Multi-flour Idli Recipe । మల్టీఫ్లోర్ ఇడ్లీ.. పోషకాలు పుష్కలం, మధుమేహులకు గొప్ప అల్పాహారం!
07 April 2023, 6:30 IST
- Multi-flour Idli Recipe: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ గా పోషకాలు నిండిన ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి. మీకోసం ఇక్కడ మల్టీఫ్లోర్ ఇడ్లీ రెసిపీని అందిస్తున్నాం. ఇది మధుమేహం ఉన్నవారికి కూడా సరైన ఆహారం.
Multi-flour Idli Recipe
World Health Day 2023: మధుమేహం ఈరోజుల్లో చాలా మందికి సర్వసాధారణంగా మారింది. షుగర్ వ్యాధి ఉన్నప్పుడు తినే ఆహారాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Glycemic Index) విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ రోజు మొత్తానికి కావల్సిన ఇంధనం సమకూరుస్తుంది. కాబట్టి ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం చేయడం చాలా ముఖ్యం. మధుమేహులు ఇడ్లీలు (Diabetic Friendly Idli) అల్పాహారంగా తినవచ్చు, అయితే సాంప్రదాయ ఇడ్లీలు కాకుండా మల్టీగ్రెయిన్ ఇడ్లీలు నిస్సందేహంగా తినవచ్చు.
వివిధ రకాల చిరుధాన్యాలను గ్రైండ్ చేసిన పిండితో మల్టీఫ్లోర్ ఇడ్లీ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా ఆరోగ్యకరమైన ఇడ్లీ రెసిపీ. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండవు కాబట్టి, ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar levels) నియంత్రించడంలో సహయపడే మంచి అల్పాహారం. సులభంగా మల్టీఫ్లోర్ ఇడ్లీని ఎలా చేసుకోవచ్చో, ఈ కింద ఇచ్చిన సూచనలను చదవండి.
Multi-flour Idli Recipe కోసం కావలసినవి
- 1/2 కప్పు రాగి పిండి
- 1/2 కప్పు సజ్జ పిండి
- 1/2 కప్పు జొన్న పిండి
- 1/3 కప్పు గోధుమ పిండి
- 1/2 కప్పు మినప పప్పు
- 2 టీస్పూన్లు మెంతులు
- 1 స్పూన్ నూనె
- రుచికి సరిపడా ఉప్పు
మల్టీఫ్లోర్ ఇడ్లీ ఎలా తయారు చేయాలి
- ముందుగా మినప్పప్పు, మెంతులను ఒక గిన్నెలో తీసుకొని, తగినంత నీళ్లు పోసి సుమారు రెండు గంటలు నానబెట్టండి.
- నానబెట్టిన పప్పు, మెంతులను ఒక బ్లెండర్‌లో వేసి, అరకప్పు నీరు పోసి మెత్తని పిండిగా చేయండి.
- ఇప్పుడు ఈ పిండిలో మిగతా అన్ని పిండ్లు వేసి తగినంత నీరు, ఉప్పు వేసి బాగా కలపండి. ఆపై మూతపెట్టి రాత్రంతా పులియబెట్టండి.
- ఆ తర్వాత ఉదయం వేళ ఇడ్లీ కుక్కర్ అచ్చులలో ఇడ్లీలు అంటుకోకుండా కొద్దిగా నూనె చిలకరించి గ్రీజు చేయండి.
- ఆపై పులియబెట్టిన పిండిని ఇడ్లీ అచ్చులలో వేసి 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించండి.
ఆ తర్వాత మూత తీసి చూస్తే, మల్టీఫ్లోర్ ఇడ్లీలు రెడీ. మీకు నచ్చిన చట్నీ, సాంబార్‌తో వేడివేడిగా తినండి.