Protein breakfast: గుడ్డు కన్నా ఎక్కువ ప్రొటీన్ ఉండే.. వెజిటేరియన్ అల్పాహారాలు..
07 June 2023, 6:30 IST
Protein breakfast: ప్రొటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం కోసం వెతుకుతున్నారా? గుడ్డుకు బదులుగా ఈ వెజిటేరియన్ అల్పాహారాలు ప్రయత్నించి చూడండి.
క్వినోవా
ఉదయం అల్పాహారంలోకి ప్రొటీన్ ఎక్కువున్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరం. అయితే గుడ్డుకు బదులుగా అంతకన్నా ఎక్కువ ప్రొటీన్ ఉండే వెజిటేరియన్ అల్పాహారాలేంటో చూద్దాం.
ఓట్స్ ఇడ్లి:
ఓట్స్, రవ్వ కలిపి చేసే ఈ ఓట్స్ ఇడ్లీలు ఆరోగ్యకరం. దీంట్లో ఫైబర్ ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉంటుంది. వీటిలో జీలకర్ర, ఆవాలు, క్యారట్ తురుము, కొత్తిమీర కలిపి చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సాంబార్, చట్నీతో తింటే మామూలు ఇడ్లీకి దీనికి తేడా తెలీదు.
క్వినోవా ఉప్మా:
రవ్వకు బదులుగా క్వినోవాతో చేసే ఈ ఉప్మా రుచిలో తీసిపోదు. క్వినోవాలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయలు, టమాటాలు, బఠానీ లాంటి కూరగాయలు, అల్లం,పసుపు, కరివేపాకు ఇంకా మసాలాలతో కలపి వండితే రుచి చాలా బాగుంటుంది.
శనగల సలాడ్:
శనగల సలాడ్ మంచి తాజా అల్పాహారం. ఉడికించిన శనగల్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కీర దోస ముక్కలు వేసుకోవచ్చు. కాస్త రుచి కోసం నిమ్మరసం, చాట్ మసాలా, జీలకర్ర పొడి కలుపుకోవచ్చు. ఇంకాస్త ప్రొటీన్ ఎక్కువుండాలంటే పనీర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు.
పెసరపప్పు దోశ:
పెసరపప్పు, దోశలో కలిపి ఈ పెసరపప్పు దోశ చేస్తారు. పొట్టు పెసరపప్పును దీనికోసం వాడితే రుచి ఇంకాస్త బాగుంటుంది. ఇవి సన్నగా క్రిస్పీగా చేసుకోవచ్చు. సింపుల్ చట్నీ లేదా సాంబర్ తో సర్వ్ చేస్తే చాలు.
పనీర్ బుర్జి:
పనీర్ బుర్జిని అల్పాహారంలో తీసుకోవడం ఆరోగ్యకరం. పన్నీర్‌ను ఉల్లిపాయలు, క్యాప్సికం, గరం మసాలా, మిర్చి పొడితో కలిపి పనీర్ బుర్జి వండుకోవాలి. ప్రొటీన్ ఎక్కువున్న అల్పాహారానికి ఇది మంచి ఎంపిక. దీన్ని రోటీ లేదా బ్రెడ్ తో సర్వ్ చేయొచ్చు.