తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మహిళల్లోనే విటమిన్ డి లోపం ఎక్కువ.. ఎందుకంటే..

మహిళల్లోనే విటమిన్ డి లోపం ఎక్కువ.. ఎందుకంటే..

HT Telugu Desk HT Telugu

28 May 2022, 11:27 IST

    • పురుషుల కంటే స్త్రీలలో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది. అందుకే స్త్రీలు పలు సమస్యలతో ఎక్కువ బాధపడుతుంటారు. అయితే దీని లోపం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి.. ఆ లోపాన్ని ఎలా జయించాలో ఇప్పుడు తెలుసకుందాం.
విటమిన్ డి
విటమిన్ డి

విటమిన్ డి

Women's Health | విటమిన్ డి లోపం పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గుండెపోటు, గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. గర్భధారణ సమయంలో విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉంటే.. ప్రీ-ఎక్లాంప్సియా, గర్భధారణ మధుమేహం వంటి సమస్యలకు దారి తీస్తుంది. మహిళల్లో విటమిన్ డి ఎందుకు తక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తల్లిపాలు ఇచ్చే స్త్రీలలో విటమిన్ డి లోపం ఉండవచ్చు. మెనోపాజ్ తర్వాత శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల ఈ లోపం సంభవించే అవకాశముంది. చాలా మంది మహిళలు ఇంటి పని లేదా ఆఫీసు పనుల్లో బిజీగా ఉంటారు. దీని కారణంగా వారు సూర్యరశ్మికి తక్కువగా బహిర్గతమవుతారు. కాబట్టి వారి శరీరంలో విటమిన్ డి లోపం ఉంటుంది. విటమిన్ డి లేకపోవడం వల్ల స్త్రీలు త్వరగా అలసిపోతారు. ఒత్తిడి, టెన్షన్ కారణంగా మహిళలు రోజంతా డిప్రెషన్‌లో ఉంటారు. విటమిన్ డి లోపం లక్షణాలలో ఇది కూడా ఒకటి.

విటమిన్​ డి లోపం వల్ల కలిగే నష్టాలు

మీకు విటమిన్ డి లోపం ఉంటే ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? ఆయాసం, కీళ్ల నొప్పులు, కాళ్లు ఉబ్బడం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, కండరాల బలహీనత, మచ్చలు, బరువు పెరగడం, చర్మం నల్లబడడం వంటివన్ని విటమిన్ డి లోపం వల్ల ఏర్పడతాయి. విటమిన్ డి అతి ముఖ్యమైన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కాబట్టి అది లేకపోతే మీ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. మీరు తరచుగా ఫ్లూ, జ్వరం, జలుబుతో బాధపడుతుంటే.. మీలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నట్లు కనుగొనవచ్చు.

శస్త్రచికిత్స లేదా ఏదైనా గాయం తర్వాత అది తగ్గడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లైతే.. విటమిన్ డి లోపం వల్లే కావొచ్చు. విటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఎముకలు, కండరాలలో నిరంతరం నొప్పి ఉండవచ్చు. విటమిన్ డి లేకపోవడం వల్ల మహిళలు నడుము నొప్పికి గురవుతారు. ఇది పాదాలలో వాపునకు దారితీస్తుంది.

పరిష్కారమేమిటంటే..

విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయడానికి.. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాలు ఎండలో గడపడానికి ప్రయత్నించండి. కొవ్వు చేపలు (సాల్మన్ లేదా ట్యూనా), తక్కువ కొవ్వు ఉన్న పాల వంటి ఆహారాలను తినండి. ఆయిల్ ఫిష్, గుడ్డు సొనలు, కాడ్ లివర్ ఆయిల్ విటమిన్ డికి మంచి మూలాధారాలు. డాక్టర్ సలహా ప్రకారం.. ఈ విటమిన్లు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ విటమిన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.

టాపిక్