తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anger Management: ఇంట్లో మీ పిల్లల కోపాన్ని ఈ టిప్స్‌తో సింపుల్‌గా కంట్రోల్ చేయండిలా!

Anger management: ఇంట్లో మీ పిల్లల కోపాన్ని ఈ టిప్స్‌తో సింపుల్‌గా కంట్రోల్ చేయండిలా!

Galeti Rajendra HT Telugu

15 October 2024, 9:30 IST

google News
  • కొంత మంది చిన్న పిల్లలకి కోపం వస్తే చేతిలో ఏ వస్తువు ఉంటే దాన్ని విసిరేస్తుంటారు. మరికొందరు కొట్టడం, కొరకడం లాంటివి చేస్తుంటారు. ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం ఎలా అనేది నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. 

పిల్లల కోపం
పిల్లల కోపం

పిల్లల కోపం

సాధారణంగా చాలా మంది పిల్లలు ఇంట్లో వాళ్లపై కోప్పడిపోతుంటారు. వాళ్లు మొబైల్ చూస్తున్నప్పుడు మనం అడిగినా లేదా ఆటలు చాలు ఇక బుక్ తీసి చదువు అని మనం చెప్పినా వాళ్లు కోపం ప్రదర్శిస్తుంటారు. ఇక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే చెప్పాల్సిన పనిలేదు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు, గొడవలు.. తల్లిదండ్రులకి తలకి మించిన భారంగా అనిపిస్తుంటుంది. అందుకే పిల్లలకు కోపాన్ని కంట్రోల్ చేయడం మనం నేర్పించగలిగితే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. చిన్న వయసులోనే కోపాన్ని కంట్రోల్ చేయడం వాళ్లకి అలవాటు చేయాలి.

పేరెంట్స్ అలవాటు మారాలి

పెద్దవారు తాము కోపాన్ని ఎలా నియంత్రించుకుంటారో పిల్లలు ఇంట్లో గమనిస్తారు. మీరు కోపం వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా, హుందాగా వ్యవహరిస్తే పిల్లలు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతారు. పిల్లలు కోప్పడిన సమయంలో.. ఆ కోపానికి కారణమేంటి? అని వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలానే సమస్యకి పరిష్కార మార్గాన్ని కూడా వారికి మనం సూచించాలి.

కోపం వచ్చినప్పుడు వెంటనే పెద్దగా శ్వాస తీసుకుని వదలడం లేదా ఒకటి నుంచి పది వరకు నెంబర్లు లెక్కించడం లాంటివి పిల్లలకి అలవాటు చేయాలి. ఇది ఒక అలవాటుగా వాళ్లు చేసుకోగలిగితే అతిగా ఆవేశ పడే అలవాటుని తగ్గించుకుంటారు.

కోపం ప్రదర్శించడంలో ఒక్కోరిది ఒక్కో శైలి

కోపాన్ని చూపించడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి ఉంటుంది. కొందరు పిల్లలు అందరి నుంచి దూరంగా వెళ్లి ముభావంగా కూర్చొంటారు. మరికొందరు చేతిలోని వస్తువుని విసిరేస్తుంటారు. మరికొందరు మీదపడి కొట్టేయడం లేదా కొరకడం లాంటివి చేస్తుంటారు. అలా కాకుండా కోపం వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటో పేపర్‌పై రాయమని చెప్పడం మంచి అలవాటు. ఆ తర్వాత ఆ ఫీలింగ్స్ గురించి పిల్లలతో కూర్చుని చర్చించి.. వాటి వల్ల జరిగే అనర్థాలను అర్థమయ్యేలా చెప్పాలి.

కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం కాకుండా కొన్ని క్షణాలు ఆగేలా పిల్లలకి నేర్పించాలి. అలా నేర్పించడం ద్వారా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు వారిలో పెరుగుతుంది. పిల్లల కోపాన్ని సృజనాత్మక, ఆరోగ్యకరమైన గేమ్స్, ఆట వైపు మళ్లించేలా ప్రోత్సహించాలి. ఆ పట్టుదల, కసి గేమ్స్ గెలిచి చూపించేలా వారిని ప్రోత్సహించాలి.

పిల్లల కోపానికి బోలెడు కారణాలు

పిల్లల కోపానికి ఎప్పుడూ ఒకే కారణం ఉండదు. ఆకలితో ఉంటే ఒకలా, నిద్రలేమితో మరోలా, ఒత్తిడిలో ఉంటే అతిగా కోపం రావడం సహజం. తల్లిదండ్రులుగా మనం ఆ సందర్భాలను గుర్తించి పరిష్కరించాలి. ఒకవేళ పిల్లలు కోపంతో తప్పు చేసినా వారిని వెంటనే కొట్టడం లేదా తిట్టడం లాంటివి చేయకుండా వారు చేసిన తప్పుల్ని వివరిస్తూనే, వారి వల్ల బాధపడ్డ వారికి క్షమాపణలు చెప్పించడం, మరోసారి ఇలా జరగదని భరోసా ఇప్పించడం లాంటివి చేయండి.

ఆగ్రహించకుండా.. అర్థం చేసుకోండి

పిల్లల్లో కోపం చాలా సున్నితమైన భావం. ఆ భావాన్ని తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకోకుండా వారిపై కోప్పడితే.. మనం ఎప్పటికీ వారికి నేర్పలేం. కాబట్టి.. మొదట తల్లిదండ్రులు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఆ తర్వాత పిల్లలకి నేర్పాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులనే ఫాలో అవుతుంటారు.

తదుపరి వ్యాసం