించండి.
  5. మత్రిలను రెండు వైపులా లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
  6. చివరగా వీటి నుంచి నూనె శోషణ అయ్యేలా ఏదైనా కాగితం పరిచిన గిన్నెలో వేసి చల్లబరిస్తే, మత్రిలు రెడీ అయినట్లే.

వేడివేడి చాయ్ తాగుతూ, కరకరలాడే మత్రిలను తింటూ సాయంకాలాన్ని ఆస్వాదించండి.

టాపిక్