Bread Dosa: బ్రెడ్ ముక్కలతో ఇలా క్రిస్పీగా దోశలు వేసేయండి, చాలా రుచిగా ఉంటాయి
Bread Dosa: దోశె పేరు వింటేనే నోరూరి పోతుంది. అందులోనూ అవి క్రిస్పీగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఒకసారి బ్రెడ్ ముక్కలతో క్రిస్పీ దోశలు వేసుకుని చూడండి.
Bread Dosa: బ్రేక్ ఫాస్ట్ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేవి దోశలే. వారంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు దోశలు తినేవారు ఉన్నారు. ఎప్పుడూ ఒకేలాంటి దోశెలను వేసుకుంటే నోటికి కొత్త రుచి ఏముంది? ఒకసారి బ్రెడ్ ముక్కలతో దోశలను ప్రయత్నించండి. ఇవి క్రిస్పీగా కూడా వస్తాయి. పిల్లలకి కచ్చితంగా నచ్చుతాయి. ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు.
బ్రెడ్ దోశలు రెసిపీకి కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు - నాలుగు
ఉప్మా రవ్వ - ఒక కప్పు
బియ్యప్పిండి - ఒక కప్పు
ఉల్లిపాయ తరుగు - అరకప్పు
అల్లం తరుగు - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
నూనె - సరిపడా
జీలకర్ర - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
బ్రెడ్ దోశ రెసిపీ
1. బ్రౌన్ బ్రెడ్‌ను ఈ దోశలకు ఎంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అవి గోధుమలతో తయారవుతాయి.
2. సాధారణ వైట్ బ్రెడ్డు మైదాతో తయారవుతుంది. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
3. కాబట్టి బ్రౌన్ బ్రెడ్ ని తీసుకొని మిక్సీలో వేసి పొడిలా చేసుకోండి.
4. అందులోనే బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, ఉప్పు, జీలకర్ర కూడా వేసి ఒకసారి మెత్తని పొడిలా చేయండి.
5. నీళ్లు వేస్తే అవి మరింత మెత్తగా అవుతుంది పిండి.
6. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అవసరమయ్యేంత మేరకు నీళ్లు కలిపి దోశ పిండిలా చేయండి.
7. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయండి.
8. నూనె వేడెక్కాక ఈ పిండిని దోశలా వేసి పైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగును చల్లుకోండి.
9. బాగా కాలాక తీసి పక్కన పెట్టుకోండి. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది.
ఈ బ్రెడ్ దోశలో మనం ఆరోగ్యానికి మేలు చేసేవే వినియోగించాము. కాబట్టి పిల్లలకి, పెద్దలకు ఎలాంటి హాని ఉండదు. ముఖ్యంగా బ్రౌన్ బ్రెడ్ వాడడం వల్ల వారికి మరిన్ని పోషకాలు అందుతాయి. మైదాతో చేసిన బ్రెడ్‌ను వినియోగించకపోవడం మంచిది. ఇందులో బియ్యం పిండి, ఉప్మా రవ్వ వంటివి మనకు మేలు చేసేవే. ఇక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు ఇవన్నీ కూడా ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. దీన్ని మసాలా దోశగా కూడా మార్చుకోవచ్చు. ఆలూ కర్రీని వండి ఈ దోశ మధ్యలో వేస్తే సరిపోయింది. మసాలా దోశ అయిపోతుంది. ఒక్కసారి వీటిని చేసుకుని చూడండి... మీకు నచ్చడం ఖాయం.
టాపిక్