Easter Sunday Feast । చికెన్ తంగ్డీతో మీ విందును మరింత పసందుగా చేసుకోండి!
09 April 2023, 13:09 IST
- Easter Sunday Feast: ఈస్టర్ విందుకైనా, ఇఫ్తార్ పార్టీ అయినా, ఆదివారం దావత్ అయినా.. మీ వేడుకలో మిమ్మల్ని సంతృప్తపరిచే రుచికరమైన చికెన్ తంగ్డీ కబాబ్ రెసిపీని ఇక్కడ చూడండి.
Tangdi Chicken Recipe
Easter Sunday Feast: ఎప్పుడైనా నాన్-వెజ్ తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తుకొచ్చేది చికెన్. ఎందుకంటే, చికెన్ ఏ సమయంలోనైనా తాజాగా లభిస్తుంది, వండటం త్వరగా అయిపోతుంది, చికెన్‌తో ఎన్నో రకాల వంటకాలు కూడా చేసుకోవచ్చు. సంతృప్తికరమైన భోజనం చేయాలంటే కోడికూర ఉండాల్సిందే. అయితే ఈ కోడికూరలోనూ లెగ్ పీస్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఈరోజు ఆదివారం, అందులోనూ ఈరోజు ఈస్టర్ విందులు కూడా ఉన్నాయి. మీకోసం ఇక్కడ సింపుల్‌గా చేసుకునే తంగ్డీ లెగ్ పీస్ రెసిపీని అందిస్తున్నాం.
తంగ్డీ లెగ్ పీస్ ఎలాంటి విందుకైనా అద్భుతమైన స్టార్టర్. చికెన్ లెగ్స్‌కు ఉప్పు, కారం, మసాలాలు బాగా దట్టించి. క్రిస్పీగా కాల్చుకుని తింటే దాని టేస్టే వేరు. ఇవి పార్టీలో మీ డ్రింక్స్ తో పాటు తీసుకోవడానికి, అన్నం, చపాతీ, బ్రెడ్ లలో నంజుకోవడానికి లేదా నేరుగా స్నాక్స్ లాగా తీసుకోవడానికి రుచికరమైన ఛాయిస్. ఆలస్యం చేయకుండా చికెన్ తంగ్డీ రెసిపీని ఈ కింద చదివి సులభంగా సిద్ధం చేసుకోండి.
Tangdi Chicken Recipe కోసం కావలసినవి
- 2 చికెన్ లెగ్స్
- 2 టీస్పూన్ వెల్లుల్లి-అల్లం పేస్ట్
- 1 టీస్పూన్ కారం
- 1/2 టీస్పూన్ మసాలా పొడి
- 1/4 పసుపు
- 1/2 కప్పు పెరుగు
- 1/2 స్పూన్ ఉప్పు
- 3 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె
- తాజా కొత్తిమీర
- 1 నిమ్మకాయ
తంగ్డీ చికెన్ తయారీ విధానం
- ముందుగా చికెన్ లెగ్స్‌ను నీటితో శుభ్రంగా కడగండి. అనంతరం కడిగిన చికెన్ ముక్కలను ఒక ఫోర్క్ సహాయంతో గుచ్చుతూ రంధ్రాలు చేయండి లేదా కత్తితో గాట్లు పెట్టండి.
- ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ లెగ్స్ తీసుకొని వాటిపై అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, మసాలా, ఒక టీస్పూన్ నూనె, ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి.
- మీ చేతులతో ముక్కలకు మసాలా బాగా దట్టించి, ఆపైన కొద్దిసేపు వీటిని డీప్ ఫ్రిజ్‌లో ఉంచండి.
- ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసి, అధిక మంట మీద మసాలా దట్టించిన చికెన్ లెగ్స్‌ను కాల్చండి. కబాబ్‌లు బయట చార్ గ్రిల్ అయ్యే వరకు కాల్చాలి. తంగ్డీ చికెన్ కబాబ్స్ రెడీ.
చివరగా, కాల్చిన కబాబ్‌లను బయటకు తీసి వాటిపై కొత్తిమీర చల్లి, ఉల్లిపాయ, నిమ్మకాయలతో అలంకరించుకొని, సర్వ్ చేసుకోండి.