Relationship Advice । ఒట్టేసి చెబుతున్నారా? మీ భాగస్వామితో ఈ ప్రమాణాలు మాత్రం చేయకండి!
Relationship Advice: ప్రమాణాలతో బంధం ఏర్పడుతుంది, కానీ ప్రమాణాలు నిలబెట్టుకున్నప్పుడే ఆ బంధం నిలుస్తుంది. మీ జివిత భాగస్వామితో కొన్ని ప్రమాణాలు, వాగ్ధానాలు చేయకూడదని నిపుణులు అంటున్నారు. అవి ఎలాంటి ప్రమాణాలో తెలుసుకోండి.
Relationship Advice: పెళ్లినాడు పురోహితుడు ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి అని అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేయిస్తాడు. మరి ఇందులో అన్ని ప్రమాణాలు నిలబెట్టుకుంటారా? కనీసం తాము చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోగలమనే నమ్మకాన్ని భార్యాభర్తలు కలిగి ఉంటారా? ఏ ఇద్దరి మధ్యనైనా ఆరోగ్యకరమైన బంధం ఏర్పడాలంటే నమ్మకమే పునాది. ఇద్దరిలో నిజాయితీ, ఒకరంటే ఒకరికి గౌరవం, ప్రేమ ఉన్నప్పుడే ఏ బంధాలైనా నిలబడతాయి. అయితే నమ్మకం అనేది బలవంతంగా కోరుకోవడం వలన రాదు, అది సంపాదించుకోల్సిన ఒక ఆస్తి. ప్రేమయినా అంతే, మీరు భాగస్వామిని ప్రేమించినపుడే వారు మిమ్మల్ని తిరిగి ప్రేమించగలుగుతారు. ఈ నమ్మకం, ప్రేమ రెండూ ఒక్క చోట ఉన్నప్పుడు మాత్రమే బంధం నిలబడుతుంది.
ట్రెండింగ్ వార్తలు
చాలా మంది భాగస్వామి ప్రేమను దక్కించుకోవడం కోసం వాగ్ధానాలు చేస్తుంటారు, తనను నమ్మాల్సిందిగా ప్రమాణాలు చేస్తుంటారు. ప్రేమ ఎక్కువైనపుడు లేదా గొడవలు జరిగినపుడు లేదా మద్యం మత్తులో భారీ శపథాలు చేస్తుంటారు.
అయితే ఈ వాగ్ధానాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిపుణులు అంటున్నారు. థెరపిస్టుల ప్రకారం.. మీ భాగస్వామికి వాగ్ధానాలు చేయండి, కానీ ఉత్సాహంతో, ఉద్వేగంతో కొన్ని భీకర వాగ్ధానాలు చేయకండి. మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి, అది జరగనిపక్షంలో మీపై నమ్మకం కుదరదు. ఇది చివరకు మీ మధ్య విబేధాలకు దారితీస్తుంది.
Never Make, Never Break Promises- భాగస్వామితో ఈ వాగ్ధానాలు చేయకండి
మీ జీవిత భాగస్వామితో కొన్ని వాగ్ధానాలు చేయకపోవడమే మేలు అని వారు చెబుతున్నారు. ఎలాంటి వాగ్ధానాలు చేయకూడదు, ఎలాంటి హామీలు ఇవ్వకూడదో ఇక్కడ తెలుసుకోండి.
నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను
ఇదీ ప్రతీ జంట చేసే అత్యంత సాధారణ వాగ్దానాలలో ఒకటి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాంటపుడు ఇలాంటి వాగ్ధానాలు చేయడంలో ఉపయోగం లేదు.
నీకోసం నేనున్నాను
ఈ రకమైన వాగ్ధానం మీ భాగస్వామికి భరోసానిస్తుంది, మీపై అంచనాలను పెంచుతుంది, కానీ అవసరం అయినపుడు మీరు వారి పక్కన లేనపుడు, మీ సహాయం దక్కనపుడు మీపై నమ్మకం పోతుంది.
నేను నిన్ను బాధపెట్టను
బాధపెట్టను అని మీరు అనుకుంటారు, కానీ మీకే తెలియకుండా బాధపెడతారు. మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తే, బాధలు అనేవి కచ్చితంగా ఉంటాయి. బాధ పెట్టినా మళ్లీ వారిని చేరదీసే గుణం మీలో ఉండాలి, అది వారికి కనిపించాలి.
నేను ఇకపై మద్యం తాగను
నేను ఇకపై మద్యం సేవించను, సిగరెట్ తాగను అని వాగ్ధానం చేసే భర్తలు నూటికి తొంభైతొమ్మిది శాతం ఆ మాటపై నిలబడరు. ఒకరి అలవాట్లు మార్చుకోవడం కష్టమైనపని, అది మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాలి. అందుకు వారి సహాయం కోరాలి. మద్యం, సిగరెట్లు మానేస్తాను అని వాగ్ధానం చేయడం కంటే ఆచరించి చూపటం మేలంటున్నారు.
నీతో అబద్ధం చెప్పను
నేను నీతో ఇకపై అబద్ధం చెప్పను అని వాగ్ధానం చేయడమే ఒక పెద్ద అబద్ధం. ఎంత జీవిత భాగస్వామి అయినా వారితో కొన్ని పంచుకోలేని విషయాలు ఉంటాయి. వారి మనసును కష్టపెట్టే నిజం కంటే అబద్ధం చెప్పడమే మేలు. అబద్ధం చెప్పను అని అబద్ధాలు ఆడుతూ పోతే ఏదో ఒక రోజు మీ బంధమే అబద్ధం అయిపోవచ్చు.
సంబంధంలో నమ్మకాన్ని పెంచుకోవడం రాత్రికి రాత్రే జరిగే విషయం కాదు. అందుకు సమయం, ఓర్పు, సహనం, కృషి అవసరం.
సంబంధిత కథనం