Bread Recipes for Breakfast । బ్రెడ్‌తో బ్రేక్‌ఫాస్ట్.. ఇలా చేసేయండి ఫటాఫట్!
10 June 2023, 6:30 IST
- Bread Recipes for Breakfast: చాలా మంది బ్రెడ్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసి తమ రోజును ప్రారంభిస్తారు, అందుకే మీకోసం ఇక్కడ బ్రెడ్‌తో చేయగల అద్భుతమైన రెసిపీలు అందిస్తున్నాం.
Bread Recipes for Breakfast
Bread Recipes for Breakfast: మనం ఇంట్లో అల్పాహారం సిద్దం చేయాల్సి వస్తున్నాప్పుడు ఈరోజు ఏం తయారు చేయాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒకరోజు ఉప్మా, మరో రోజు ఇడ్లీ, ఇంకో రోజు దోశ అంటూ ప్రతిరోజూ ఏదో ఒకటి సిద్ధం చేసి ఆరోజుకు అలా కానిచ్చేస్తాం. అయితే కొన్నిసార్లు ఏం చేయాలన్నా తోచదు, కావల్సిన పదార్థాలు అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా సమయం ఎక్కువ తీసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సులభంగా ఏదైనా చేయాల్సి వస్తే బ్రెడ్‌తో అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ సిద్దం చేసుకోవచ్చు.
మనలో చాలా మంది తరచుగా బ్రెడ్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసి తమ రోజును ప్రారంభిస్తారు, అందుకే మీకోసం ఇక్కడ బ్రెడ్‌తో చేయగల అద్భుతమైన రెసిపీలు అందిస్తున్నాం. బిజీగా ఉన్న రోజుల్లో మీకు ఈ రెసిపీలు చాలా బాగా ఉపయోగపడతాయి.
Bread Omelette Recipe- బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ
కావలసిన పదార్థాలు:
- 2 హోల్ వీట్ బ్రౌన్ బ్రెడ్
- 2 గుడ్లు
- 2 స్పూన్ నూనె
- 1-2 పచ్చిమిర్చి
- 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు
- 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్, సన్నగా తరిగినవి
- ఉప్పు - రుచికి తగినంత
- మిరియాలు - రుచికి తగినట్లుగా
తయారీ విధానం:
- ఒక గిన్నెలో గుడ్డును నురుగు వచ్చేవరకు బాగా గిలకొట్టండి. ఇందులో తరిగిన పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలపండి.
- ఒక పాన్‌లో నూనె వేసి గుడ్డు మిశ్రమాన్ని పాన్‌పై వేసి, విస్తరించండి. మీడియం మంట మీద 2 నిమిషాలు వేడిచేయండి. అంచులు బ్రౌన్ అవ్వడం ప్రారంభించిన తర్వాత ఆమ్లెట్‌ను తిప్పండి.
- టోస్ట్ చేయడానికి అదే పాన్‌పై బ్రెడ్ ముక్కలను ఉంచండి. అనంతరం ఒక బ్రెడ్ ను ఆమ్లెట్ వేసి చతురస్రాకారంలో మడవండి.
- మరొక బ్రెడ్ స్లైస్‌ను పైన ఉంచి, ఆపై దానిని తిప్పండి. బ్రెడ్ బాగా టోస్ట్ అయిన వేడి నుంచి తీసేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి.
- బ్రెడ్ ఆమ్లెట్ ను సగానికి ముక్కలు చేసి, వేడివేడిగా సర్వ్ చేయండి.
Bread Upma Recipe- బ్రెడ్ ఉప్మా రెసిపీ
కావలసిన పదార్థాలు:
- 4 బ్రెడ్
- 1 ఉల్లిపాయ
- 1/4 కప్పు క్యారెట్
- 1/4 కప్పు బీన్స్
- 1/4 కప్పు పచ్చి బఠానీలు
- 9-10 వేరుశనగలు
- 1/4 టీస్పూన్ పసుపు పొడి
- 1 కరివేపాకు రెమ్మ
- 2 టేబుల్ స్పూన్ నూనె
- 1 పచ్చిమిర్చి
- 1 నిమ్మకాయ
- ఉప్పు రుచికి తగినంత
తయారీ విధానం:
- బాణలిలో నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- అనంతరం క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసి కలపండి. 2-3 నిమిషాల పాటు వీటిని ఉడికించండి.
- ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వేరుశనగ, పచ్చి బఠానీలు వేసి వేయించండి.
- ఇప్పుడు బ్రెడ్ ముక్కలను చిన్నగా సుంచి వేయండి, బ్రెడ్ ముక్కలు కొద్దిగా క్రిస్పీగా మారేంత వరకు వేయించండి.
- బ్రెడ్ ఉప్మా రెడీ అయినట్లే, నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకోండి.
Vegetable Sandwich Recipe- వెజ్ శాండ్‌విచ్ రెసిపీ
కావలసిన పదార్థాలు:
- 2 బ్రెడ్
- 1/2 దోసకాయ
- 1 టీస్పూన్ల వెజ్ మయోనైస్
- 1 టీస్పూన్ టొమాటో సాస్
- 1 స్పూన్ వెన్న
- రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి
తయారీ విధానం:
- ముందుగా బ్రెడ్ ముక్కలను తీసుకొని వాటికి వెన్న రాయండి.
- ఆపై కొద్దిగా టొమాటో సాస్, ఒక టీస్పూన్ వెజ్ మయోనైస్ అప్లై చేయాలి.
- ఇప్పుడు ఒక దోసకాయను వృతాకార ముక్కలుగా కట్ చేసుకొని ఒక బ్రెడ్ మీద పెట్టుకోవాలి.
- ఆపై రుచికోసం వాటిపైన మిరియాల పొడి, ఉప్పు చల్లుకోవాలి.
- చివరగా మరో బ్రెడ్ ముక్కతో కప్పేస్తే, వెజ్ శాండ్‌విచ్ రెడీ.
ఈ రుచికరమైన బ్రెడ్ వంటకాలను సులభంగా క్షణాల్లో సిద్ధం చేసుకోవచ్చు. వీలైతే మీరూ ట్రై చేయండి మరి.