Cheating Spouse । మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారా? తెలుసుకోండిలా!
09 April 2023, 21:09 IST
- Cheating Spouse: ఈరోజుల్లో వైవాహిక బంధాలు ఎక్కువ కాలం నిలవడం లేదు. దీనికి ప్రధాన కారణం వారి మధ్య మూడో వ్యక్తి రావడమేనట. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు ఎలా గుర్తించవచ్చో నిపుణులు తెలిపిన కొన్ని చిట్కాలు ఇక్కడ చూడండి.
Signs Your Spouse Is Cheating
Relationship Advice: గతంలో వివాహం అంటే అది జన్మజన్మల అనుబంధంగా చెప్పేవారు, ఎన్ని జన్మలకైనా తామే భార్యభర్తలుగా కొనసాగాలని భావించేవారు. కానీ, ఈరోజుల్లో పరిస్థితులు అలా లేవు. జన్మజన్మల బంధం కాస్త మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది. భార్యాభర్తల మధ్యన మూడోవ్యక్తి చేరికతో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. అందమైన జంట, అన్యోన్యమైన జంట అని చెప్పుకున్న జంటలు కొన్నిరోజులకే విడిపోతున్నాయి. ఇటీవల కాలంలో భార్యాభర్తలు విడిపోవడానికి వివాహేతర సంబంధాలే కారణం అని గణాంకాలు చెబుతున్నాయి. విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కుతున్న చాలా మంది భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామి తమ కంటే కూడా మరొకరికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారట. జీవిత భాగస్వామి కంటే కూడా మాజీ ప్రియులను, ప్రాణ స్నేహితులకు తమ మానాన్ని, అభిమానాన్ని తాకట్టు పెడుతున్నట్లు అంగీకరిస్తున్నారట. ఈక్రమంలో విడాకులు మంజూరు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు, సులభంగా విడిపోతున్నారు.
పెళ్లి చేసుకున్నప్పుడు, భార్యాభర్తలుగా జీవిస్తున్నప్పుడు విడిపోవడానికి కాకుండా కలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. విపరీత ధోరణులతో పవిత్ర వివాహ బంధాన్ని అపహాస్యం చేయకూడదని, వివాహాలపై సరైన అభిప్రాయం లేనివారు, విడిపోయే ఆలోచనలను కలిగి ఉన్నవారు అసలు వివాహం చేసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
Signs Your Spouse Is Cheating- భాగస్వామి మోసం చేస్తున్నారనడానికి సంకేతాలు
చాలా సందర్భాల్లో మూడో వ్యక్తి ప్రమేయం వల్లనే బంధంలో చీలిక ఏర్పడుతుంది కాబట్టి, ఆ మూడోవ్యక్తి నుండి కాపురాలను కాపాడుకోవాలని, జీవిత భాగస్వామిగా ప్రాధాన్యతనిస్తూ కలిసి జీవించాలని చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వచ్చినపుడు భాగస్వామిలో కలిగే మార్పులు ఎలా ఉంటాయో వివరించారు. అవి ఇక్కడ చూడండి.
మారుతున్న అలవాట్లు
భర్త లేదా భార్యలో వారికి సాధారణంగా ఉన్న అలవాటులో ఆకస్మిక మార్పు వచ్చినప్పుడు, వారి హృదయం మారుతున్నట్లు తన భాగస్వామి అర్థం చేసుకోవాలి. ఆమె లేదా అతడు మరొక వ్యక్తి కోసం తనను తాను మార్చుకోవడం ప్రారంభిస్తారు, అప్పుడు ఆ మూడవ వ్యక్తి మీ సంబంధంలో చీలికను తీసుకురాగలడు. కాబట్టి కలిసి ప్రేమగా మాట్లాడండి, తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి
ఇంటికి దూరం
పని నిమిత్తం ఇంటి నుండి త్వరగా బయలుదేరడం, ఆలస్యంగా ఇంటికి తిరిగి రావడం సర్వసాధారణం, కానీ భాగస్వామి ఇంట్లో ఉండటానికి, మీతో సమయం గడపటానికి ఇష్టపడకపోతే. వారు మీ సాంగత్యాన్ని ఇష్టపడటం లేదని భావించాలి. వారికి మీతో ప్రశాంతత కరువైందా, సుఖసంతోషాలు ఉండటం లేదా తెలుసుకొని అవి అందించడానికి ప్రయత్నించండి. అయితే అనవసరంగా మాత్రం అనుమానించకండి.
తరచుగా పర్యటనలు
మూడవ వ్యక్తి సంబంధంలోకి ప్రవేశించినప్పుడు, భాగస్వాములు పని సాకుతో వ్యాపార తరచుగా పర్యటనలకు వెళ్లడం ప్రారంభించవచ్చు. వరుసగా సెలవులు వచ్చినపుడు ఇంట్లో ఉండకుండా పర్యటనలకు వెళ్లవచ్చు. పండగలు, కుటుంబ కార్యక్రమాలకు కూడా సమయం ఇవ్వలేని వారి విషయంలో ఒక కన్నేసి ఉంచాలి.
రహస్యమైన సోషల్ మీడియా ఖాతాలు
మీ భాగస్వామి మిమ్మల్ని తన సోషల్ మీడియా ఖాతాలో చేర్చుకోకపోతే లేదా వారి ఖాతాను మీ నుండి దాచిపెట్టినట్లయితే, మీ సంబంధంలో మూడవ వ్యక్తి ఉన్నారని లేదా మీ నుంచి ఏదో దాస్తున్నాడని అర్థం కావచ్చు. కొంతమంది తరచుగా రహస్య ఖాతాలను సృష్టిస్తారు, తమ భాగస్వామి వారి ఫోన్ చూడటానికి ఇష్టపడరు.
అబద్దాలు చెప్పుట
భాగస్వామి మీతో తరచుగా అబద్ధాలు చెప్పడం ప్రారంభించినప్పుడు, ఏవైనా విషయాలను దాచడం లేదా మీ ఇద్దరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోకపోవడం వంటివి చేసినపుడు, వారి జీవితంలో మరొకరు ఉన్నారని అర్థం.
చివరగా చెప్పేది ఏమిటంటే, పైన పేర్కొన్నా అంశాలను సున్నితంగా డీల్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమి లేకపోయినా ఇది అనవసరపు అనుమానాలకు కూడా దారితీయవచ్చు, మీ ఇద్దరి మధ్య చీలిక తేవచ్చు. ఈ అంశాలను మీ భాగస్వామి మిమ్మల్ని దూరం పెడుతున్నపుడు, మీతో సరిగ్గా మాట్లాడలేనపుడు, మీతో ఏ విషయాలు పంచుకోనపుడు, మీకు అందుబాటులో లేనపుడు ఇక్కడ పేర్కొన్న కొన్ని ఉదాహరణలను గుర్తుంచుకోండి. ఒకవేళ మీ అనుమానం నిజమే అయితే, వారంటే మీకు ఎంత ఇష్టమో తెలియజేయండి, వారితో ఎప్పటికీ కలిసి ఉండాలనుకున్నట్లు చెప్పండి. మీ వల్ల వారికి ఉన్న సమస్య ఏమిటో తెలుసుకొని సామరస్యంగా పరిష్కరించుకోండి. మూడోవ్యక్తిని తరిమేసి మీ మూడుమూళ్ల బంధాన్ని ముచ్చటగా కొనసాగించండి.