Cabbage Dal Recipe | న్యూట్రిషనిస్టుల ఛాయిస్ క్యాబేజీ పప్పు.. ఇలా వండితే ఆరోగ్యమే!
23 February 2023, 14:05 IST
- Cabbage Dal Recipe: క్యాబేజీలో పుష్కలమైన పోషకాలు ఉన్నాయి, క్యాబేజీని పప్పుతో ఉడికించుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. క్యాబేజీ దాల్ రెసిపీ కోసం ఇక్కడ చూడండి.
Cabbage Dal Recipe
మీ రోజువారీ ఆహారంలో ఆకు కూరలను చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఆకుకూరల్లో కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇవి అసమయ ఆకలి బాధలను దూరం చేస్తాయి. అటువంటి ఆరోగ్యకరమైన ఆకుకూరల్లో క్యాబేజీ ఒకటి, దీనిని ఆకు గోబి అని కూడా పిలుస్తాం. క్యాబేజీ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలకు స్టోర్‌హౌస్. ఇంకా విటమిన్ సి, థయామిన్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. ఇది పిత్త ఆమ్లాలను బంధించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
క్యాబేజీని పచ్చిగా తినవచ్చు, ఆవిరిలో ఉడికించి, కూరగా వండుకొని తినవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, ఊరగాయ పెట్టుకోవచ్చు, పులియబెట్టవచ్చు, సలాడ్‌లు, గ్రేవీలలో కూడా చేర్చవచ్చు. ఇలా అనేక విధాలుగా క్యాబేజీని తినవచ్చు. క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ న్యూట్రిషనిస్ట్ సుకన్య పూజారి క్యాబేజీ పప్పు రెసిపీని సూచించారు. క్యాబేజీ దాల్ రెసిపీ ఈ కీంద ఇచ్చాం చూడండి.
Cabbage Dal Recipe కోసం కావలసినవి
- 1/2 కప్పు ఏవైనా కాయధాన్యాలు/పప్పులు
- 2 కప్పులు తరిగిన క్యాబేజీ
- 1/4 టీస్పూన్ పసుపు పొడి
- 1/4 కప్పు తురిమిన కొబ్బరి
- 3-4 పచ్చి మిరపకాయలు
- 1 టీస్పూన్ జీలకర్ర
- రుచికి తగినంత ఉప్పు
క్యాబేజీ పప్పు తయారీ విధానం
- ముందుగా కడిగిన అరకప్పు పప్పు, తరిగిన క్యాబేజీని ఒక మందపాటి అడుగున ఉన్న పాన్‌లో తీసుకోండి. ఇందులో పసుపు వేసి 2 కప్పుల నీరు పోసి పప్పు, క్యాబేజీ రెండింటినీ కలిపి తక్కువ మంటలో ఉడికించాలి
- ఈలోపు కొబ్బరి ముద్దను సిద్ధం చేయండి. తురిమిన కొబ్బరి, 3-4 పచ్చిమిర్చి ముక్కలు, 1 టీస్పూన్ జీలకర్ర, కొద్దిగ్గా ఉప్పును చట్నీ గ్రైండర్ జార్‌లో తీసుకోండి, ఆపై కొన్ని నీళ్లుపోసి మెత్తని పేస్టులాగా గ్రైండ్ చేసుకోండి.
- పప్పు మెత్తగా మారేలా ఒక అరగంట పాటు ఉడికించుకోండి. చెంచాతో పప్పును మెత్తగా రుబ్బండి.
- పప్పు ఉడికిన తర్వాత అందులో కొబ్బరి పేస్ట్ వేయాలి, ఆపై రుచికి తగినట్లుగా ఉప్పు, మరికొన్ని నీళ్లు పోసి బాగా కలపండి.
- ఇలా మరో 5 నుండి 6 నిమిషాలు ఉడికించాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు కదిలిస్తూ ఉండాలి.
అంతే, స్టవ్ ఆఫ్ చేయండి. పోషకాహార నిపుణులు సిఫారసు చేసిన క్యాబేజీ దాల్ రెడీ. దీనిని అన్నంలో కలుపుకొని వేడివేడిగా తినండి. ఇలా తింటే ఎంతో ఆరోగ్యం, శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. మీరు కావాలనుకుంటే రుచికోసం ఇంట్లో చేసిన చిప్స్, చట్నీ కలుపుకొని ఆస్వాదించవచ్చు.