తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Protein Deficiency Symptoms : మీలో ఈ లక్షణాలు ఉంటే ప్రోటీన్ లోపం అని అర్థం

Protein Deficiency Symptoms : మీలో ఈ లక్షణాలు ఉంటే ప్రోటీన్ లోపం అని అర్థం

Anand Sai HT Telugu

30 January 2024, 12:30 IST

    • Protein Deficiency Signs : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రోటీన్ సరైన మెుత్తంలో ఉండాలి. ప్రోటీన్ లోపం ఉంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. అవేంటో చూడండి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యంగా ఉండేందుకు మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరం. ఇవి సరిగా లేకుంటే అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సాధారణ పోషకాలు కచ్చితంగా కావాలి. విటమిన్లు, మినరల్స్ తదితరాలు లేకపోవడం వల్ల శరీరం వ్యాధులకు గురవుతుంది. పోషకాహార లోపం ప్రమాదం ఉంటుంది. అవన్నీ అవసరమైన పరిమాణంలో ఉండాలని గుర్తుంచుకోండి.

చాలామంది ప్రొటీన్ లోపంతో బాధపడుతున్నారు. కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల ప్రొటీన్ లోపం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తరచుగా ఇన్ఫెక్షన్, అనేక వ్యాధులకు దారితీస్తుంది. కొంతమందికి చర్మ సమస్యలతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. కొన్నిసార్లు, శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నప్పటికీ, లక్షణాలు కనిపించవు. ప్రొటీన్లు తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం..

శరీరంలో ప్రొటీన్ లోపిస్తే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఇది వ్యాధులతో పోరాడే శక్తిని తగ్గించేలా చేస్తుంది. అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీరసం, ఏదైనా పని చేసిన వెంటనే అలసిపోవడం, కడుపు ఉబ్బరం, శరీర శక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా ప్రోటీన్ తక్కువైతే కనిపిస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గితే మీకు వ్యాధులు త్వరగా నయం కావు.

ప్రోటీన్ లోపం వలన చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో కండరాల బలహీనత ఒకటి. కండరాలు బలహీనమైతే ఏ పనీ చేయలేరు. ప్రోటీన్ లేకపోవడం వల్ల కండరాల బలం తగ్గుతుంది. దీని వల్ల శరీర ఆకృతిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మీకు కండరాల సమస్యలు, నొప్పులు ఉన్నట్లయితే ఎప్పుడో ఒకసారి ప్రొటీన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. అప్పుడే అసలు విషయం ఏంటని తెలుస్తుంది.

శరీరంలో ప్రొటీన్లు లోపిస్తే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కొందరికి తెల్ల జుట్టు వస్తుంది. జుట్టు నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. జుట్టు రాలడం సమస్యలు వస్తే మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ప్రోటీన్ లోపం ఉంటే.. కొందరిలో బరువు తగ్గడానికి కూడా కారణం అవుతుంది. బరువు తగ్గుతున్నప్పుడు ప్రొటీన్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. కొందరికి శరీరంపై వాపులు కూడా వస్తాయి. గోర్లు త్వరగా విరిగి చెడుగా కనిపిస్తాయి. అలాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రోటీన్ లోపం లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆహారం తీసుకోవాలి.

తదుపరి వ్యాసం