Yoga for Kids । మీ పిల్లలు స్మార్ట్ అవ్వాలంటే, రోజూ ఈ 3 యోగాసనాలు వేస్తే చాలు!
Yoga Asanas for Kids: యోగా ఆసనాలు పెద్దలకు మాత్రమే కాదు, పిల్లలు కూడా సులభంగా వేయగలిగే ఆసనాలు ఉన్నాయి. ఇవి అభ్యాసం చేయడం ద్వారా వారికి చాలా ప్రయోజనాలున్నాయి.
అందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, అన్నింటిలోనూ చురుకుగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా చదువుల్లో బాగా రాణించాలి అని ఎక్కువగా ఆశపడతారు. ఇందుకోసం మంచి చదువులు చెప్పించడమే కాకుండా, అదనంగా ట్యూషన్స్ కూడా పెట్టిస్తారు. అయితే పిల్లలు స్మార్ట్ గా తయారవ్వాలంటే వారి శారీరక ఆరోగ్యంతో పాటు వారి మానసిక ఆరోగ్యంపైనా తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి. అందుకు కేవలం చదువులు మాత్రమే కాకుండా వారు ఇతర కార్యకలాపాలలో కూడా చురుగ్గా పాల్గొనేలా అవకాశం కల్పించాలి. యోగా ఆసనాలు శరీరానికే కాకుండా మనస్సును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. వారంతట వారు సరైన నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి.
చాలా మంది యోగా పెద్దలకు మాత్రమే, పిల్లలకు సంబంధం లేదని భావిస్తారు. కానీ అది తప్పు. యోగా అనేది పెద్దలకే కాదు చిన్న పిల్లలకు కూడా ఒక అద్భుతమైన అభ్యాసం. ఇది పిల్లల జీవితంలో ఉత్సాహాన్ని సృష్టించడమే కాకుండా, వారిని ఫిట్‌గా, స్మార్ట్‌గా మార్చడంలో సహాయపడుతుంది. మీరు కూడా మీ పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచాలనుకుంటే వారికి కూడా యోగాభ్యాసం ఇప్పించండి.
Yoga Asanas for Kids- పిల్లల కోసం యోగాసనాలు
పిల్లలకు ఉపయోగపడే 3 యోగా ఆసనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ప్రాణాయామం
పిల్లలు సాధన చేయాల్సిన యోగాభ్యాసాలలో ప్రాణాయామం మొదటి వరుసలో ఉంటుంది. ప్రాణాయామం అనేది శ్వాస వ్యాయామం. ప్రాణాయామంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ప్రాణాయామం చేయడం వల్ల పిల్లల్లో శ్వాస ఆరోగ్యంతో పాటు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారిలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
బాలాసనం
బాలసనం పిల్లలు వేయదగిన మరొక సులభమైన యోగా ఆసనం. ఆంగ్లంలో, ఈ ఆసనాన్ని చైల్డ్ పోజ్ అని కూడా అంటారు. ఇది పిల్లల్లో ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. వారు భుజాన బ్యాగ్స్ మోసుకెళ్లినపుడు కలిగే వెన్నునొప్పి, మెడ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మూవ్‌మెంట్, మైండ్‌ఫుల్‌నెస్ అండ్ మెంటల్ హెల్త్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, బాలాసనం అభ్యాసం పిల్లల్లో మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.
తడాసనం
తడసనం అనేది పిల్లల కోసం జాబితాలో చేర్చబడిన మూడవ ముఖ్య యోగా ఆసనం. ఈ ఆసనం వేయడం ద్వారా ఇది క్రమంగా ఎత్తును పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ భంగిమ వెన్నెముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా తడాసనా అభ్యాసం చేయడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది.
పిల్లల్లో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెంపొందించడానికి ధనురాసనం వేయడం కూడా మంచిది.
ఇవేకాకుండా, పిల్లలు ఇంకా అధో ముఖ స్వనాసనం, వృక్షాసనం, సుఖాసనం, సేతుబంధాసనం, భుజంగాసనం, వీరభద్రాసనం, అర్ధసర్వాంగాసనం అలాగే శవాసనం వంటి ఆసనాలు కూడా అభ్యాసం చేస్తే వారికి వివిధ కోణాల్లో మంచి ప్రయోజనాలు కలుగుతాయి.