Garam Masala Benefits : ఇంట్లో గరం మసాలా ఎలా తయారు చేయాలి? దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
06 March 2024, 18:40 IST
- Garam Masala Benefits : గరం మసాలా కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే దీనిని మితంగా తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా ఎన్నో ఉపయోగాలను అందిస్తుంది.
గరం మసాలా ప్రయోజనాలు
భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో గరం మసాలా అగ్రస్థానంలో ఉంది. ఈ గరం మసాలా లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఏలకులు మొదలైన మసాలా దినుసుల పూర్తి మిశ్రమం. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు, మసాలాలు లేని వంటకం అసంపూర్ణంగా ఉంటుంది.
గరం మసాలా మీ ఆహారానికి రుచిని మాత్రమే జోడిస్తుందనుకోవద్దు. గరం మసాలాలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నందున, ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవి ఏంటో చూద్దాం.. గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు, ఇంట్లో గరం మసాలా ఎలా తయారుచేయాలో చూద్దాం..
జీర్ణక్రియకు గరం మసాలా
మీ ఆహారంలో గరం మసాలా జోడించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఎందుకంటే ఈ మసాలా పొట్టలో గ్యాస్ట్రిక్ జ్యూస్ విడుదల చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది పేగుల కదలికను సులభతరం చేస్తుంది. అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది.
బరువు తగ్గేందుకు
గరం మసాలా అనేది అనేక మసాలా దినుసుల కలయిక. ఈ పదార్థాలు కలిసి ఫైటోన్యూట్రియెంట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడతాయి. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది చాలా మంచిది. ఎందుకంటే అధిక జీవక్రియ రేటు అంటే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఒక వ్యక్తి అధిక జీవక్రియ సామర్థ్యం కలిగి ఉంటే అతను ఎక్కువ కేలరీలు వినియోగించినా బరువు పెరగడు.
గుండె ఆరోగ్యానికి మంచిది
మీరు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పదార్థాల కోసం చూస్తున్నట్లయితే గరం మసాలాపై శ్రద్ధ వహించాలి. గరం మసాలాలో మీ గుండెకు మేలు చేసే ఏలకులు ఉంటాయి. ఈ మసాలాను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, తద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
కొన్ని ఆరోగ్య సమస్యలను నివారించడంలో మీ ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దూరం చేయడానికి, గరం మసాలాను మీ ఆహారంలో చేర్చుకోండి. ఈ మసాలాలో పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరంలో కణితి పెరుగుదలను నిరోధిస్తాయి. వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తాయి.
గరం మసాలా మార్కెట్‌లో సులువుగా అందుబాటులో ఉన్నప్పటికీ అందరూ రెడీమేడ్‌ను ఇష్టపడరు. చాలా మంది దీన్ని ఇంట్లోనే సిద్ధం చేసుకుంటారు. మీకు కూడా ఇంట్లోనే గరం మసాలా కావాలంటే ఇలా సులభంగా చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు : ఏలకులు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, దాల్చిన చెక్క ఆకులు
తయారీ విధానం : ఒక పాన్‌లో అన్ని మసాలా దినుసులు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. వాటిని చల్లారనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.
శాఖాహారమైనా లేదా మాంసాహారమైనా గరం మసాలాను ఏదైనా ఆహార తయారీలో ఉపయోగించవచ్చు. ఇది మీ వంటకాలకు చక్కని రుచిని ఇస్తుంది. గరం మసాలా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అధికంగా తింటే ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దానిని మీ ఆహారంలో భాగం చేసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.