తెలుగు న్యూస్  /  Lifestyle  /  Increase Your Body Mass, 5 Yoga Asanas That Help You Gain Weight

Yoga for Weight Gain । ఈ యోగాసనాలు వేస్తే బరువు పెరుగుతారని మీకు తెలుసా?

HT Telugu Desk HT Telugu

22 December 2022, 11:55 IST

    • Yoga Asanas for Weight Gain: యోగా చేస్తే బరువు తగ్గుతారని తెలుసు, కానీ కొన్ని ఆసనాలతో బరువు పెరుగుతారు కూడా. అటువంటి యోగాసనాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Yoga Asanas for Weight Gain
Yoga Asanas for Weight Gain (Unsplash)

Yoga Asanas for Weight Gain

సాధారణంగా వ్యాయామం చేస్తే బరువు తగ్గుతారు, బరువు తగ్గేందుకు యోగాలో కూడా చాలా ఆసనాలు ఉన్నాయి. కానీ కొన్ని యోగాసనాలు మీ బరువును పెంచుతాయని మీకు తెలుసా? బరువు తగ్గాలని ప్రయత్నాలు చేసేవారు ఇలాంటి యోగాసనాలు అభ్యాసం చేస్తే మాత్రం విరుద్ధమైన ఫలితాలు వస్తాయి, కానీ బరువు పెరగాలనే ప్రయత్నం చేసే వారికి ఇది మంచి వ్యాయామం అవుతుంది.

కొంతమంది సన్నగా ఉండేవారు బరువు పెరగాలని, పుష్టిగా తయారవ్వాలని అతిగా తినడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు పెరగని వారు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు వేయడం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ యోగాసనాలు కండరాల ఫైబర్స్ పరిమాణం పెరిగేలా సహాయపడతాయి. అదనంగా ఇది పేలవమైన జీవక్రియ, జీర్ణక్రియ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది.

Yoga Asanas for Weight Gain- బరువు పెరగడానికి యోగాసనాలు

ఈ మొత్తం ప్రక్రియ సుదీర్ఘమైనది, కష్టమైనది కావచ్చు. అయినప్పటికీ, మీరు శ్రద్ధగా ప్రయత్నిస్తే ఫలితాలను త్వరగా చూసే అవకాశం ఉంది. బరువు పెరగడానికి కొన్ని ప్రభావవంతమైన యోగా భంగిమలను ఇప్పుడు తెలుసుకోండి.

చక్రాసనం- Wheel Pose

చక్రాసనం ఆసనం వేసేందుకు ముందుగా వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత మీ అరచేతులు, పాదాల మద్దతుతో మీ శరీరాన్ని గాలిలో పైకి లేపి ఒక వంపుని ఏర్పరుచుకోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి 30 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండి. తిరిగి అసలు స్థానానికి వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం మీ వెన్నెముక యొక్క వశ్యతను పెంచుతుంది, ఇది మీ శరీర భాగాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. బరువు పెరిగేందుకు కారణం అవుతుంది.

ధనురాసనం- Bow Pose

ఈ ఆసనం కోసం ముందుగా మీరు మీ కడుపుపై బోర్లా పడుకోవాలి. ఆపైన మీ చేతులను వెనుకకు తీసుకొని మీ చీలమండలను పట్టుకుని, మోకాళ్ళను మడిచి పట్టుకోవాలి. ఆ తరువాత, మీ ఛాతీని పైకి లేపి నేరుగా ముందుకు చూస్తున్న భంగిమలో ఉండాలి. బరువు పెరగడానికి ఇది మరొక ప్రభావవంతమైన యోగా ముద్ర. ఈ ఆసనం మీ వెన్ను, ఉదర కండరాలను బలోపేతం చేస్తుంది. మీ థైరాయిడ్ గ్రంధిని మసాజ్ చేస్తుంది, మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

భుజంగాసనం- Cobra Pose

ఈ ఆసనం వేసేందుకు మీ కడుపుపై ఫ్లాట్‌గా బోర్లాపడుకోండి. ఆపైన లోతైన శ్వాస తీసుకుంటూ, మీ అరచేతుల సహాయంతో మీ ఛాతీ, పొత్తికడుపును ఎత్తండి. ఈ స్థితిలో మీ శరీరం మొత్తం బరువు మీ అరచేతులపై ఉండాలి, మీ నాభి నేలను తాకాలి. కొన్ని సెకన్లు ఈ భంగిమలో ఉండి, నెమ్మదిగా శ్వాసను వదలండి, తిరిగి మీ ప్రారంభ స్థానానికి తిరిగి రండి. బరువు పెరగడానికి, జీర్ణక్రియ, జీవక్రియ, శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరచడానికి ఇది ప్రామాణిక యోగా ఆసనాలలో ఒకటి.

వజ్రాసనం- Diamond Pose

ఈ యోగా ఆసనం కోసం మీకు యోగా మ్యాట్ అవసరం. మీ తొడలను మీ కాలి మడిమలకు తాకేలా నిలువుగా కూర్చోవాలి, ఆపైన మీ చేతులను తొడలపై ఉంచుతూ లోతైన శ్వాసపై దృష్టి పెట్టండి. ఈ స్థితిలో మీ వెన్నెముక, మెడ నిటారుగా ఉండేలా చూసుకోండి. సుమారు 5-10 నిమిషాలు ఈ భంగిమలో ఉండండి. బరువు పెరగడానికి ఇది గొప్ప యోగాసనం. ఇంకా ఇది మలబద్ధకాన్ని తొలగించి, ఆకలిని పెంచడం ద్వారా జీవక్రియను మెరుగుపరుస్తుంది.

మత్స్యాసనం- Fish Pose

నేలపై పడుకుని, లోటస్ భంగిమలో ఉన్నట్లుగా మీ కాళ్లను కలిపి ఉంచండి. మీ శరీరాన్ని నెమ్మదిగా పైకి ఎత్తండి, మీ తలను నేలకి ఆనించడం ద్వారా ఒక వంపుని ఏర్పరుచుకోండి. ఇలా 20 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. పూర్తయిన తర్వాత, విశ్రాంతి తీసుకోండి. ఇది జీర్ణ, హృదయనాళ వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. బరువు పెరగడానికి ఇది ఒక గొప్ప యోగ భంగిమ.