Summer Cool Tea । వేసవిలో ఈ టీ తాగితే డీహైడ్రేషన్ కాదు, శరీరం వేడెక్కదు!
26 May 2023, 17:02 IST
- Summer Cool Tea Recipe: మీ శరీరానికి తగినంత హైడ్రేషన్ అందించడానికి కేవలం నీరే తాగాల్సిన అవసరం లేదు, ఒంటికి చలువ చేసే సమ్మర్ కూల్ టీ రెసిపీని చదవండి.
Summer Cool Tea
Healthy Summer Drinks: వేసవికాలంలో ఉండే తీవ్రమైన ఎండ, ఉక్కపోత కారణంగా శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ఇది డీహైడ్రేషన్ కు దారితీయవచ్చు. కాబట్టి ఈ సీజన్ లో సమృద్ధిగా నీరు త్రాగాలి, నీటితో పాటు ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. ఈ వేడికాలంలో తరచుగా కూల్ డ్రింక్స్ లాంటివి తాగాలనే కోరిక కలుగుతుంది. కానీ, ఇవి దాహాన్ని తీర్చకపోగా ఎలాంటి ఆరోగ్యాన్ని అందించవు. బదులుగా ఆరోగ్యకరమైన, ఒంటికి చలువ చేసే ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి.
మీ శరీరానికి తగినంత హైడ్రేషన్ అందించడానికి కేవలం నీరే తాగాల్సిన అవసరం లేదు ఎలక్ట్రోలైట్ ఇన్ఫ్యూజ్డ్ డ్రింక్స్ ట్రై చేయవచ్చు లేదా సమ్మర్ టీని కూడా తాగవచ్చు, ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది, వేడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
నటి తాప్సీ పన్నుకు పోషకాహార నిపుణురాలైన మున్మున్ గనేరివాల్ ఒక అద్భుతమైన 'సమ్మర్ కూల్ టీ' రెసిపీని పంచుకున్నారు. ఈ టీ డీహైడ్రేషన్ ను నివారించడమే కాకుండా వేసవిలో సాధారణ సమస్యలైన ఎసిడిటీ, వికారం, ఉబ్బరం, ఆకలిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మున్మున్ ప్రకారం ఏలకులు, జీలకర్ర, ధనియాలు ఒంటికి చల్లదనాన్నిచ్చే సుగంధ ద్రవ్యాలు. వీటిని ఉపయోగించి సమ్మర్ కూల్ టీ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Summer Cool Tea Recipe కోసం కావలసినవి
- 1.5 కప్పులు - నీరు
- 2 – లవంగాలు
- 1-2 – ఏలకులు
- 1/4 టీస్పూన్ ధనియాలు
- 1/4 టీస్పూన్ జీలకర్ర
సమ్మర్ కూల్ టీ ఎలా తయారు చేయాలి?
- ముందుగా నీటిని మరిగించండి, ఆ నీటిలో లవంగాలను చూర్ణం చేసి వేయండి.
- ఆపైన ఏలకులు, ధనియాలు, జీలకర్ర వేసి మరిగించండి
- 5- 10 నిమిషాలు ఉడికించిన తర్వాత కప్పులో వడకట్టండి.
- సమ్మర్ కూల్ టీ రెడీ. రుచికోసం ఇందులొ రాక్ షుగర్ కలుపుకోవచ్చు, లేదా నేరుగా తాగవచ్చు.
ఈ సమ్మర్ కూల్ టీని మీరు ఈ వేసవి కాలంలో ప్రతిరోజూ నిద్రలేచిన తర్వాత ఒకసారి, సాయంత్రం ఒకసారి రెండు పూటలా తాగాలి.