Backpack Wearing Tips । బ్యాక్‌ప్యాక్ ఒకవైపే వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త మరి!
Tips For Wearing Backpack: బ్యాక్‌ప్యాక్ సరిగ్గా వేసుకోకపోతే అది భుజాల నొప్పి, వెన్ను నొప్పికి కారణం అవుతుంది. మీ శరీర భంగిమలోనూ మార్పు రావచ్చు. ఈ చిట్కాలు పాటించండి.
మనం చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లే దగ్గర్నించీ, మొదటిసారి కాలేజీకి వెళ్లేటపుడు, లేదా మొదటిసారి ఉద్యోగానికి వెళ్లేటపుడైనా పుస్తకాలు, డాక్యుమెంట్లు మోసుకెళ్లడానికి వీపుకి బ్యాగ్ తగిలించుకుని వెళ్లే వాళ్లం. ఇప్పుడు కూడా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వచ్చినా, లేదా ఏదైనా ట్రిప్‌కు వెళ్లాల్సి వచ్చినా సులభంగా బ్యాక్‌ప్యాక్‌లలో అన్ని వస్తువులను ప్యాక్ చేసి వెళ్లిపోతాం. బ్యాక్‌ప్యాక్‌లు మన జీవితంలో ఇప్పుడు ఒక భాగం అయ్యాయి. చేతిలో బరువులు మోసుకెళ్లే అవసరం లేకుండా భుజాలకు బ్యాక్‌ప్యాక్ తగిలించుకొని వెళ్లడం వలన ఏమంత భారంగా అనిపించదు, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కూడా.
అయితే ఈ బ్యాక్‌ప్యాక్‌లతో కలిగే ఒత్తిడి కారణంగా వెన్నునొప్పి, వెన్నెముక సమస్యలకు కూడా దారి తీస్తుందని మీకు తెలుసా? భుజాలు, వెన్నుపై పడే బరువు అలాగే తప్పుడు విధంగా బ్యాగ్ ధరించడం కారణంగా కండరాలు, మెడ, భుజాలు, వెన్నునొప్పులకు కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు. కొంతమంది బ్యాక్‌ప్యాక్‌ను ఒకేవైపుకి తగిలించుకుంటారు, మరికొందరు ఎక్కువ బరువును మోసుకెళ్తారు. ఈ పరిస్థితుల్లో అవి అసౌకర్యంగా అనిపించడంతో పాటు, వివిధ రకాల మస్కులో స్కెలిటల్ నొప్పులకు దారితీస్తుందని డైలీఆబ్జెక్ట్స్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ గార్గ్ HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ క్షీణత క్రమంగా దీర్ఘకాలిక వెన్నునొప్పి, వెన్నెముకలో కంప్రెస్డ్ డిస్క్‌లు (హెర్నియేటెడ్ డిస్క్‌లు), మెడ నొప్పి, మారిన శరీర భంగిమ, నడక, పాదాలలో కూడా నొప్పికి దారితీస్తుందని ఆర్థోపెడిక్ సర్జన్లు అంటున్నారు. భుజాలు, వెన్నుపై భారం పడకుండా బ్యాక్‌ప్యాక్ ధరించేటపుడు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది, అవేంటో ఇక్కడ చూడండి.
Tips For Wearing Backpack- బ్యాక్‌ప్యాక్ ధరించేటపుడు చిట్కాలు
- బ్యాక్‌ప్యాక్ ఎల్లప్పుడూ సరైనది ఎంచుకోవాలి. భుజాలపై భారం లేకుండా రెండు వెడల్పాటి మెత్తని భుజం పట్టీలున్న బ్యాగ్‌లను ఎంచుకోవడం చాలా కీలకం. వీపున తగిలించుకొనేటప్పుడు, బ్యాక్‌ప్యాక్ శరీరానికి దగ్గరగా ఉండేలా పట్టీలను బిగించండి. అలాగే మీ బ్యాక్‌ప్యాక్ కింద బట్ వరకు కుంగిపోకూడదు, బదులుగా వెనుక మధ్యలోకి వచ్చేలా ఉండాలి, ఎక్కువ తక్కువలు లేకుండా సమానంగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
- స్కూలుకు వెళ్లే పిల్లలు తమ శరీర బరువులో 10 నుండి 20 శాతం కంటే ఎక్కువ బరువున్న బ్యాక్‌ప్యాక్‌ని అస్సలు ధరించకూడదు. అదేవిధంగా, యువకులకు బ్యాక్‌ప్యాక్‌లు వారి శరీర బరువులో 13 నుండి 15 శాతానికి మించకూడదు. పెద్దలకైతే వారి శరీర బరువులో 15 నుండి 20 శాతం ఉండకూడదని చెప్పారు. అంటే ఉదహారణకు వారి శరీర బరువు 50 కేజీలు అనుకుంటే బ్యాక్‌ప్యాక్ బరువు 7.5 కిలోల నుంచి 10 కిలోలకు మించకూడదు అంతకు తక్కువే ఉండాలి.
- బరువును సమానంగా పంపిణీ చేయడానికి బ్యాక్‌ప్యాక్ రెండు పట్టీలను ధరించండి, గట్టిగా బిగించండి. అలాగే మీ బ్యాక్‌ప్యాక్‌కు నడుము పట్టీ ఉంటే దానిని కూడా ఉపయోగించండి.
- బరువైన వస్తువులను వెనుక మధ్యలోకి దగ్గరగా ప్యాక్ చేయండి. అవసరమైన వాటిని మాత్రమే ప్యాక్ చేయండి. బ్యాక్‌ప్యాక్ ధరించినపుడు మీ వెనుకభాగం నిటారుగా ఉండేలా చూసుకోండి.
'లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్' అని అంటారు. అంటే బరువు ఎంత తక్కువ ఉంటే, అంత ఎక్కువ సౌకర్యం అన్నమాట.
సంబంధిత కథనం