Jonna Upma Recipe। ఆరోగ్యకరమైన జొన్న ఉప్మా.. తినడానికి ఊ అంటారు తప్ప, ఊహూ అనలేరు!
Jonna Upma Recipe: ఉప్మా మన భారతదేశంలోని అందరి ఇళ్లలో చాలా తరచుగా వండుకొనే అల్పాహారం. ఇది చాలా ఆరోగ్యకరమైనది, ఎప్పుడూ చేసుకునేలా కాకుండా మరింత ఆరోగ్యకరంగా జొన్నలతో జొన్న ఉప్మా చేసుకోవచ్చు, రెసిపీ చూడండి.
వీకెండ్ వచ్చినప్పుడు కొంచె ఆలస్యంగా, కొంచెం ఓపిక చేసుకొని మెల్లగా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేయాలనిపిస్తుంది. మీకు ఆరోగ్యకరంగా ఏదైనా తినాలనుకుంటే ఇక్కడ ఒక రెసిపీని పరిచయం చేస్తున్నాం. మనందరికీ జొన్నరొట్టెలు తెలుసు, జొన్నదోశలు కూడా పాపులర్ అవుతున్నాయి. అంతేకాదు జొన్నలతో ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఉప్మా తరచుగా చేసుకునే అల్పాహారం, మరి అందులో వెరైటీలు కూడా ప్రయత్నం చేస్తే ఉప్మా ఎప్పుడూ బోర్ కొట్టదు. ఇక్కడ జొన్నలతో ఉప్మా ఎలా చేసుకోవాలో రెసిపీని అందిస్తున్నాం.
సాధారణంగా చాలా ఇళ్లలో చేసే సాంప్రదాయ రవ్వ ఉప్మాతో పోలిస్తే జొన్న ఉప్మా చాలా ఆరోగ్యకరమైన అల్పాహారం . దీనిని జొన్నలు నానబెట్టి లేదా జొన్నపిండితో తయారుచేసుకోవచ్చు.. దీనిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, రాత్రి భోజనంలో అయినా లేదా రోజులో ఏ సమయంలోనైనా తినగలిగే ఆరోగ్యకరమైన అల్పాహారం. పచ్చిబఠానీలు, క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో వంటి వెజిటెబుల్స్ కలిపి చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ అల్పాహారంలో ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ సమస్య ఉన్నవారు, బతువు తగ్గాలనే ఆలోచన ఉన్నవారికి ఈ జొన్న ఉప్మా ఒక మంచి అల్పాహారంగా ఉంటుంది. అంతేకాదు PCOS సమస్య ఉన్న మహిళలు అప్పుడప్పుడు జొన్న ఉప్మా చేసుకొని తినడం వలన వారికి ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు తెలిపారు. జొన్న ఉప్మా రెసిపీ కింద ఉంది, ఇలా మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.
Jonna Upma Recipe కోసం కావలసినవి
- 3/4 కప్పు జొన్నలు
- 1/4 టీస్పూన్ జీలకర్ర / జీరా
- 1/4 టీస్పూన్ స్పూన్ ఆవాలు
- 1 ½ స్పూన్ మినపపప్పు
- చిటికెడు ఇంగువ
- 1 ఉల్లిపాయ
- 2 -3 పచ్చి మిరపకాయలు ,
- 1 స్పూన్ అల్లం తురుము
- 1/4 కప్పు మిక్స్డ్ వెజిటేబుల్స్
- 1/4 కప్పు తాజా తురిమిన కొబ్బరి
- చిటికెడు పసుపు
- ఉప్పు రుచికి తగినట్లు
జొన్న ఉప్మా తయారీ విధానం
- ముందుగా జొన్నలను కడిగి కనీసం 8 గంటలు నానబెట్టండి. ఇలా నానబెట్టినపుడు జొన్నలు మెత్తగా మారతాయి.
- ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని, అందులో ఒక కప్పు నీరు పోసి, అందులో నానబెట్టిన జొన్నలు, చిటికెడు పసుపు వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
- ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు , మినపపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- అనంతరం పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము వేసి వేయించాలి, ఆపై కూరగాయ ముక్కలు వేసి వేయించాలి.
- ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి కలపాలి, ఆపై ఉడికించిన జొన్నలు, కొబ్బరి తురుము వేసి 2 నిమిషాలు వేయించాలి.
- చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపాలి.
అంతే.. ఆరోగ్యకరమైన జొన్న ఉప్మా రెడీ, వేడివేడిగా ఆరగించి చూడండి.
సంబంధిత కథనం