Green Tea: గ్రీన్ టీతో బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజులో అది తాగేందుకు సరైన సమయం ఎప్పుడంటే...
Green Tea: గ్రీన్ టీకి అభిమానులు ఎక్కువ. అది తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారని ఎంతో మంది నమ్మకం.
Green Tea: ఆరోగ్య స్పృహ ఉన్నవారందరూ సాధారణ కాఫీ, టీలకు దూరమయ్యారు. ఇప్పుడు వారి ప్రథమ ప్రాధాన్యత గ్రీన్ టీకే. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నారు. అలాగే గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారనే వాదన కూడా ఉంది. అది నిజమేనని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
సన్నబడటానికి గ్రీన్ టీని తమ డైట్లో భాగం చేసుకోవాలి. గ్రీన్ టీ తాగుతూ ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలన్న కోరికతో రోజులో రెండు, మూడు సార్లు గ్రీన్ టీ తాగేసే వాళ్ళు ఎంతోమంది. ఇలా తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం తక్కువే. గ్రీన్ టీ తాగే పద్ధతి ఒకటుంది. ఏ సమయాలలో తాగితే బరువు త్వరగా తగ్గుతారో తెలుసుకోండి.
గ్రీన్ టీ ఎప్పుడు తాగాలంటే...
గ్రీన్ టీ ఎప్పుడైనా తాగొచ్చని చాలామంది అనుకుంటారు. ఇదే తప్పుడు అభిప్రాయం. గ్రీన్ టీ తాగడానికి కొన్ని సమయాలు ఉన్నాయి. ఆ సమయాల్లో తాగడం వల్లే అది సమర్థంగా పనిచేస్తుంది. సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. బాగా వేడిగా ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగడం వల్ల ఉపయోగాలు తక్కువ. దాన్ని ఎప్పుడైనా గోరువెచ్చగా అయ్యాకే తాగాలి. అప్పుడే శరీరానికి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పొట్ట నిండా భోజనం చేశాక గ్రీన్ టీ ఎప్పుడూ తాగకూడదు. దీనివల్ల ఆహారంలోని ప్రోటీన్లు వంటి పోషకాలు జీర్ణం అయ్యే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి వంటివి రావచ్చు. అలాగే చాలామంది ఖాళీ పొట్టతో ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతారు. ఇది మంచి పద్ధతి కాదు. గ్రీన్ టీలో కొన్ని రకాల ఆమ్లాలు ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను దెబ్బతీస్తాయి. కాబట్టి అల్పాహారం చేశాక ఒక గంట గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ తాగడం చాలా ముఖ్యం. టాబ్లెట్లు గ్రీన్ టీతో కలిపి వేసుకోకూడదు. ఆదరాబాదరాగా గ్రీన్ టీ తాగడం వల్ల లాభం ఉండదు. చాలా రిలాక్స్‌డ్ మూడ్లో తాగితే దానివల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
గ్రీన్ టీని తాగేందుకు సరైన సమయం ఉదయమే. అయితే ఖాళీ పొట్టతో మాత్రం తాగకూడదు. తేలికపాటి ఆహారాన్ని తిని ఒక గంట విరామంతో దీన్ని తాగాలి. గ్రీన్ టీ మితంగా తాగితే ఆరోగ్యం. అతిగా తాగితే మాత్రం కొత్త ఆరోగ్య సమస్యలను తెచ్చుకున్న వారవుతారు. ఎందుకంటే గ్రీన్ టీలో కూడా ఎంతో కొంత మొత్తంలో కెఫీన్ ఉంటుంది. రోజుకు నాలుగైదు కప్పులు తాగితే ఆ కెఫిన్ శరీరంలో ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు రెండు కప్పులకు మించి తాగకూడదు. ఉదయం అల్పాహారం తిన్నాక ఒక గంట విరామంతో గ్రీన్ టీ తాగాలి. సాయంత్రం నాలుగు గంటల నుంచి అయిదు గంటల మధ్యలో గ్రీన్ టీ తాగడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.