చిన్నవయసులోనే ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో డబ్బే అన్నింటికి ముఖ్యం. డబ్బు విలువ తెలిస్తే ఎక్కుడైనా ఎలాగైనా బతికేయోచ్చు. భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, డబ్బును తెలివిగా ఖర్చు చేయడానికి సహాయపడుతుంది. కొన్ని విషయాలను తల్లిదండ్రులు తెలుసుకోవాలి.. పిల్లలకు నేర్పించాలి.
పిల్లలకు వారి కోరికలు, వారి అవసరాలు మధ్య వ్యత్యాసాన్ని వివరించాలి. డబ్బు ఖర్చు విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి వారికి ఇది సహాయపడుతుంది.
ఆహారం, దుస్తులు వంటి అవసరాలను కొనుగోలు చేయడానికి, బొమ్మలు వంటి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బు ఉపయోగించే విధానాన్ని వివరించాలి. అదేవిధంగా డబ్బు అనేది తేలికగా వచ్చేది కాదని, కష్టపడి పనిచేయాలని పిల్లలకు చిన్నతనంలోనే నేర్పించాలి.
పిల్లలు పొదుపు ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా చేయాలి. భవిష్యత్తులో వారు కోరుకునే వస్తువుల కోసం డబ్బును దాచుకునే విధానాన్ని అలవాటు చేయాలి. ఇది వారికి సహనాన్ని నేర్పుతుంది. వారి లక్ష్యాల కోసం కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది.
మీరు మీ పిల్లలకు డబ్బును పొదుపు, ఖర్చు వంటి కేటగిరీలను విభజించి చెప్పాలి. ఇంటి బడ్జెట్ గురించి వివరించాలి. పాకెట్ మనీ కొద్దిగా ఇచ్చి.. దానిని ఎలా ఖర్చు చేయాలో చెప్పాలి.
ఖర్చు పెట్టే ముందు ఆలోచించేలా పిల్లలకు మార్గనిర్దేశం చేయాలి. ఏదైనా కొనే ముందు ఇది నిజంగా అవసరమా? కొన్ని రోజుల తర్వాత కూడా ఇది అవసరమా? వంటి ప్రశ్నలు వేసుకోవడం వారికి నేర్పించండి. ఇది వారికి ఖర్చు అలవాట్ల గురించి తెలుసుకునేందుకు సాయపడుతుంది. అనవసరమైన ఖర్చును నివారించడానికి సహాయపడుతుంది.
పిల్లలకు తమ డబ్బును అవసరంలో ఉన్నవారితో పంచుకోవాలని బోధించడం వారిలో ప్రేమ, సానుభూతిని నేర్పిస్తుంది. ఒకరు తమ సొంత కోరికలు, ఇతరుల అవసరాలను నెరవేర్చడానికి డబ్బును ఉపయోగించవచ్చని సహాయపడుతుంది
ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు మడతపెట్టడం వంటి వయస్సుకు తగిన పనులను పిల్లలకు నేర్పించాలి. దీని ద్వారా వారి స్వంత డబ్బు సంపాదించేలా ప్రోత్సహించండి. కష్టపడి పనిచేయడం వల్ల ఫలితం ఉంటుందని తెలుసుకోవడం వల్ల పిల్లలు డబ్బుకు విలువనిచ్చి తెలివైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
పిల్లలకు చిన్నవయసులోనే పెట్టుబడి గురించి తప్పకుండా చెప్పాలి. చిన్న పెట్టుబడులు భవిష్యత్తులో పెద్ద పొదుపునకు దారితీస్తాయని వారికి ప్రతీ విషయం చెప్పాలి.