Gavaskar on Pakistan: మీ సలహాలు మాకు అవసరం లేదు.. పాకిస్థాన్ మాజీలపై గవాస్కర్ గరంగరం-do not need your advice gavaskars strong message to pakistan and australia players cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gavaskar On Pakistan: మీ సలహాలు మాకు అవసరం లేదు.. పాకిస్థాన్ మాజీలపై గవాస్కర్ గరంగరం

Gavaskar on Pakistan: మీ సలహాలు మాకు అవసరం లేదు.. పాకిస్థాన్ మాజీలపై గవాస్కర్ గరంగరం

Hari Prasad S HT Telugu
Sep 08, 2023 09:28 AM IST

Gavaskar on Pakistan: మీ సలహాలు మాకు అవసరం లేదు అంటూ పాకిస్థాన్, ఆస్ట్రేలియా మాజీలపై గవాస్కర్ గరంగరం అయ్యాడు. మా టీమ్ ఎంపిక విషయంలో మీ జోక్యం ఏంటని కాస్త గట్టిగానే ప్రశ్నించాడు.

సునీల్ గవాస్కర్
సునీల్ గవాస్కర్ (Hindustan Times)

Gavaskar on Pakistan: టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పాకిస్థాన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లకు కాస్త గట్టిగానే క్లాస్ పీకాడు. మీ సలహాలు మాకు అవసరం లేదని స్పష్టం చేశాడు. మా టీమ్ ఎంపికలో మీ జోక్యం ఏంటని ప్రశ్నించాడు. వాళ్ల కామెంట్స్ ను అసలు పట్టించుకోవద్దని, పేపర్లలో స్పేస్ ఇవ్వొద్దని ఇండియన్ మీడియాను కూడా కోరాడు.

స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ నజమ్ సేఠీ చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ ఇలా రియాక్టయ్యాడు. పాకిస్థాన్ తో ఆడటానికి ఇండియా భయపడుతుందని గతంలో ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సన్నీ తీవ్రంగా మండిపడ్డాడు.

మన టీమ్ వాళ్లు ఎంపిక చేస్తున్నారు

"వాళ్ల నుంచి ఏ ప్రకటన వచ్చినా దురదృష్టవశాత్తూ మన మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇండియన్ టీమ్ ను పాకిస్థాన్ ప్లేయర్స్, ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఎంపిక చేస్తున్నట్లుగా ఉంది. మన టీమ్ తో వాళ్లకేం సంబంధం? ఎవరైనా ఇండియన్ ప్లేయర్ వెళ్లి పాకిస్థాన్ లేదా ఆస్ట్రేలియా టీమ్ ఎంపిక చేస్తున్నాడా? ఇది వాళ్ల పని కాదు. కానీ మనమే వాళ్లను ఆ పని చేయనిస్తున్నాం" అని గవాస్కర్ సీరియస్ అయ్యాడు.

"విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కంటే బాబర్ గొప్పోడు. షహీన్ అఫ్రిది బెటర్ బౌలర్. సచిన్ టెండూల్కర్ కంటే ఇంజిమాముల్ హక్ మంచి బ్యాటర్. వాళ్లు ఎప్పుడైనా మన కంటే వాళ్లే బెటర్ అనిపిస్తుంది. ఇలాగే వాళ్లు తమ అభిమానులకు దగ్గరవుతారు. మీ పత్రికల్లో వాళ్లకు స్పేస్ ఇవ్వకండి.

మీ టీమ్ లో ఈ ప్లేయర్ ఉండాలని ఓ సౌతాఫ్రికన్ చెబుతాడు. ఓ ఆస్ట్రేలియన్ చెబుతాడు. తరచూ ఇలాగే జరుగుతోంది. ఎవరు మూడు లేదా నాలుగోస్థానంలో బ్యాటింగ్ చేయాలో వాళ్లే చెబుతారు. మీ సలహా మాకు అవసరం లేదు" అని గవాస్కర్ కాస్త గట్టిగానే ఇచ్చుకున్నాడు.

గతంలోనూ సన్నీ ఇలాగే ఇండియన్ టీమ్ ఎంపిక విషయంలో విదేశీ ప్లేయర్స్ చేసే కామెంట్స్ పై మండిపడ్డాడు. ఇండియన్ టీమ్ ఎంపికలో వాళ్ల ప్రమేయం ఏంటని ప్రశ్నించాడు. ఇప్పుడు మరోసారి వరల్డ్ కప్ టీమ్ ఎంపిక కావడంతో దీనిపైనా ఇతర దేశాల మాజీలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. దీంతో గవాస్కర్ మరోసారి ఆ మాజీ క్రికెటర్లను ఏకిపారేశాడు.

Whats_app_banner