తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Snacks Recipes । కేవలం 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆరోగ్యకరమైన స్నాక్స్ !

Healthy Snacks Recipes । కేవలం 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆరోగ్యకరమైన స్నాక్స్ !

HT Telugu Desk HT Telugu

29 November 2022, 17:51 IST

google News
    • Healthy Snacks Recipes: ప్యాకేజ్ చేసిన స్నాక్స్, బయట నూనెలో వేయించిన స్నాక్స్ ఆరోగ్యానికి మంచివి కావు. 5 నిమిషాల్లో సులభంగా ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎలా చేసుకోవాలో స్టార్ హోటెల్ చెఫ్ రెసిపీలు అందించారు, అవి ఇక్కడ చూడండి.
Healthy Snacks Recipes
Healthy Snacks Recipes (iStock)

Healthy Snacks Recipes

చిన్నగా ఆకలి వేస్తుంటే చిరుతిళ్లు మీ అవసరాలను తీర్చగలవు. మీరు రోజులో ఏ సమయంలో అయినా, పనులతో ఎంత బిజీగా ఉన్నా చిరుతిళ్లు మీ కడుపు మాడకుండా చూసి మిమ్మల్ని శాంతింపజేయగలవు. అయితే చిరుతిళ్లు అనగానే చాలా మంది బయట నెలల తరబడి వాడే నూనెలో చేసినవి లేదా, స్టోర్లలో రెడీమేడ్‌గా దొరికేవి స్టాక్ తెచ్చిపెట్టుకుంటారు. ముఖ్యంగా హాస్టల్లో ఉండే అమ్మాయిలయితే, వారి బాక్స్ నిండా ఇలాంటి స్నాక్స్ నిండుగా ఉంటాయి. అర్ధరాత్రి అందరూ పడుకున్నప్పుడు పిల్లిలా నిద్రలేచి, మెల్లిగా దుప్పట్లోకి దూరి ఎలుకలా కరకర నమిలేస్తారు.

అయితే ఇక్కడ విషయం అది కాదు. సమయంతో సంబంధం లేకుండా ఇలా స్నాక్స్ తినడం, అవి కూడా అనారోగ్యకరమైన స్నాక్స్‌ను తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తింటే ఆరోగ్యం, ఆనందం రెండూ మీ సొంతం అవుతాయి.

గ్రేటర్ నోయిడాలోని క్రౌన్ ప్లాజాలో ఎగ్జిక్యూటివ్ చెఫ్ అయిన సౌరభ్ సింగ్ చందేల్.. కేవలం 5 నిమిషాల్లోనే చేసుకోగలిగే ఆరోగ్యకరమైన స్నాక్స్ రెసిపీలను HT లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు. మరీ రెసిపీలను మీరు తెలుసుకొని, కరకరలాడించండి.

మింటీ ఫాక్స్ నట్స్ కోసం కావలసినవి:

  • 20 గ్రా ఫాక్స్‌నట్స్/ మఖానా/ తామర గింజలు
  • 20 ml నెయ్యి లేదా ఆలివ్ నూనె
  • 5 గ్రాముల పుదీనా పొడి
  • 1 గ్రా చాట్ మసాలా పౌడర్

Minty Fox Nuts Recipe తయారీ విధానం

1. ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి, మఖానా వేసి 2-3 నిమిషాల పాటు తక్కువ వేడి మీద వేయించాలి.

2. మళ్లీ అదే పాన్ మధ్యలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి, పొడి పుదీనా పొడి, చాట్ మసాలా పొడి వేసి, వేయించిన ఫాక్స్‌నట్‌లను బాగా కలపాలి.

3. ఒక నిమిషం పాటు వేయిస్తే, మింటీ ఫాక్స్‌ నట్‌లు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి

ఝల్ మురి/ మసాలా ముర్మురా కోసం కావలసినవి:

  • 10 గ్రాముల ముర్మురా లేదా వరి ప్యాలాలు
  • 1 ఉడికించిన బంగాళాదుంప ముక్కలు
  • 1 గ్రా సన్నగా తరిగిన అల్లం
  • 1 గ్రా సన్నగా తరిగిన పచ్చిమిర్చి
  • 2 గ్రా ఆలూ భుజియా
  • 1 గ్రా ఉప్పు
  • 2 గ్రా సన్నగా తరిగిన ఉల్లిపాయ
  • 4 గ్రాముల సన్నగా తరిగిన టమోటా
  • 4 గ్రాముల చిన్న సన్నగా తరిగిన దోసకాయ
  • 5 గ్రా పచ్చి వేరుశెనగ
  • 3 ml పుదీనా చట్నీ
  • 1 గ్రా కొత్తిమీర

Masala Murmura/ Jhal Muri Recipe తయారీ విధానం

1. ముందుగా ఒక లోతైన గాజు గిన్నె తీసుకుని అందులో ముర్మురా, టొమాటో ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, దోసకాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన లేదా పచ్చి వేరుశెనగ, కారంపూస వేయండి. ఈ పదార్థాలను ఒక చెంచాతో మెత్తగా కలపండి.

2. అన్నీ బాగా మిక్స్ అయ్యాక అందులో గ్రీన్ చట్నీ, ఉప్పు వేయాలి మళ్లీ మళ్లీ మెత్తగా కలపండి.

3. ఇప్పుడు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే మసాలా ముర్మురా రెడీ.

తదుపరి వ్యాసం