Mango Rice Recipe : మ్యాంగో రైస్ తింటే.. ఆహా ఏమి రుచి అనాల్సిందే
17 February 2023, 13:36 IST
- Mango Rice Making : వేసవి వస్తుంది. సమ్మర్ స్పెషల్ గా రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అందులో మ్యాంగో రైస్ ఒకటి. పచ్చి మామిడి కాయల తురుముతో చేసే మ్యాంగో రైస్.. టెస్టీగా ఉంటుంది. తయారు చేసుకునే విధానం కూడా సులభంగానే ఉంటుంది.
మ్యాంగో రైస్
మ్యాంగో రైస్(Mango Rice) గురించి ఎప్పుడైనా విన్నారా.. బయట నుంచి ఇంటికి వచ్చినా.. కర్రీ వండేందుకు టైమ్ పడుతుంది.. అనుకుంటే ఈ మ్యాంగో రైస్ ట్రై చేయండి. జస్ట్ పచ్చి మామిడికాయలు అందుబాటులో ఉండే చాలు. మిగతావన్నీ.. ఇంట్లోనే ఉంటాయి. మ్యాంగో రైస్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. ఇంట్లో పచ్చి మామిడి కాయ అందుబాటులో ఉంటే.. పచ్చడి, మామిడి పప్పుకు బదులుగా మ్యాంగో రైస్ తయారు చేసుకోండి.
కావాల్సినవి..
3 కప్స్ రైస్( అన్నం పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టాలి.) పచ్చిమామిడికాయ తురుము హాఫ్ కప్. వేరుశెనగలు కొన్ని వేగించినవి, జీడిపప్పు(వేగించినవి కొన్ని, ఉప్పు(రుచికి సరిపడా),
పోపు కోసం.. నూనె(తగినంత), ఆవాలు, శెనగపప్పు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, తురిమిన అల్లం, ఇంగువ, పసుపు, కరివేపాకు రెండు రెమ్మలు.(అన్ని తగినంత తీసుకోవాలి.)
తయారీ విధానం
మెుదట మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి.. అందులో నూనె వేయాలి. వేడి అయ్యాక.. అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత శెనగపప్పు వేసి.. వేయించాలి. ఆ తర్వాత వెంటనే.. పచ్చి మిర్చి, ఎండు మిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం, పసుపు, ఇంగువ వేసి కొంతసేపు.. తక్కువ మంట మీద వేగించుకోవాలి.
పోపు వేగిన తర్వాత.. పచ్చి మామిడి తురుము అందులో వేసుకోవాలి. కొన్ని నిమిషాలపాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఫ్రై చేసిన వేరు శెనగలు, జీడిపప్పు వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ముందుగా వండిన అన్నం.. పోపులో వేసి.., ఉప్పు వేయాలి. ఆ తర్వాత మెుత్తం మిశ్రమాన్ని కలపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత.. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. అంతే టెస్టీ.. టెస్టీ.. మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది.