Masala Green Tea: ఉదయానే లేచి ఇలా మసాలా గ్రీన్ టీ చేసుకుని తాగండి, చలి తగ్గుతుంది
Masala Green Tea: చలికాలంలో మసాలా గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.
Masala Tea: చలికాలంలో వెచ్చని పానీయాలు తాగాలనిపిస్తుంది. అలాగని ఏది పడితే అది తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం లేవగానే మసాలా గ్రీన్ టీని చేసుకుని తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరానికి ఎన్నో పోషకాలను అందించడంతో పాటు వెచ్చదనాన్ని ఇస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోకుండా కాపాడుతుంది. దీనివల్ల అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఉదయాన్నే తాగడం వల్ల చలి కూడా తగ్గుతుంది. చలికాలంలో రోజు ఉదయాన ఈ టీని తాగితే రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా పనిచేస్తారు. మసాలా గ్రీన్ టీ తయారు చేయడానికి ఏం కావాలో చూద్దాం.
మసాలా గ్రీన్ టీ తయారీకి కావలసిన పదార్థాలు
గ్రీన్ టీ బ్యాగ్ -ఒకటి
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - రెండు
అల్లం ముక్క - చిన్నది
లెమన్ గ్రాస్ తరుగు - అర స్పూను
నారింజ రసం - ఒక స్పూను
నీళ్లు - ఒకటిన్నర కప్పు
మసాలా గ్రీన్ టీని ఇలా తయారు చేయండి
1. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీటిని వేయాలి.
2. ఆ నీటిలో అల్లం తరుగు, లెమన్ గ్రాస్ తరుగు, దాల్చిన చెక్క ముక్క, రెండు లవంగాలు వేసి మరిగించాలి.
3. స్టవ్ ఆఫ్ చేశాక వడకట్టి ఆ నీటిని ఒక గ్లాసులో వేయాలి. ఆ గ్లాస్‌లోని గ్రీన్ టీ బ్యాగ్ కూడా వేయాలి.
4. తర్వాత ఒక స్పూను నారింజ జ్యూస్, తేనె కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే తాగాలి.
5. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రుచి కూడా అదిరిపోతుంది.
మసాలా గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి వెచ్చదనం వస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. గ్రీన్ టీతో పోలిస్తే మసాలా గ్రీన్ టీలో మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. అంతేకాదు బరువును కూడా తగ్గించుకోవచ్చు. జీవక్రియ రేటును కూడా ఇది పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధిక కొలెస్ట్రాల్ బారిన పడినవారు ఈ మసాలా గ్రీన్ టీని తాగడం చాలా మంచిది. దీన్ని తాగడం వల్ల చర్మకాంతి కూడా పెరుగుతుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువే, కాబట్టి ప్రతిరోజూ వెచ్చగా తాగడం అలవాటుగా మార్చుకోండి.