Unhealthy Snacks |చిరుతిళ్లు ఎక్కువగా తింటున్నారా?ఈ స్నాక్స్ అస్సలు మంచివి కావు!-do you know these snacks are not actually healthy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Do You Know These Snacks Are Not Actually Healthy

Unhealthy Snacks |చిరుతిళ్లు ఎక్కువగా తింటున్నారా?ఈ స్నాక్స్ అస్సలు మంచివి కావు!

HT Telugu Desk HT Telugu
May 10, 2022 04:11 PM IST

చిరుతిళ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్ని రకాల చిరుతిళ్లు తింటే ఆరోగ్యానికి మంచిదే అని వాదనలు ఉన్నాయి. కానీ అందులో నిజానిజాలెంత? ఈ వివరాలు చూడండి..

Unhealthy Snacks
Unhealthy Snacks (Pixabay)

కొంతమంది ఆహారం విషయంలో అస్సలు శ్రద్ధ చూపరు. ఇంట్లో ఎంత బాగా వండినప్పటికీ అవేమి తినకుండా చిరుతిళ్లతోనే కడుపు నింపుకుంటారు. చిరుతిళ్లు తిననిదే వారికి పూట గడవదు. నోటిలో పిండిర్ని నడుస్తున్నట్లుగా చిరుతిళ్లను పళ్లకింద దంచుతూనే ఉంటారు.

టీవీల్లో వివిధ రకాల ప్రకటనలు ఆకర్షనీయంగా ఉంటాయి. వారి మార్కెటింగ్ జిమ్మిక్కులతో టేస్ట్ కూడా, హెల్త్ కూడా అంటూ ప్రచారం చేస్తారు. నిజానికి ఆవేవి ఆరోగ్యకరమైనవి కావు. అసలు దాదాపు చిరుతిళ్లు ఏవి ఆరోగ్యకరమైనవి కావు.

ఇటీవల కాలంగా ప్రజలకు చిరుతిళ్లపై మోజు పెరిగిపోతుంది. కొన్ని ప్యాక్ చేసి వచ్చే చిరుతిళ్లు మన జీవనశైలిలోనూ ఒక భాగంగా మారాయి. తేలికైనవి, ఆరోగ్యకరమైనవి అని మీరు భావిస్తున్నారో అవి నిజానికి ఆరోగ్యకరమైనవి కావు. అలాంటి కొన్ని చిరుతిళ్లను ఇక్కడ జాబితా చేస్తున్నాము.

ప్రోటీన్ బార్లు

ప్రోటీన్ బార్లు ఆకలిని తీరుస్తాయి, మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. ప్రతిరోజూ ఆహారంతో పాటు ఇవి కూడా తింటేనే సరైన పోషణ లభిస్తుందని ప్రకటనల్లో చెప్తారు. కానీ ఈ ప్రోటీన్ బార్‌లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రోటీన్ బార్ చాక్లెట్ల విషయంలో జాగ్రత్త అవసరం. వాటిని ఎలాంటి ముడి పదార్థాలు ఉపయోగించి చేశారు అనేది పరిశీలించాలి.

పాప్ కార్న్

అత్యంత జనాదరణ పొందిన స్నాక్స్ ఇవి, సినిమా హాళ్లలో వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువ. నిజానికి పాప్ కార్న్ చాలా తేలికైన ఆహారం అని భావిస్తారు. కానీ సాధారణ సాల్టెడ్ పాప్‌కార్న్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఫ్లేవర్డ్ పాప్ కార్న్, కెరామిల్ పాప్ కార్న్ వివిధ రకాల పాప్‌కార్న్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్యాక్ చేసిన పాప్‌కార్న్‌లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటుకు కారణమవుతుంది.అలాగే బటర్ పాప్ కార్న్, స్వీట్ పాప్ కార్న్ మొదలగు వాటిల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు.

చిప్స్

ఆలూ చిప్స్ బదులు ఇతర వెజిటబుల్ చిప్స్‌ని ఎంచుకుంటే కొంచెం మంచివి అనుకుంటారు. నిజానికి ఎలాంటి చిప్స్ అయినా అన్నీ ఒకటే. వాటిని ఎండబెట్టి, బాగా డీప్ ఫ్రై చేసి, ప్యాక్ చేసి పెట్టిన తర్వాత ఇంకా అందులో ఎలాంటి పోషకాలు మిగులుతాయి? కేవలం రుచికోసం అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే. ఇక ఇందులో ఎన్నో రకాల వెరైటీలు, తింటే మైమరిచిపోతారు అనే టీవీ యాడ్లు మనం చూడొచ్చు. మైమరిచిపోవడం కాదు ఆరోగ్యాన్ని మరిచిపోవడం అని గుర్తించాలి. మీకు అంతగా నోటిని కరకరలాండించాలని ఉంటే ఒక క్యారెట్ గానీ, దోసకాయను గానీ నమలండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది.

ప్యాక్ చేసిన పండ్ల రసాలు

పండ్లరసాలు తాగటం మంచిదే కానీ ఎప్పుడో ప్యాక్ చేసిన పండ్ల రసాలు, సీజన్ కాని సమయంలోనూ లభించే మామిడిపండ్ల రసాలు ఇవన్నీ ప్రాసెస్ చేసిన పానీయాల కిందకు వస్తాయి. అంటే ఆ పండ్ల రసాలు పడవకుండా ఉండేందుకు ఎన్నో రకాల రసాయనాలు కలుపుతారు. అలాంటపుడు అది పండ్ల రసం ఎందుకవుతుంది? తియ్యటి పురుగుల మందు అవుతుంది. కాకపోతే ప్రాణాంతకం కాదు. అలాగని అమృతం కూడా కాదు. ఎప్పుడైనా సరే నేరుగా పండ్లను కొకుక్కొన్ని, వాటిని జ్యూస్ చేసుకొని తాగితే ఆరోగ్యకరం అని గ్రహించాలి.

పలుకులు

నట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. నట్స్‌లో 80% కొవ్వు ఉంటుంది దాదాపు ఆరోగ్యకరమైనదే, కానీ కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి పరిమిత మోతాదులో తీసుకుంటేనే ఏవైనా మంచివి, బస్తాలకు బస్తాలు తినేస్తే ఎవరైనా ఆ బస్తాలాగే ఉబ్బిపోవడం ఖాయం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్