Australia World Cup Team: ఆస్ట్రేలియా వరల్డ్ కప్ టీమ్ ఇదే.. ఆ భారత సంతతి ప్లేయర్‌కు దక్కని చోటు
Australia World Cup Team: ఆస్ట్రేలియా వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్ చేశారు. ఈ మధ్యే సౌతాఫ్రికాపై అదిరిపోయే అరంగేట్రం చేసిన భారత సంతతి ప్లేయర్ తన్వీర్ సాంఘాకు మాత్రం చోటు దక్కలేదు.
Australia World Cup Team: వరల్డ్ కప్ 2023 కోసం తమ టీమ్ ను అనౌన్స్ చేసింది ఆస్ట్రేలియా. ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆ టీమ్.. 15 మందితో కూడిన జట్టును బుధవారం (సెప్టెంబర్ 6) ప్రకటించింది. ఇందులో భారత మూలాలు ఉన్న యువ స్పిన్నర్ తన్వీర్ సాంఘాకు చోటు దక్కుతుందని భావించినా.. సెలక్టర్లు మాత్రం అతనికి అవకాశం ఇవ్వలేదు.
తన్వీర్ సాంఘాతోపాటు ఫాస్ట్ బౌలర్ నేథన్ ఎలిస్, ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీలకు చోటు దక్కలేదు. సౌతాఫ్రికా టూర్లో ఈ ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు. తన్వీర్ తాను ఆడిన తొలి టీ20లోనే 4 వికెట్లతో రాణించాడు. దీంతో సౌతాఫ్రికాను టీ20 సిరీస్ లో 3-0తో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. అయితే సీనియర్ స్పిన్నర్లు అయిన ఆడమ్ జంపా, ఆష్టన్ అగార్ లకే వరల్డ్ కప్ జట్టులో ఆస్ట్రేలియా అవకాశం ఇచ్చింది.
గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, లెఫ్టామ్ పేసర్ మిచెల్ స్టార్క్, ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ లకు టీమ్ లో చోటు దక్కింది. ఎప్పటిలాగే ఈ వరల్డ్ కప్ కు కూడా ఆస్ట్రేలియా బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. 1987లో తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన ఆ టీమ్.. తర్వాత 1999, 2003, 2007, 2015లలోనూ ఛాంపియన్ గా నిలిచింది.
ఈసారి వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 8న ఇండియాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు గురువారం (సెప్టెంబర్ 7) నుంచి సౌతాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా తలపడనుంది.
వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆష్టన్ అగార్, అలెక్స్ కేరీ, కేమరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా