తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Super Foods: మీ ఆయుష్షును పెంచుకునేందుకు ఈ ఎనిమిది సూపర్ ఫుడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోండి

Super foods: మీ ఆయుష్షును పెంచుకునేందుకు ఈ ఎనిమిది సూపర్ ఫుడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోండి

Haritha Chappa HT Telugu

21 June 2024, 10:30 IST

google News
    • Super foods: దీర్ఘాయుష్షును పెంచుకునేందుకు కొన్ని రకాల ఆహారాలను తినాలి. వాటిని ప్రతిరోజూ మెనూలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా ఎనిమిది రకాల ఆహారాలను తినాల్సిన అవసరం ఉంది.
ఆయుష్షును పెంచే ఆహారం
ఆయుష్షును పెంచే ఆహారం (pixabay)

ఆయుష్షును పెంచే ఆహారం

Super foods: ఆరోగ్యంగా సుదీర్ఘ జీవితాన్ని గడపాలంటే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు ఆరోగ్యాన్ని పెంచి ఆయుష్షును అందిస్తాయి. మన జీవనశైలే మన ఆయుష్షును నిర్ణయిస్తుంది. కాబట్టి ఎలాంటి రోగాల బారిన పడకుండా అకాల మరణం చెందకుండా, పూర్తి ఆయుష్షు జీవించాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలి. కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జీవక్రియ సవ్యంగా సాగుతుంది. వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి. అలాంటి సూపర్ ఫుడ్స్ ఇక్కడ ఇచ్చాము. వీటిని తరచూ తినేందుకు ప్రయత్నించండి.

ఆకుకూరలు

పాలకూర, బచ్చలి కూర, కాలే, తోటకూర వంటివి ఆరోగ్యకరమైన ఆకుకూరలు జాబితాలోకి వస్తాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, క్యాల్షియం, లూటీన్, జియాక్సంతిన్ వంటి వాటితో నిండి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎముకలను గట్టి పరచడంతో పాటు రోగనిరోధక పనితీరును పెంచుతాయి. క్రమం తప్పకుండా మీ భోజనంలో ఆకుకూరలను చేర్చుకోవాలి. ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూరను తినడం చాలా అవసరం.

కొవ్వు చేపలు

కొన్ని రకాల చేపల్లో మంచి కొవ్వు పేరుకుంటుంది. సాల్మన్, మాకెరల్, సార్డిన్, ట్రౌట్ వంటి కొవ్వు చేపలను ఎంపిక చేసుకొని తినాల్సిన అవసరం ఉంది. దీనిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పని తీరుకు చాలా అవసరం. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మేలు చేస్తాయి. కొవ్వు చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది అభిజ్ఞా పని తీరును మెరుగుపరుస్తుంది.

నట్స్

బాదం పప్పులు, చియా సీడ్స్, వాల్నట్స్, అవిసె గింజలు వంటివన్నీ ప్రతిరోజు గుప్పెడు తినాల్సిన అవసరం ఉంది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్లు నిండుగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికీ, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీవశక్తికి తోడ్పడతాయి. కాబట్టి ప్రతిరోజూ గుప్పెడు నట్స్ తినేందుకు ప్రయత్నించాలి.

బెర్రీ పండ్లు

బెర్రీలో ఎన్నో రకాలు ఉన్నాయి. బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలా బెర్రీ జాతి పండ్లను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో చేరడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌తో ఇవి పోరాడుతాయి. వృద్ధాప్య సంకేతాలు రాకుండా అడ్డుకుంటాయి. దీర్ఘకాలిక వ్యాధులను కూడా రాకుండా నిరోధిస్తాయి.

పసుపు

పసుపు ప్రతి తెలుగు ఇంట్లో కనిపించే ఒక మసాలా దినుసు. దీనిలో కర్కుమిన్ ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న సమ్మేళనం. పసుపును ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. మెదడ పనితీరు మెరుగుపడుతుంది. వయసు సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

గ్రీన్ టీ

ప్రతిరోజు ఒకసారి గ్రీన్ టీ తాగడం చాలా అవసరం. దీనిలో క్యాటచిన్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు గ్రీన్ టీ తాగే వారిలో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ. గ్రీన్ టీ ప్రతిరోజూ తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జీవక్రియ సవ్యంగా సాగుతుంది. దీనివల్ల దీర్ఘాయువు దక్కుతుంది.

తృణ ధాన్యాలు

బ్రౌన్ రైస్, బార్లీ, ఓట్స్, క్వినోవా వంటి తృణధాన్యాలను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం అడ్డుకుంటాయి. కాబట్టి రోజులో ఒక పూట తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోండి.

పెరుగు

ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తినడం అలవాటు చేసుకోవాలి. ఇది ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్. ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి, పొట్ట ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే సాదా పెరుగునే తినాలి. పెరుగులో చక్కెర వంటివి కలుపుకొని తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

తదుపరి వ్యాసం