Gavaskar on World Cup Team: వరల్డ్ కప్ గెలిచే టీమ్ ఇది..: గవాస్కర్
Gavaskar on World Cup Team: వరల్డ్ కప్ గెలిచే టీమ్ ఇది అని ఇండియన్ టీమ్ పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. మంగళవారం (సెప్టెంబర్ 5) ఎంపిక చేసిన జట్టుపై సన్నీ స్పందించాడు.
Gavaskar on World Cup Team: వరల్డ్ కప్ గెలిచే సత్తా ఇండియన్ టీమ్ కు ఉందని అన్నాడు వరల్డ్ కప్ విన్నింగ్ మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. సెలక్టర్లు మంచి జట్టును ఎంపిక చేశారని స్పష్టం చేశాడు. కేఎల్ రాహుల్ ఎంపికను సమర్థించిన అతడు.. సంజూ శాంసన్, చహల్ లను ఎంపిక చేయకపోవడంపై స్పందిస్తూ వాళ్లు సైలెంట్ గా ఆడుతూ వెళ్లాలని అన్నాడు.
వరల్డ్ కప్ గెలుస్తుందనుకుంటున్నా..
సెలక్టర్లు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని తాను ఆశిస్తున్నట్లు గవాస్కర్ చెప్పాడు. ఇండియా టుడేతో మాట్లాడిన సన్నీ.. ఇది మంచి టీమ్ అని అన్నాడు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ తోపాటు ఆల్ రౌండర్లు కూడా బాగున్నారని, మొదట్లోనే వికెట్లు తీసే బౌలర్లు కూడా ఉన్నట్లు అభిప్రాయపడ్డాడు. నేపాల్ తో మ్యాచ్ లో కొన్ని క్యాచ్ లు డ్రాప్ అయినా కూడా ఈ టీమ్ ఫీల్డింగ్ కూడా బాగుందని అన్నాడు.
రాహుల్‌తో శ్రేయస్‌కు డేంజర్..
ఇక గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని కేఎల్ రాహుల్ ఎంపికను కూడా గవాస్కర్ సమర్థించాడు. తానేంటో రాహుల్ ఇప్పటికే నిరూపించుకున్నాడని సన్నీ అన్నాడు. ప్రస్తుతం టీమ్ లో వికెట్ కీపర్ గా ఉన్న ఇషాన్ కిషన్ నిలకడగా రాణిస్తున్న నేపథ్యంలో రాహుల్ కు తుది జట్టులో చోటు దక్కుతుందా అని ప్రశ్నించగా.. ఇద్దరినీ తుది జట్టులో ఆడించవచ్చని గవాస్కర్ చెప్పాడు.
నాలుగో స్థానంలో వస్తున్న శ్రేయస్ అయ్యర్ కు రాహుల్ తో ముప్పు ఉందని, శ్రేయస్ ను పక్కన పెట్టి రాహుల్ ను ఆడించే అవకాశం కూడా ఉందని తెలిపాడు. తుది జట్టులో రాహుల్, ఇషాన్ ఇద్దరూ ఉండాలని కూడా చెప్పాడు. రాహుల్ గాయం బారిన పడ్డాడు కాబట్టి.. వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇషాన్ తీసుకోవాలని కూడా సూచించాడు.
సంజూ.. తల దించుకొని మరిన్ని రన్స్ చెయ్
ఇక వరల్డ్ కప్ జట్టులో సంజూ శాంసన్, చహల్ లను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనిపైనా గవాస్కర్ స్పందించాడు. తల దించుకొని మరిన్ని రన్స్ చెయ్ అని సంజూకి గవాస్కర్ సూచించడం విశేషం. అటు చహల్ కు కూడా ఇదే సూచన చేశాడు.