తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Idli Day । ఈరోజు ఇడ్లీలు మాత్రమే తినండి.. మీకోసం విభిన్నమైన ఇడ్లీ రెసిపీలు!

Idli Day । ఈరోజు ఇడ్లీలు మాత్రమే తినండి.. మీకోసం విభిన్నమైన ఇడ్లీ రెసిపీలు!

HT Telugu Desk HT Telugu

30 March 2023, 6:30 IST

google News
  • World Idli Day 2023: ఈరోజు ఇడ్లీ దినోత్సవం.. ఈ సందర్భంగా మీకోసం ఇక్కడ వివిధ ఇడ్లీ రెసిపీలను అందిస్తున్నాం, పండగ చేస్కోండి.

World Idli Day 2023
World Idli Day 2023 (Unsplash)

World Idli Day 2023

World Idli Day 2023: మనం ప్రతిరోజూ చేసే బ్రేక్‌ఫాస్ట్‌లలో ఆరోగ్యకరమైనది, అందరూ తరచుగా చేసేసుకునే అల్పాహారాలలో ఉత్తమమైనది ఏది అంటే అది ఇడ్లీనే. మీరు ఈరోజు ఇడ్లీనే తినండి, ఇడ్లీని మాత్రమే తినండి. ఎందుకంటారా? ఎందుకంటే ఈరోజు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం. అవును, ఇడ్లీలకు కూడా ఒక దినోత్సవం ఉంది. 2015లో మార్చి 30న చెన్నైకి చెందిన ఎనియవన్ అనే ఇడ్లీ క్యాటరర్ 1,328 రకాల వెరైటీ ఇడ్లీలను తయారు చేసి రికార్డ్ సృష్టించాడు. అప్పట్నించీ మార్చి 30వ తేదీని ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’గా గుర్తిస్తున్నారు.

మీకోసం ఇక్కడ వివిధ రకాల ఇడ్లీ రెసిపీలను అందిస్తున్నాము, వీలైతే ప్రయత్నించి చూడండి.

Cucumber Idli Recipe - దోసకాయ ఇడ్లీ రెసిపీ

కావాల్సిన పదార్థాలు

  • 1 కప్పు తురిమిన దోసకాయ
  • 1 కప్పు ఇడ్లీ రవ్వ/ దోశ పిండి
  • 1/2 కప్పు కొత్తిమీర
  • 2 తరిగిన పచ్చి మిరపకాయలు
  • 1/4 కప్పు తురిమిన కొబ్బరి
  • ఉప్పు రుచికి సరిపడా

దోసకాయ ఇడ్లీ తయారు చేసుకునే విధానం

  1. ఒక గిన్నెలో దోసకాయను చిన్నగా తురుముకోవాలి, ఇలా తురమగా వచ్చిన నీటిని వేరే గిన్నెలోకి తీసుకొని భద్రపరుచుకోవాలి.
  2. ఇప్పుడు మరొక గిన్నెలో తురిమిన దోసకాయతో పాటు ఇడ్లీ రవ్వ, కొత్తిమీర, పచ్చి మిరపకాయలు, తురిమిన కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు అన్ని వేసుకొని కలుపుకోవాలి.
  3. మీకు రుచికోసం జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అయితే ఇది ఐచ్చికం మాత్రమే.
  4. ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్న మిశ్రమానికి దోసకాయ నీరు కలుపుకోండి. పిండి ఇడ్లీలు చేయడానికి అనువుగా నీటిని కలుపుకోండి. . దోసకాయలో నీరు ఉంటుంది కాబట్టి మీరు నీరు తక్కువగా కలుపుకోండి.
  5. ఇప్పుడు ఇడ్లీ పాత్రల్లో ఇడ్లీలుగా వేసి ఒక 20 నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించండి. దోసకాయ ఇడ్లీలు సిద్ధం

Poha Idli Recipe- పోహా ఇడ్లీ రెసిపీ

  • 1 కప్పు మందపాటి అటుకులు
  • 1 కప్పు ఇడ్లీ రవ్వ
  • 1 కప్పు పెరుగు
  • 1/2 టీస్పూన్ ఉప్పు
  • 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా లేదా ఈనో
  • నీరు సరిపడినంత

పోహా ఇడ్లీ తయారీ విధానం

  1. ముందుగా అటుకులను పొడిగా, మామూలుగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. అటుకుల పొడిలో పెరుగు వేసి బాగా కలపాలి.
  3. ఆ తర్వాత ఇడ్లీ రవ్వ, ఉప్పు వేసి, కొన్ని నీళ్లు పోసి అన్నీ కలిసిపోయేలా మెత్తగా చేయాలి. దీనిని ఒక 15 నిమిషాల పాటు పక్కనబెట్టండి.
  4. 15 నిమిషాల అనంతరం మరికొన్ని నీళ్లు బేకింగ్ సోడా, లేదా ఈనో కలుపుకోవాలి.
  5. పిండి ఇడ్లీలు చేసేందుకు వీలుగా సరిపడా నీరు కలుపుతూ బ్యాటర్ సిద్ధం చేసుకోవాలి.
  6. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీలు వేసి, 15 నిమిషాలు ఆవిరిలో ఉడికిస్తే వేడివేడి పోహా ఇడ్లీ రెడీ.

Beetroot Idli Recipe- బీట్‌రూట్‌ ఇడ్లీ రెసిపీ

  • 1 కప్పు సెమోలినా/ రవ్వ
  • 1 కప్పు పెరుగు
  • 1/2 కప్పు బీట్‌రూట్ ప్యూరీ
  • 1/2 అంగుళం అల్లం
  • 3 పచ్చిమిర్చి
  • 1 స్పూన్ మినపపప్పు
  • 5-6 కరివేపాకులు
  • 1 టీస్పూన్ ఈనో ఫ్రూట్ సాల్ట్
  • ఉప్పు రుచి కోసం

బీట్‌రూట్‌ ఇడ్లీ తయారీ విధానం

  1. ముందుగా బీట్‌రూట్‌ను కట్ చేసి, మిక్సర్ జాడీలోకి తీసుకుని అందులో పచ్చిమిర్చి, అల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని ప్యూరీలా రుబ్బుకోవాలి
  2. ఆ తర్వాత రవ్వను పెనంపై దోరగా వేయించండి. చల్లారక ఒక గిన్నెలో తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, బీట్‌రూట్ ప్యూరీ అలాగే కొన్ని నీళ్లు పోసి కాసేపు పక్కన పెట్టండి.
  3. ఇప్పుడు, పాన్ తీసుకుని అందులో కొంచెం నూనె వేసి వేడి చేయండి. అందులో ఆవాలు, మినపపప్పు, కరివేపాకు వేసి వేయించండి.
  4. ఈ పోపును ఇండ్లీ పిండిలో వేసి బాగా కలపాలి. ఆపై ఇందులో ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి కలపండి.
  5. ఇప్పుడు ఇడ్లీ అచ్చులలో పిండిని పోసి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.

అంతే, మూత తీసి చూస్తే.. బీట్‌రూట్ ఇడ్లీలు సిద్ధంగా ఉంటాయి.

తదుపరి వ్యాసం