Healthy breakfast: కొలెస్ట్రాల్ తగ్గించే 5 అల్పాహారాలు..
09 June 2023, 6:00 IST
Healthy breakfast: ఉదయాన్నే తినే అల్పాహారం ప్రభావం రోజు మొత్తం ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించే అల్పాహారాలేంటో చూసేయండి.
కొలెస్ట్రాల్ తగ్గించె అల్పాహారాలు
ఉదయాన్నే అల్పాహారం తినడం చాలా ముఖ్యం. బ్రేక్‌ఫాస్ట్ లోకి కుకీస్, మఫిన్స్, టోస్ట్, కార్న్ ఫ్లేక్స్ ఇవన్నీ తినడం ఇష్టంగా ఉండొచ్చు కానీ వాటిలో చక్కెర శాతం చాలా ఎక్కువుంటుంది. ఇవన్నీ కొలెస్ట్రాల్ స్థాయుల్ని కూడా పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి తక్కువ కొలెస్ట్రాల్ లేదా కొలెస్ట్రాల్ లేని ఆహారం తినడం చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ తక్కువుండే ఆరోగ్యకరమైన అల్పాహారాలేంటో చూసేయండి.
1. ఓట్ మీల్:
ఓట్స్ లేదా ఓట్ మీల్ ఆరోగ్యకరమైన అల్పాహారం. దీంట్లో ఇష్టమైన పండ్లు ఏవైనా కలుపుకొని తినొచ్చు. సీజన్ బట్టి మామిడిపండ్లు, యాపిల్స్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, అరటిపండు.. ఇలా ఏవైనా కలుపుకోవచ్చు. దీనివల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. వీటిలో ఉండే పీచు వల్ల కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడతాయి.
2. గుడ్లు:
గుడ్లలో ప్రొటీన్న పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అల్పాహారంలో వాడటానికి ఇది చాలా ఉత్తమమైంది. ఉడికించిన గుడ్లు, గుడ్డుతో శ్యాండ్ విచ్, సలాడ్, ఆమ్లెట్ ఇలా ఏదైనా చేసుకోవచ్చు. వీటిలో ఉండే హెల్దీ ఫ్యాట్ వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
3. అవకాడో:
ఇది అన్నిషాపుల్లో విరివిగా దొరుకుతోంది. చాలా ప్రదేశాల్లో పండిస్తున్నారు కూడా. ఈ పండులో మోనో శాచురేటెడ్ కొవ్వులుంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెంచుతాయి. అవకాడో రుచి నచ్చకపోతే బోలెడు రకాలుగా తినొచ్చు.
4. బెర్రీలు:
తియ్యగా ఉండే బెర్రీలలో పీచు అధికం. కొలెస్ట్రాల్ స్థాయుల్ని ఇవి తగ్గిస్తాయి. ఓట్ మీల్ లేదా స్మూతీలు చేసుకునేటపుడు బెర్రీలు కూడా చేర్చుకుంటే మేలు.
5. యోగర్ట్:
ప్రొటీన్ అధికంగా ఉండే దీంట్లో ప్రొబయాటిక్స్ కూడా ఎక్కువే. గట్ ఆరోగ్యంగా ఉంచడంలో, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. తాజా పండ్లు, గింజలు, తేనె కలుపుకుని దీన్ని ఇంకాస్త రుచిగా మార్చేయొచ్చు.
ఆరోగ్యకరమైన అల్పాహారం కొలెస్ట్రాల్ నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయుల్ని అదుపులో ఉంచుకోవచ్చు.