తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బోనం అంటే అర్థం అదే! బోనాల పండగ ప్రధాన ఉద్దేశాన్ని చెప్పే ప్రత్యేక కథనం మీకోసం

బోనం అంటే అర్థం అదే! బోనాల పండగ ప్రధాన ఉద్దేశాన్ని చెప్పే ప్రత్యేక కథనం మీకోసం

Manda Vikas HT Telugu

28 December 2021, 8:56 IST

    • బోనం అంటే భోజనం అని అర్థం. తెలుగులో ప్రకృతి, వికృతి పదాల గురించి మనం వినే ఉంటాం. ప్రకృతిలో చెప్పే భోజనంను వికృతి అంటే వాడుక భాషలో బోనం అంటారు. అమ్మ వారికి ఇష్టంగా భోజనం లేదా నైవేద్యం సమర్పించడం బోనాల పండగలో ఆనవాయితీ. అన్నం- బెల్లంతో చేసిన పాయసం లేదా పెరుగు, ఆకుకూర అన్నం కలిపి బోనంగా తయారు చేస్తారు.
Hyderabad's Bonalu Festival
Hyderabad's Bonalu Festival (HT Photo)

Hyderabad's Bonalu Festival

ఆశాఢమాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల సందడి (Bonalu Festival) ప్రారంభమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొట్టమొదట గోల్కోండ నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు వయా జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి (లష్కర్) వద్దకు చేరుకొని లాల్ దర్వాజ వద్ద ముగుస్తాయి. సంస్కృతి, సాంప్రదాయాలు చాటేలా తెలంగాణ ఆడపడుచులు పట్టుచీరలను ధరించి పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలంకరించిన కొత్త కుండను తలపై మోస్తూ, డప్పు చప్పుళ్లతో, పోతరాజుల నృత్యాల నడుమ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

బోనం అంటే భోజనం అని అర్థం. తెలుగులో ప్రకృతి, వికృతి పదాల గురించి మనం వినే ఉంటాం. ప్రకృతిలో చెప్పే భోజనంను వికృతి అంటే వాడుక భాషలో బోనం అంటారు. అమ్మ వారికి ఇష్టంగా భోజనం లేదా నైవేద్యం సమర్పించడం బోనాల పండగలో అనవాయితీ.

భక్తి శ్రద్ధలతో బోనం సమర్పణ.. 

సాధారణంగా ఒంటికి చలువ చేసే పదార్థాలతో ఈ బోనాన్ని తయారు చేస్తారు. ఒక కొత్త కుండ లేదా రాగి బిందెను శుభ్రంగా కడిగి దానికి పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలకంరించి అందులో అన్నం- బెల్లంతో చేసిన పాయసం లేదా పెరుగు, ఆకుకూర అన్నం కలిపి బోనంగా తయారు చేస్తారు. ఈ బోనం వేకువ ఝామునే వండి సిద్ధంగా ఉంచుతారు.  ఆ ప్రాంతంలో అందుబాటులో ఉంటే చెట్టు నుంచి తీసిన స్వచ్ఛమైన కల్లును కూడా బోనంతో పాటుగా మరో పాత్రలో తీసుకెళ్లి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ బోనాన్ని ప్రసాదంగా ఇవ్వడం, పంటపొలాల్లో చల్లడం చేస్తారు.

బోనాల పండగ నిర్వహించటం వెనక ముఖ్య ఉద్దేశ్యం:

గ్రామ దేవతలను కొలిచే పండుగ ఇది. ఆశాఢ మాసంలో ప్రకృతిసిద్ధంగా వచ్చే వరదలు, అంటువ్యాధుల నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అంటూ మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ పేరేదైనా సరే శక్తి స్వరూపమైన ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను కలిగించమని మొక్కుకోవడమే ఈ బోనాల పండుగ ప్రధాన ఉద్దేశం.

సాధారణంగా ఆషాఢ మాసం జూలై- ఆగష్టు మధ్య ప్రారంభమవుతుంది. ఈ కాలంలో వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతుంటాయి. జలాశయాల్లో కొత్త నీరు వస్తుంది. హిందువులు నీటిని పవిత్రంగా కొలుస్తారు కాబట్టి కొత్తగా వచ్చే నీటికి హారతి ఇస్తూ ఆహ్వానం పలుకుతారు. 

పంటలు సమృద్ధిగా పండాలి, ప్రజలంతా ఎలాంటి రోగాల బారిన పడకుండా క్షేమంగా ఉండాలని స్థానికంగా కొలువై ఉండే గ్రామదేవతలను కొలుస్తూ బోనం సమర్పిస్తారు. ఆ రకంగా శక్తి స్వరూపం అయిన అమ్మవారిని ప్రసన్నం చేసేందుకు ఏడాదికోసారి ఘనంగా జాతర చేస్తారు. ఆ ఏడాదికి తాము అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ‘యాట’ కోసి, జాతర మరింత ఘనంగా నిర్వహిస్తాం అని మొక్కులు చెల్లించుకుంటారు.

హైదరాబాద్ బోనాల పండుగలో కీలక ఘట్టాలు:

నగరంలో బోనాల మొదటి రోజు, చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిరూపంగా తలిచే ఒక రాగి చెంబును, దీనిని 'ఘటం' అని పిలుస్తారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తి సాంప్రదాయ దుస్తుల్లో, ముఖం నిండా పసుపు పూసుకొని తొలిరోజు నుంచి చివరిరోజు వరకు ఆ ఘటాన్ని మోస్తాడు. చివరి అంకానికి చేరేవరకు డప్పు దరువులతో, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, పూనకాలు,నడుమ ఊరేగిస్తారు.

బోనాలలో భాగంగా నిర్వహించే 'రంగం' కార్యక్రమం ప్రత్యేక స్థానం కలిగిఉంది. ఈ రంగం రోజున అమ్మవారు తనకు అత్యంత ఇష్టమైన భక్తురాలిలో ప్రవేశించి (పూనకం) ఆమె ద్వారా భవిష్యవాణిని వినిపిస్తూ, భక్తులకు ఆశీర్వచనాలు అందజేస్తుంది. బోనాల చివరి రోజున దానిని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఘటాన్ని నీటిలో నిమజ్జనం చేయడంతో ఆ ఏడాదికి బోనాలు తంతు సంపూర్ణంగా ముగుస్తుంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి, ప్రతి ఏటా ఈ పండగ నిర్వహణ కోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తుంది.

టాపిక్