Beetroot Idli Recipe | తెల్లని ఇడ్లీకి రంగేయండి.. బీట్‌రూట్ ఇడ్లీ తిని చూడండి!
Beetroot Idli Recipe: ఇడ్లీ ఆరోగ్యకరమైన అల్పాహారం. బీట్‌రూట్ లో పోషకాలు అధికం. ఈ రెండింటిని కలగలిపి చేసే బీట్‌రూట్ ఇడ్లీ ఎంతో రుచికరం, ఆరోగ్యకరం. రెసిపీ ఇక్కడ ఉంది మీరు ప్రయత్నించండి.
మనలో చాలామంది అల్పాహారంగా ఇడ్లీని తినడానికి ఇష్టపడతారు. ఇది ఎంతో తేలికైన, ఆరోగ్యరమైన, బలవర్ధకమైన ఆహారం. ఉదయాన్నే వేడివేడిగా తెల్లని మృదువైన ఇడ్లీలను కొబ్బరిచట్నీ, సాంబార్‌లో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. ఇది హోలీ సీజన్ కాబట్టి తెల్లని ఇడ్లీలకు కొద్దిగా రంగు వేద్దాం, మరింత ఆరోగ్యకరంగా మారుద్దాం. మీకోసం ఇక్కడ బీట్‌రూట్ ఇడ్లీ రెసిపీని అందిస్తున్నాము, దీనిని మీరు తప్పకుండా ప్రయత్నించాలి.
బీట్‌రూట్‌లో పుష్కలంగా ఫైబర్‌లు ఉంటాయి, ఇవి పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. బీట్‌రూట్‌లో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా అవసరమైన పోషకాలు. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బీట్‌రూట్‌ను తినమని వైద్యులు సూచిస్తుంటారు.
మరి ఎర్రగా, బుర్రగా ఉండే ఆరోగ్యకరమైన బీట్‌రూట్ ఇడ్లీలను ఇన్‌స్టంట్‌గా ఎలా చేయాలో ఇక్కడ సూచనలు చదవండి.
Beetroot Idli Recipe కోసం కావలసినవి
- 1 కప్పు సెమోలినా/ రవ్వ
- 1 కప్పు పెరుగు
- 1/2 కప్పు బీట్‌రూట్ ప్యూరీ
- 1/2 అంగుళం అల్లం
- 3 పచ్చిమిర్చి
- 1 స్పూన్ మినపపప్పు
- 5-6 కరివేపాకులు
- 1 టీస్పూన్ ఈనో ఫ్రూట్ సాల్ట్
- ఉప్పు రుచి కోసం
బీట్‌రూట్ ఇడ్లీ తయారీ విధానం
- ముందుగా బీట్‌రూట్‌ను కట్ చేసి, మిక్సర్ జాడీలోకి తీసుకుని అందులో పచ్చిమిర్చి, అల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని ప్యూరీలా రుబ్బుకోవాలి
- ఆ తర్వాత రవ్వను పెనంపై దోరగా వేయించండి. చల్లారక ఒక గిన్నెలో తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, బీట్‌రూట్ ప్యూరీ అలాగే కొన్ని నీళ్లు పోసి కాసేపు పక్కన పెట్టండి.
- ఇప్పుడు, పాన్ తీసుకుని అందులో కొంచెం నూనె వేసి వేడి చేయండి. అందులో ఆవాలు, మినపపప్పు, కరివేపాకు వేసి వేయించండి.
- ఈ పోపును ఇండ్లీ పిండిలో వేసి బాగా కలపాలి. ఆపై ఇందులో ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి కలపండి.
- ఇప్పుడు ఇడ్లీ అచ్చులలో పిండిని పోసి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.
అంతే, మూత తీసి చూస్తే.. బీట్‌రూట్ ఇడ్లీలు సిద్ధంగా ఉంటాయి.
సంబంధిత కథనం